POK : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో ఇస్లామాబాద్ ప్రభుత్వ నిరంకుశ, అణచివేత ధోరణులకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రజా నిరసనలు ఇప్పుడు ఉగ్రరూపం దాల్చాయి. గత కొన్ని రోజులుగా సాగుతున్న శాంతియుత ఆందోళనలు, ప్రస్తుత ప్రభుత్వ మొండివైఖరి కారణంగా ఒకేసారి తీవ్ర స్థాయి పోరాటంగా రూపాంతరం చెందాయి. రావల్కోట్, ముజఫరాబాద్ వంటి ప్రధాన నగరాలతో పాటు పీవోకే వ్యాప్తంగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి పాక్ పాలకులకు వ్యతిరేకంగా దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేస్తున్నారు.ఈ చారిత్రక ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ‘జమ్మూకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ’ (JKAAC) పాకిస్థాన్ ప్రభుత్వానికి అత్యంత కీలకమైన అల్టిమేటం జారీ చేసింది. తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చకపోతే.. పాక్ ప్రభుత్వానికి తాము ఇచ్చే 48 గంటల డెడ్‌లైన్ ముగిసిన తర్వాత, జులై 9న పీవోకే వ్యాప్తంగా ‘ఫైనల్ యాక్షన్’ (తీవ్రస్థాయి తుది పోరాటం) ప్రారంభిస్తామని కమిటీ తెగేసి చెప్పింది.

ప్రభుత్వం నిర్ణీత గడువులోగా స్పందించకుంటే జులై 9న చరిత్రలో నిలిచిపోయేలా అతిపెద్ద ఉమ్మడి పోరాటం చేపడతామని నిరసనకారుల కమిటీ స్పష్టం చేసింది. తమ డిమాండ్లపై అధికారికంగా స్పష్టమైన నిర్ణయం వచ్చేవరకు ఎట్టిపరిస్థితుల్లోనూ ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు ఆపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. పీవోకేలోని స్థానిక ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో నివసిస్తున్న ప్రవాస కశ్మీరీ సమాజం అంతా జులై 9న జరగబోయే ఈ మహా ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది. పీవోకేలో స్థానిక ప్రజల గొంతు నొక్కేందుకు పాక్ పాలకులు ఏ విధంగా ప్రయత్నిస్తున్నారో, అక్కడ ఎలాంటి అణచివేత సాగుతుందో ప్రపంచానికి కళ్లకట్టినట్లు చూపించేందుకు జేఏఏసీ ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. జులై 9న ఐక్యరాజ్యసమితి (UN), ఇస్లామిక్ సహకార సంస్థ (OIC), అంతర్జాతీయ మీడియా సంస్థలు, గ్లోబల్ హ్యూమన్ రైట్స్ (మానవహక్కుల) సంఘాల ప్రతినిధులు పీవోకేకు రావాలని అధికారికంగా ఆహ్వానించింది. ఇక్కడి వాస్తవ పరిస్థితులను, మానవ హక్కుల ఉల్లంఘనలను స్వయంగా పరిశీలించాలని కోరింది.

Also Read : అమెరికా ‘పెంటగాన్’కు చెక్.. ఈజిప్ట్‌లో 22,000 ఎకరాల్లో అతిపెద్ద ‘ఆక్టగాన్’ మిలిటరీ హెడ్‌క్వార్టర్స్!

ప్రస్తుతం పాక్ ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఈ జేఏఏసీ (JAAC) అనేది ఒక రాజకీయ పార్టీ కాదు. ఇది పీవోకే పరిధిలో అత్యంత క్రియాశీలకంగా పనిచేస్తున్న వివిధ సామాజిక, వ్యాపార, విద్యార్థి , పౌర సంఘాల ఉమ్మడి ఐక్య వేదిక. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో విపరీతంగా పెరిగిన ద్రవ్యోల్బణం, మితిమీరిన విద్యుత్ ఛార్జీలు, సామాన్యులపై మోపిన భారమైన పన్నుల వ్యవస్థ, నిత్యావసర వస్తువుల కృత్రిమ కొరత,స్థానిక ప్రజల ప్రాథమిక హక్కుల కోసం ఈ సంస్థ నిరంతరం పోరాటాలు చేస్తోంది. ప్రస్తుతం జేఏఏసీ ప్రభుత్వం ముందు ప్రధానంగా కొన్ని డిమాండ్లను ఉంచింది. పీవోకేలో నిలిపివేసిన కమ్యూనికేషన్, సమాచార వ్యవస్థను వెంటనే పునరుద్ధరించాలని, ప్రజల ఆకలిని చంపేలా ఆహారం,అత్యవసర మందుల సరఫరాను అడ్డుకోవద్దని డిమాండ్ చేస్తోంది. వీటితో పాటు, గతంలో ప్రభుత్వం తమతో కుదుర్చుకున్న ’38 పాయింట్ల ఒప్పందాన్ని’ తక్షణమే అమలు చేయాలని, అక్రమంగా నిర్బంధించిన తమ నాయకులను, కార్యకర్తలను వెంటనే విడిచిపెట్టాలని పట్టుబడుతోంది.

పీవోకేలోని పలు ప్రాంతాల్లో పోలీసులు, నిరసనకారుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణలలో భద్రతా బలగాలు జరిపిన కాల్పులకు ఒకరు మరణించగా, పలువురు గాయపడినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజల న్యాయమైన డిమాండ్లకు పాక్ ప్రభుత్వం తూటాలు, హింసతో స్పందిస్తే సహించేది లేదని జేఏఏసీ హెచ్చరించింది. తమ గొంతు నొక్కాలని చూస్తే తమకు ఇతర మార్గాలు కూడా ఉన్నాయని ఇస్లామాబాద్ పాలకులను మరోసారి హెచ్చరించింది. అయితే డెడ్‌లైన్ గడువు ముగిసేవరకు తమ మద్దతుదారులంతా క్రమశిక్షణతో వ్యవహరించాలని కోరింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, నిరసనల సంఘం ప్రముఖ నాయకుడు సర్దార్ అమన్ ఖాన్ మాట్లాడినట్లు ఉన్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆయన భారతదేశానికి, అలాగే ఎల్ఓసీ (LoC) అవతలి వైపు ఉన్న కశ్మీరీ ప్రజలకు ఒక కీలకమైన విజ్ఞప్తి చేశారు. “మాకు ప్రస్తుతం భారతదేశం యొక్క సహాయం అత్యంత అవసరం. పీవోకేలో ఆహారపదార్థాలు, మందులు, ఇతర అత్యవసర వస్తువుల కొరత తీవ్రంగా ఉంది. మానవతా దృక్పథంతో భారత్ మమ్మల్ని ఆదుకోవాలి” అని ఆయన కోరడం సంచలనంగా మారింది.

పాక్ ప్రభుత్వం తమపై విపరీతమైన ఆర్థిక ఆంక్షలు విధించిందని, పీవోకే లోపలికి ఎలాంటి వస్తువులు రాకుండా ఆర్థిక దిగ్బంధనాన్ని అమలు చేస్తోందని సర్దార్ అమన్ ఖాన్ ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, కఠినమైన చర్యల వల్ల ఇక్కడి సామాన్య ప్రజలు రోజువారీ కనీస అవసరాల కోసం, తిండి కోసం అల్లాడిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్వంత పౌరులపైనే ఒక ప్రభుత్వం ఇంతటి అమానవీయ చర్యలకు పాల్పడటం దారుణమన్నారు. ఒకవేళ పీవోకేలో పరిస్థితులు మరింత దిగజారి, పాక్ సైన్యం ప్రజాసంహారానికి దిగితే.. తాము ప్రాణాలు దక్కించుకోవడానికి భారత్‌ వైపు వచ్చేందుకు వీలుగా నియంత్రణ రేఖ (LoC) వెంట ఉన్న సరిహద్దులను తెరవాలని అమన్ ఖాన్ భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శరణార్థులుగానైనా తాము భారత్‌లోకి వస్తామని, కన్నతల్లి లాంటి భారతదేశమే తమ్ము ఆదుకోవాలని వారు భావిస్తున్నట్లు ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది.

గత కొన్ని వారాలుగా పీవోకేలో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న ఈ ప్రజా తిరుగుబాటును అణచివేయడానికి పాకిస్థాన్ ప్రభుత్వం క్రూరమైన ఎత్తుగడలు వేసింది. ఈ ప్రజా ఆందోళనలకు మద్దతు ఇస్తున్న జేఏఏసీ (JAAC)ని పాక్ ప్రభుత్వం ఏకంగా ‘ఉగ్రవాద వ్యతిరేక చట్టం’ కింద నిషేధించి కక్షసాధింపుకు దిగింది. ఈ కమిటీకి చెందిన సుమారు 600 మందికి పైగా సామాజిక నాయకులను, కార్యకర్తలను భద్రతా బలగాలు అక్రమంగా అరెస్టు చేసి జైళ్లలో బంధించాయి. నిరసనకారులను ఆకలితో లొంగతీసుకోవడానికి పీవోకే లోపలికి వెళ్తున్న నిత్యావసర సరకులు, ఆహార పదార్థాలు, అత్యవసర మందుల రవాణాను పాక్ సరిహద్దుల వద్దే నిలిపివేసి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో జేఏఏసీ విధించిన 48 గంటల గడువు ముగియనుండటంతో జులై 9న ఏం జరగబోతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. పీవోకే ప్రజల తిరుగుబాటు, భారత సహాయం కోసం వారు చేస్తున్న అభ్యర్థనలు ఇప్పుడు అంతర్జాతీయ రక్షణ, రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Also Read : ఇరాక్ ఎంపీ ఇంట్లో బంగారు బికినీ.. సోషల్ మీడియాలో షాకింగ్ ఫోటోలు వైరల్ !

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.