Pakistani TikTok Star Shot Dead
Pakistani TikTok Star Shot Dead

లక్షల్లో ఫాలోవర్స్.. కోట్లలో లైక్స్.. సోషల్ మీడియాలో స్టార్‌డమ్.. కానీ అదే స్క్రీన్ వెనుక ఆమె ఊహించని ఒక డెత్ ట్రాప్ దాగుంది. ఆగస్టు 14.. దేశమంతా ఇండిపెండెన్స్ డే సంబరాల్లో మునిగిపోయిన వేళ.. పట్టపగలు, రోడ్డు మీదే ఒక కారును టార్గెట్ చేస్తూ పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో బుల్లెట్ల వర్షం కురిసింది. కేవలం 28 ఏళ్ల ఒక పాపులర్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ బుల్లెట్లకు తూటాలకు బలయ్యారు.

ఆమె పేరే షమ్సో బీబీ.. నెట్టింట ఆయేషా గిలమానా అంటే తెలియని వారు లేరు. అసలు ఒకే ఒక్క ఫోన్ కాల్‌తో మొదలైన ఈ మిస్టరీ ఏంటి? కేవలం ఫాలోవర్స్ పెరిగారని టార్గెట్ చేశారా… లేక దీని వెనుక ఇంకేదైనా బిగ్ మనీ గేమ్ దాగుందా? పాకిస్తాన్‌లో ఫిమేల్ సోషల్ మీడియా క్రియేటర్లను వరుసగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అసలు ఆ రోజు ఏం జరిగింది?

సీన్ కట్ చేస్తే… పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు కేవలం 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న తక్సిలా నగరం. ఇండిపెండెన్స్ డే కావడంతో రోడ్లన్నీ రద్దీగా ఉన్నాయి. సరిగ్గా అదే సమయంలో షమ్సో బీబీకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. కాల్ చేసింది కాశిఫ్ అలియాస్ ‘కాశీ’ అనే వ్యక్తి. వెంటనే ఇంటి బయటకు వచ్చి తనను కలవాలని చెప్పాడు. ఆ మాట నమ్మి షమ్సో బీబీ తన 15 ఏళ్ల చెల్లెలు అసీమా, తమ్ముడు నైమతుల్లాలతో కలిసి కారులో బయలుదేరింది. కారు ముందుకు కదులుతోంది. మరికొద్ది నిమిషాల్లో వారు గమ్యానికి చేరుకోవాలి. సరిగ్గా అదే సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు అగంతకులు చేతుల్లో గన్స్‌తో కారును చేజ్ చేశారు. క్షణాల వ్యవధిలో కారును ఓవర్‌టేక్ చేసి అడ్డగించారు. కారు విండో దగ్గరకు వచ్చి ఏమాత్రం ఆలోచించకుండా అతి సమీపం నుండి ట్రిగ్గర్ నొక్కారు.

తుపాకీ నుంచి దూసుకొచ్చిన తూటా నేరుగా షమ్సో బీబీ మెడలోకి దిగిపోయింది. రక్తం కారుతూ ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆ భయానక వాతావరణంలో కంట్రోల్ తప్పిన కారు ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. కారులో ఉన్న 15 ఏళ్ల అసీమా తీవ్ర రక్తగాయాలతో రోడ్డుపై పడిపోయింది. పక్కనే ఉన్న తమ్ముడు నైమతుల్లా కళ్ల ముందే తన అక్క ప్రాణాలు కోల్పోవడం చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు.

ఈ మొత్తం అటాక్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. ఇద్దరు వ్యక్తులు అత్యంత పక్కా ప్లానింగ్‌తో బైక్‌పై వచ్చి, ప్రొఫెషనల్ కిల్లర్స్‌లా దాడి చేసి క్షణాల్లో అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన బాలికను, షమ్సో మృతదేహాన్ని తక్సిలాలోని టీహెచ్‌క్యూ ఆసుపత్రికి తరలించారు.

Also Read : 400 మంది కార్మికుల జీతాలు ఎగ్గొట్టిన భారతీయ వ్యాపారి.. సింగపూర్ కోర్టు సంచలన తీర్పు!

అసలు ఈ మర్డర్ వెనుక ఉన్న మోటివ్ ఏంటి? షమ్సో బీబీ టిక్‌టాక్‌లో 13 లక్షల మందికి పైగా ఫాలోవర్స్, 3.5 కోట్ల లైక్స్ సంపాదించుకున్న పెద్ద సెలబ్రిటీ. ఆమె చనిపోయిన వెంటనే కుటుంబ సభ్యులు ఆ అకౌంట్‌ను డియాక్టివేట్ చేశారు. అయితే ఇది కేవలం సోషల్ మీడియా స్టార్‌డమ్ వల్ల జరిగిన హత్య కాదని ఆమె కుటుంబం బాంబు పేల్చింది. దీని వెనుక పెద్ద ఫైనాన్షియల్ డిస్ప్యూట్ దాగుందని ఆమె తండ్రి ఫజల్ సాహిబ్జాదా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కౌసర్, జావేద్ అలియాస్ షాహీన్ అనే ఇద్దరు వ్యక్తులతో షమ్సోకు గత కొంతకాలంగా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని, డబ్బు తిరిగి ఇవ్వాలంటూ వారు ఆమెను చంపేస్తామని బెదిరించారని ఆమె సోదరుడు రెహ్మతుల్లా వెల్లడించారు. ఈ బెదిరింపులపై గతంలోనే ఇస్లామాబాద్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కాశీ అనే వ్యక్తి ఆమెను నమ్మించి బయటకు రప్పించాడని, కౌసర్, జావేద్ ప్లాన్ ప్రకారమే ప్రొఫెషనల్ కిల్లర్స్‌తో ఈ హత్య చేయించారని కుటుంబం బలంగా ఆరోపిస్తోంది.

ప్రస్తుతం రావల్పిండి స్పెషల్ పోలీస్ టీమ్ రంగంలోకి దిగింది. హంతకులకు ఆశ్రయం కల్పించి, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కాల్పులు జరిపిన మెయిన్ షూటర్లు ఇంకా పరారీలోనే ఉన్నారు. బాధితురాలి సోదరుడు పంజాబ్ సీఎం మరియం నవాజ్ షరీఫ్‌కు విజ్ఞప్తి చేస్తూ, తమకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇక్కడ మనం గమనించాల్సిన మరో బిగ్ పాయింట్ ఏంటంటే… పాకిస్తాన్‌లో మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్లపై దాడులు కొత్తేమీ కాదు. 8 కోట్ల మంది టిక్‌టాక్ యూజర్లు ఉన్న ఆ దేశంలో, సోషల్ మీడియా ద్వారా మహిళలు ఆర్థికంగా నిలబడడాన్ని అక్కడి పాత సమాజం జీర్ణించుకోలేకపోతోంది.
2026 మార్చిలో పాపులర్ క్రియేటర్ సనా జావేద్ (ఔట్‌లోఫారా) భర్త చేతిలో కాల్చి చంపబడింది.
2025 జూన్‌లో ప్రపోజల్ తిరస్కరించిందన్న కోపంతో 17 ఏళ్ల సనా యూసఫ్‌ను ఇంట్లోనే కాల్చి చంపారు.
2025 జూలైలో 16 ఏళ్ల మెహక్ షెహజాది పరువు హత్యకు గురైంది.
సింధ్ ప్రావిన్స్‌లో సుమీరా రాజ్‌పుత్ అనుమానాస్పద స్థితిలో మరణించింది.
గడిచిన ఏడాది కాలంలోనే దాదాపు 8 మంది మహిళా సోషల్ మీడియా క్రియేటర్లు దాడులకు, హత్యలకు బలయ్యారు.

షమ్సో బీబీ హత్య వెనుక ఆర్థిక వివాదాలు ఉన్నాయని కుటుంబం చెబుతున్నప్పటికీ, ఒక మహిళ సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకుని ఎదుగుతున్నప్పుడు ఎదురయ్యే భద్రతా లోపాలు మరోసారి స్పష్టంగా బయటపడ్డాయి. నమ్మించి పిలిచింది ఎవరు? పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరిపించింది ఎవరు? తెర వెనుక ఉన్న అసలు సూత్రధారులు కటకటాల వెనక్కి వస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఈ కేసుపై పాకిస్తాన్ పోలీసులు ఎలాంటి విచారణ జరుపుతారో వేచి చూడాలి.

Also Read : టిక్‌టాక్‌ టు గ్యాంగ్‌ స్టర్‌.. నగరంలోనూ షహజాద్‌ భట్టీ నెట్‌ వర్క్‌.. చెక్‌ పెట్టిన ఆర్మీ