
Pakistan : దాయాది దేశం పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పటికే ఫైనాన్సియల్, ఇంధన సమస్యతో సతమతమవుతున్న ఆ దేశానికి తాజాగా పవర్ సమస్య కూడా తోడయింది. వివిధ దేశాల నుంచి ఆర్థికసాయం కోసం వెంపర్లాడుతోన్న పాక్‌కు ఈ సమస్య మరో తలనొప్పిని తెచ్చిపెట్టింది. దీంతో దేశంలో రాత్రి తొమ్మిది గంటలు దాటిందంటే చాలు దేశమంతా చీకటి కమ్ముకుంటోంది. మార్కెట్లన్నీ బంద్ చేయాల్సిన పరిస్థితి. దుకాణాల్లో లైట్ వేస్తే జరిమాన తప్పదు. దీంతో ఆ దేశ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. నిజానికి పాక్‌లో ‘పవర్’ సంక్షోభం కొత్తదేమి కాదు. అయినా పాక్ లో ఎప్పుడూ ఏదో ఓ రకమైన రాజకీయ అనిశ్చితి కొనసాగుతూనే ఉంటుంది. దీనికి ఇప్పుడు తాజాగా పవర్ క్రైసిస్ తోడైంది అంతే. అదే విద్యుత్ సంక్షోభం.. దీంతో పాక్ కరెంట్ కోసం కష్టాలు పడుతోంది. దీంతో ప్రతి రోజు ఫలానా సమయం వరకే విద్యుత్ సరఫరా ఉంటుందని.. ఆ తర్వాత కోత తప్పదని ప్రభుత్వం అధికారికంగానే ప్రకటించింది. అంటే పాకిస్థాన్ ఓ రకమైన లాక్‌డౌన్‌లోనే ఉందన్న మాట. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, దేశం ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడం.. వ్యవస్థాగతంగా ఉన్న వైఫల్యాలు ఇలా అన్నీ కలిపి పాకిస్థాన్‌ను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి.
Also Read : టెక్ దిగ్గజం ఆపిల్‌లో ఉద్యోగాల కోత.. రెండు నెలల్లో రెండోసారి..
ఈ క్రమంలో విద్యుత్, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పాకిస్థాన్ క్యాబినెట్ సెప్టెంబర్ 17న అధికారికంగా కొత్త రూల్స్ విడుదల చేసింది. దీని ప్రకారం దేశ వ్యాప్తంగా మార్కెట్లు, షాపింగ్ మాల్స్ అన్ని కూడా రాత్రి 9 గంటలకే మూసివేయాలని ఆదేశించింది. అలాగే వెడ్డింగ్ హాల్స్, ఇతర ఈవెంట్ వేదికలు రాత్రి 10 గంటల వరకు క్లోజ్ చేయాలని ఆర్డర్స్ జారీ చేసింది. రెస్టారెంట్లు, కేఫ్‌లు, ఫుడ్ అవుట్లెట్లు రాత్రి 11 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచడానికి అనుమతించింది. అయితే పార్శిల్, హోమ్ డెలివరీ సేవలకు మాత్రం మినహాయింపునిచ్చింది. ఇదే కాక పెళ్లిళ్లలో విందుకు కేవలం ఒక వంటకం మాత్రమే వడ్డించేలా పరిమితి విధించడం గమనార్హం. ఒకవైపు ఇంధన కొరత, మరోవైపు విద్యుత్ సంక్షోభంతో సతమతమవుతున్న పాక్ ప్రభుత్వ శాఖల అధికారిక కార్యక్రమాలను సైతం కుదించింది. అన్ని రకాల కార్యక్రమాలు రాత్రి తొమ్మిదిలోపు పూర్తి కావాలని ఆదేశించింది. వాహనాల వినియోగం, కార్యాలయాల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని ఆదేశించింది.
Also Read : యూఎస్–ఇజ్రాయెల్ ఇరాన్‌పై భారీ దాడికి సిద్ధమవుతున్నాయా?









