Muslim NATO
Muslim NATO

పాకిస్థాన్ దగ్గర అణుబాంబు.. తుర్కియే దగ్గర NATO స్థాయి సైనిక శక్తి.. సౌదీ అరేబియా ప్రపంచంలోనే అత్యంత భారీ రక్షణ బడ్జెట్లలో ఒకటి.. ఈ మూడు దేశాలు ఇప్పుడు ఒకే గొడుగు కిందకు వచ్చాయి. ఒక దేశంపై దాడి జరిగితే.. అది ముగ్గురిపై దాడి జరిగినట్లే పరిగణిస్తామని ప్రకటించాయి. అసలు ఈ మూడు దేశాలు ఎందుకు చేతులు కలిపాయి? ఇది నిజంగానే ముస్లీం NATOగా మారబోతుందా? ఈ కూటమిలోకి ఈజిప్ట్ కూడా రానుంది. దీంతో ఇప్పుడు పశ్చిమాసియాలో శక్తి సమీకరణం (Power Equation) ఎలా మారుతుంది? ముఖ్యంగా ఇరాన్‌తో యుద్ధం జరుగుతున్న సమయంలోనే ఇవి ఎందుకు ఒకటవుతున్నాయి ? ఇది ఇరాన్‌ను టార్గెట్ చేయడానికా? లేక అమెరికాపై ఆధారపడకుండా తమ సెక్యురిటీను తామే చూసుకోవాలన్న ప్రయత్నమా?.. ఈ మూడు కలిస్తే భారత్‌పై పడే ఎఫెక్ట్ ఏంటి ? ఈ స్టోరీలో క్లియర్‌గా తెలుసుకుందాం.

సౌదీ అరేబియాలోని మక్కాలో ఆగస్టు 7న జరిగిన ఒక కీలక సమావేశం ఇప్పుడు ప్రపంచ రాజకీయాలను కుదిపేస్తోంది. సౌదీ అరేబియా ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహ్‌బాజ్ షరీఫ్, తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డొగాన్.. ఈ ముగ్గురు కలిసి ”మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్”పై సంతకం చేశారు. ఈ ఒప్పందంలోని అత్యంత కీలకమైన అంశం ఏంటంటే.. ఈ మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై అయినా ఆయుధాలతో దాడి జరిగితే.. దాన్ని మిగిలిన రెండు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు. అంటే ఒకరికి ప్రమాదం వస్తే మిగిలిన ఇద్దరూ కూడా స్పందించాల్సిన సమిష్టి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు.

ఇదే అంశాన్ని తుర్కియే విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ మరింత స్పష్టంగా చెప్పారు. ఈ పరస్పర రక్షణ నిబంధన టెక్నికల్‌గా NATOలోని ఆర్టికల్ 5కు చాలా దగ్గరగా ఉంటుందని ఆయన చెప్పారు. అయితే NATOలో ఉన్నట్టుగా ఏ దాడికైనా తప్పనిసరిగా పూర్తి స్థాయి యుద్ధంలోకి దిగాల్సిందే అనే అర్థం కాదని కూడా స్పష్టం చేశారు. ఒక దేశం సహాయం కోరితే.. మిగిలిన దేశాలు పరిస్థితిని బట్టి నిఘా సమాచార మార్పిడి చేయొచ్చు.. లాజిస్టిక్స్ సపోర్ట్ ఇవ్వొచ్చు.. డిఫెన్స్ ఎక్యూప్‌మెంట్ అందించొచ్చు.. అవసరమైతే మిలటరీ యూనిట్స్‌ను కూడా పంపొచ్చు. అంటే ఈ ఒప్పందంలో రెస్పాన్స్ బహుళ-స్థాయిలో ఉండవచ్చు (Response can be multi-layered) అన్నమాట.

Also Read : ఐదు దశాబ్దాల నష్టాలకు పరిహారం చెల్లించాల్సిందే…ఇరాన్‌కు ట్రంప్‌ మరో డిమాండ్‌

అందుకే ఈ ఒప్పందాన్ని వెంటనే “NATO 2.0” అని పిలవడం సరైంది కాదు. NATOకు 32 సభ్య దేశాలు ఉన్నాయి. దానికి దశాబ్దాలుగా ఏర్పడిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ స్ట్రక్చర్, పెద్ద స్థాయి జాయింట్ మిలిటరీ ప్లానింగ్, విస్తృతమైన ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఉంది. మక్కా ఒప్పందం మాత్రం ఇప్పటికి మూడు దేశాలతో ప్రారంభమైన కొత్త ప్రాంతీయ భద్రతా విధానం. ఈ కూటమి కోసం సౌదీ అరేబియాలో ఒక శాశ్వత సచివాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విదేశాంగ మంత్రులు, డిఫెన్స్ మంత్రులు, మిలిటరీ చీఫ్స్ స్థాయిలో రెగ్యులర్ మీటింగ్స్ కూడా జరగనున్నాయి. అంటే ఇది కేవలం ఒక ప్రకటన కాదు.. క్రమంగా ఒక ఇన్‌స్టిట్యూషనల్ స్ట్రక్చర్ గా మారే ప్రయత్నం కనిపిస్తోంది.

ఇక అసలు ప్రశ్న.. ఈ కూటమి ఇప్పుడే ఎందుకు ఏర్పడింది? దీనికి మిడిల్ ఈస్ట్‌లో గత కొన్ని నెలలుగా జరిగిన పరిణామాలే ప్రధాన కారణం. అమెరికా-ఇరాన్ యుద్ధం, గల్ఫ్ దేశాలపై మిస్సైల్, డ్రోన్ అటాక్స్, ఆయిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై దాడులు, హోర్ముజ్ జలసంధి చుట్టూ ఏర్పడిన సంక్షోభం.. ఇవన్నీ గల్ఫ్ దేశాలకు ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. తమ సెక్యూరిటీ కోసం పూర్తిగా ఒకే ఎక్స్‌ట్రనల్ పవర్‌పై ఆధారపడటం రిస్కీ కావచ్చనే ఆలోచన పెరిగింది. ముఖ్యంగా సౌదీ అరేబియాకు.. అమెరికాపై ఆధారపడటం మాత్రమే కాకుండా.. పాకిస్థాన్, తుర్కియే వంటి ప్రాంతీయ శక్తులతో కూడా వ్యూహాత్మక భాగస్వామ్యాలు పెంచుకోవాలన్న అవసరం కనిపించింది. అందుకే ఈ కొత్త ఒప్పందంతో తుర్కియే, పాకిస్థాన్‌తో కలిసిందని చెప్పొచ్చు.

ఇందులో పాకిస్థాన్ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంది. పాకిస్థాన్‌-సౌదీ అరేబియా మధ్య అసలైన వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం గతేడాది సెప్టెంబర్‌లోనే కుదిరింది. ఆ ఒప్పందంలో కూడా ఒక దేశంపై దాడి జరిగితే మరో దేశంపై జరిగిన దాడిగా పరిగణించే సూత్రం ఉంది. దశాబ్దాలుగా పాకిస్థాన్ సైనిక సిబ్బంది.. సౌదీలో పనిచేస్తున్నారు. డిఫెన్స్ ట్రైనింగ్, నిఘా సహకారం, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు వంటి రంగాల్లో కూడా రెండు దేశాలకు సుదీర్ఘ సంబంధాలు ఉన్నాయి.

ఇప్పుడు 2026లో ఇరాన్-అమెరికా యుద్ధం సమయంలో ఆ పాత రక్షణ ఒప్పందంకు ఒక ప్రాక్టికల్ టెస్ట్ కూడా వచ్చింది. ఇరాన్.. సౌదీ చమురు కేంద్రాలపై మిస్సైల్, డ్రోన్ అటాక్స్ చేసినప్పుడు.. పాకిస్థాన్ కేవలం మాటలకే పరిమితం కాలేదు. ఏప్రిల్‌లో పాకిస్థాన్ ఫైటర్ జెట్స్, సహాయక విమానాలను సౌదీ అరేబియాకు పంపింది. ఆ తర్వాత మే నెలలో.. సుమారు 8,000 మంది సైనికులు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను కూడా సౌదీకి మోహరించారు. అంటే పాకిస్థాన్ నేరుగా ఇరాన్‌పై దాడికి వెళ్లకపోయినా.. సౌదీ డిఫెన్స్‌ను బలోపేతం చేసే చర్యలు తీసుకుంది.

అసలు పాకిస్థాన్ ఇరాన్‌పై నేరుగా ఎందుకు వెళ్లలేదు అన్న ప్రశ్న ఇక్కడ వస్తుంది. దానికి భౌగోళిక రాజకీయ వాస్తవికత (Geopolitical Reality) కారణం. పాకిస్థాన్‌కు ఇరాన్‌తో ప్రత్యక్ష సరిహద్దు ఉంది. రెండు దేశాల మధ్య సుమారు 900 కిలోమీటర్లకు పైగా సరిహద్దు ప్రాంతం ఉంది. మరోవైపు పాకిస్థాన్ ఇప్పటికే అఫ్గనిస్తాన్ సరిహద్దు సమస్యలు, అంతర్గత భద్రతా సవాళ్లు, ఆర్థిక ఒత్తిళ్లు వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. అలాంటి సమయంలో ఇరాన్‌తో డైరెక్ట్ వార్ మొదలైతే.. పాకిస్తాన్‌కు కొత్త యుద్ధరంగం తెరుచుకున్నట్టే అవుతుంది. అందుకే పాకిస్తాన్ ఒకేసారి రెండు పనులు చేసింది. సౌదీ సెక్యూరిటీకి మిలిటరీ సపోర్ట్ ఇచ్చింది. అదే సమయంలో ఇరాన్ – యూఎస్ మధ్య దౌత్యం (Diplomacy), మధ్యవర్తిత్వం కొనసాగించే ప్రయత్నం చేసింది. ఇదే పాకిస్థాన్‌కు కనిపిస్తున్న వ్యూహాత్మక సమతుల్యత.

ఇప్పుడు ఈ కూటమిలోకి తుర్కియే రావడం ఎందుకు అంత ముఖ్యమంటే.. తుర్కియే దగ్గర పాకిస్థాన్ దగ్గర లేని డిఫెన్స్ టెక్నాలజీ ఉంది. తుర్కియే NATOలో సభ్య దేశంగా ఉంది. NATOలో అమెరికా తర్వాత అతిపెద్ద సైన్యాల్లో ఒకటిగా తుర్కియేను పరిగణిస్తారు. అంతేకాదు.. గత కొన్నేళ్లుగా తుర్కియే తన దేశీయ రక్షణ పరిశ్రమని భారీగా అభివృద్ధి చేసింది. డ్రోన్స్, నౌకాదళ వ్యవస్థలు, మిస్సైల్స్, యుద్ధ వాహనాలు, ఎలక్ట్రానిక్ యుద్ధం, రక్షణ ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో తన సామార్థ్యాన్ని పెంచుకుంది. పాకిస్తాన్‌తో కూడా తుర్కియేకు డిఫెన్స్ ఇండస్ట్రీయల్ సహకారం ఉంది. అందువల్ల ఈ కూటమికి తుర్కియే రావడం అంటే కేవలం మరో దేశం చేరడం కాదు.. టెక్నాలజీ + మిలిటరీ ఎక్స్‌పీరియన్స్ + డిఫెన్స్ ఇండస్ట్రీకూడా కూటమిలోకి చేరడం.

Also Read : జిన్నా చేసిన నమ్మకద్రోహం.. బలూచిస్తాన్‌ను బలితీసుకున్న పాకిస్తాన్!

ఇక సౌదీ అరేబియా గురించి మాట్లాడితే.. సౌదీకి పాకిస్తాన్‌లాగా భారీ క్రియాశీల సైన్యం లేదు. తుర్కియేలాగా పెద్ద- సైనిక-పారిశ్రామిక సముదాయం కూడా లేదు. కానీ సౌదీ దగ్గర వేరే బలం ఉంది.. అది మనీ పవర్. 2025లో సౌదీ అరేబియా సైనిక వ్యయం సుమారు 83.2 బిలియన్ డాలర్లకు చేరింది. సౌదీ ప్రపంచంలో ఎనిమిదో అతిపెద్ద రక్షణ బడ్జెట్ దేశంగా ఉంది. అంటే అవసరమైన అడ్వాన్స్‌డ్ ఫైటర్ జెట్స్, మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్, రాడార్ నెట్‌వర్క్స్, ఎయిర్ డిఫెన్స్, నౌకాదళ పరికరాలు వంటి వ్యవస్థలను కొనుగోలు చేసే ఆర్థిక సామర్థ్యం సౌదీకి చాలా ఎక్కువ.

ఇక పాకిస్థాన్ బలం చూస్తే.. పాకిస్థాన్‌కు పెద్ద శాశ్వత సైన్యం ఉంది. గ్లోబల్ ఫైర్‌పవర్ 2026 అంచనాల ప్రకారం పాకిస్థాన్‌కు సుమారు 6.6 లక్షల శాశ్వత సైన్యం సిబ్బంది, 5.5 లక్షల రిజర్వ్ సిబ్బంది, సుమారు 5 లక్షల పారామిలిటరీ సిబ్బంది ఉన్నారు. దాని ఎయిర్‌ఫోర్స్ లో సుమారు 1,397 విమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఈ మూడు దేశాల్లో అణ్వాయుధాలు కలిగి ఉన్న ఏకైక దేశం. అందుకే సౌదీకి పాకిస్తాన్‌తో డిఫెన్స్ పార్ట్‌నర్‌షిప్‌లో అణు వ్యూహాత్మక కోణం కూడా కనిపిస్తుంది. అయితే న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఈ కొత్త మక్కా ఒప్పందంలో ఎలా, ఎప్పుడు ఉపయోగపడతాయి అనే విషయంపై పబ్లిక్‌గా పూర్తి డీటెయిల్స్ లేవు.

అంటే మూడు దేశాల బలాలను ఒకే లైన్‌లో చెప్పాలంటే.. పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్+ భారీ సైన్యం.. తుర్కియే దగ్గర టెక్నాలజీ + డిఫెన్స్ పరిశ్రమ + NATO ఎక్స్‌పీరియన్స్.. సౌదీ అరేబియా దగ్గర్ డబ్బు + శక్తి సామర్థ్యం + ప్రాంతీయ ప్రభావం ఉన్నాయి. ఈ మూడు కలిస్తే.. ఒక్కో దేశానికి లేని సామర్థ్యాలు ఒకదానికొకటి చేరిపోతాయి. అందుకే ఈ కూటమి చిన్నదైనా వ్యూహాత్మక ప్రాముఖ్యత మాత్రం చాలా ఎక్కువ. ఇప్పుడు ఈ కూటమిలోకి ఈజిప్ట్ కూడా రానుంది. తుర్కియే విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ స్వయంగా ఈజిప్ట్‌ను “సహజ భాగస్వామి”గా అభివర్ణిస్తూ.. తదుపరి దశలో ఈజిప్ట్ చేరుతుందని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. అంటే ఈజిప్ట్ ఇప్పటికే అధికారిక మెంబర్ కాదు.. కానీ భవిష్యత్ విస్తరణకు అత్యంత ముఖ్యమైన అభ్యర్థి.

ఈజిప్ట్ చేరితే ఈ కూటమి భౌగోళికంగా కూడా చాలా కీలకమైన రూపం తీసుకుంటుంది. పాకిస్థాన్ దక్షిణ ఆసియాలో ఉంది. సౌదీ అరేబియా గల్ఫ్‌లో ఉంది. తుర్కియే ఐరోపా–ఆసియా మధ్యలో ఉంది. ఈజిప్ట్ ఉత్తర ఆఫ్రికా, ఎర్ర సముద్రం లాంటి ప్రాంతాలను కలుపుతుంది. అంటే నాలుగు దేశాలు కలిసి పనిచేస్తే బలమైన భద్రతా నెట్‌వర్క్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ కూటమి ఇరాన్‌ను టార్గెట్ చేస్తుందా అనే ప్రశ్నకు ఇప్పటివరకు సభ్య దేశాల నుంచి ఇంకా సమాధానం రాలేదు. తుర్కియే విదేశాంగ మంత్రి స్పష్టంగా.. తాము ఏ ఒక్క దేశాన్ని ఉమ్మడి శత్రువుగా గుర్తించలేదని చెప్పారు. తమపై దాడి చేయని ఏ దేశాన్నీ టార్గట్‌గా చూడడం లేదన్నారు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి కూడా ఈ ఒప్పందం “పూర్తిగా రక్షణాత్మకమైన” అని చెప్పారు. అంటే అధికారికంగా ఈ కూటమి ఇరాన్‌‌కు వ్యతిరేకంగా ఏర్పడిందని చెప్పడానికి ఆధారం లేదు. కానీ భౌగోళిక రాజకీయాలలో ఒక కూటమి ఉద్దేశం ఏంటో చెప్పడం కంటే.. అది ఏ సమయంలో ఏర్పడింది, సభ్య దేశాల వ్యూహాత్మక ప్రయోజనాలు ఏంటో చూడడం కూడా ముఖ్యం.

ఎందుకంటే సౌదీ అరేబియాకు ఇరాన్‌తో ప్రాంతీయ శతృత్వం ఉంది. గల్ఫ్ భద్రత విషయంలో ఇరాన్‌పై సౌదీకి అనుమానాలు పూర్తిగా తొలగిపోలేదు . పాకిస్థాన్‌కు ఇరాన్‌తో సరిహద్దు ఉంది కాబట్టి ప్రత్యక్ష సంఘర్షణను సౌదీ అస్సలు కోరుకోదు. ఈ మూడు దేశాల ప్రయోజనాలు ఒకేలా లేకపోయినా.. ప్రాంతీయ భద్రత విషయంలో పరస్పర సహకారం అవసరమనే ఉమ్మడి అంశం మాత్రం ఉంది.

ఇప్పుడు భారత్ గురించి మాట్లాడాలి. ఈ కూటమి ఏర్పడగానే కొందరు దీన్ని “ఇండియాపై కొత్త ముప్పు”గా చూస్తున్నారు. కానీ అలా వెంటనే నిర్ణయానికి రావడం సరైంది కాదు. ఎందుకంటే సౌదీ అరేబియాతో భారత్‌కు చాలా బలమైన వ్యూహాత్మక, ఆర్థిక, శక్తి సంబంధాలు ఉన్నాయి. లక్షలాది భారతీయులు సౌదీ ఆర్థిక వ్యవస్థలో పనిచేస్తున్నారు. ఆయిల్, ట్రేడ్, పెట్టుబడి, భద్రతా సహకారం వంటి అనేక రంగాల్లో ఇండియా-సౌదీ మధ్య సంబంధాలు గత కొన్నేళ్లుగా బలపడ్డాయి. కాబట్టి సౌదీ ఈ కూటమిలో పాకిస్తాన్‌తో కలిసి ఉందన్న ఒక్క కారణంతో భారత్-సౌదీ సంబంధాలు ఒక్కసారిగా మారిపోతాయని చెప్పలేం.

అయితే పాకిస్తాన్, తుర్కియే మాత్రం రెండూ భారత్‌కు ముప్పు ఉన్న దేశాలు కావడంతో మన దేశం ఈ కూటమిని నిర్లక్ష్యం చేయదు. ముఖ్యంగా ఫ్యూచర్‌లో ఈజిప్ట్, ఖతార్ లేదా మరికొన్ని దేశాలు చేరితే ఈ కూటమికి మరిన్ని పవర్స్ వస్తాయి. అందుకే భారత్‌కు దీనిపై రెండు పనులు ముఖ్యంగా ఉంటాయి. ఒకటి.. గల్ఫ్ దేశాలతో తన మరింత బలోపేతం చేయడం. రెండోది.. తుర్కియే-పాకిస్తాన్ మధ్య రక్షణ సహకారం ఏ స్థాయికి వెళ్తుందో జాగ్రత్తగా గమనించడం.

ఇక భారత సైనిక శక్తి గురించి కూడా ఒక విషయాన్ని క్లియర్‌గా చెప్పాలి. “ప్రపంచంలో ఏ దేశమైనా మనపై దాడి చేస్తే దాన్ని అంతం చేసేయగల శక్తి భారత్‌కే ఉంది” వంటి మాటలు రాజకీయంగా ఆకర్షణీయంగా ఉండొచ్చు. కానీ మిలిటరీ విశ్లేషణలో ఇలాంటి నిర్ద్వంద్వ వాదనలు చేయడం సరైంది కాదు. వాస్తవానికి భారత్ ప్రపంచంలోని ప్రధాన సైనిక శక్తుల్లో ఒకటి. గ్లోబల్ ఫైర్‌పవర్.. 2026లో ఇండియాను నాలుగో స్థానంలో ఉంచింది. సుమారు 14.31 లక్షల క్రియాశీల సిబ్బంది, 10 లక్షల రిజర్వ్ సిబ్బంది, భారీ ఎయిర్‌ఫోర్స్, నేవీ, విమాన వాహక నౌకలు, జలాంతర్గాములు (Submarines), లాంగ్ రేంజ్ మిస్సైల్స్, న్యూక్లియర్ వెపన్స్ వంటి అనేక వ్యూహాత్మక సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయి. 2025లో భారత్ సైనిక వ్యయం సుమారు 92.1 బిలియన్ డాలర్లుగా ఖర్చు చేసినట్లు అంచనా ఉంది. కాబట్టి ఇక్కడ ఇండియా శక్తి కూడా బలంగా ఉంది. పైగా మనకి రష్యా, ఇజ్రాయెల్ సపోర్ట్ ఉంది. అవసరమైతే అమెరికా కూడా సపోర్ట్‌ చేసే ఛాన్స్ ఉంటుంది.

ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ మక్కా కూటమికి కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. మొదటిది భౌగోళిక శాస్త్రం. పాకిస్థాన్, సౌదీ అరేబియా, తుర్కియే మధ్య భారీ దూరం ఉంది. ఒక దేశానికి అత్యవసరంగా మిలిటరీ సాయం అవసరమైనప్పుడు మరొక దేశం ఎంత వేగంగా స్పందించగలదు అన్నది పెద్ద ప్రశ్న. రెండోది రాజకీయ సంకల్పం. ఒప్పందంలో ఒక దేశంపై దాడి అంటే అందరిపై దాడి అని ఉన్నా.. వాస్తవంగా ఎంత సైనిక శక్తి పంపాలి అన్నది ప్రతి సంక్షోభంలోనూ రాజకీయ నిర్ణయమే. మూడోది విభిన్న ముప్పు భావనలు. సౌదీకి ఇరాన్, యెమెన్ ముప్పు ఉంది. తుర్కియేకి సిరియా, ఇరాక్, కుర్దిష్ సమస్య, నల్ల సముద్రం సమస్యలు ఉన్నాయి. పాకిస్థాన్‌కు భారత్, ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు అంతర్గత భద్రత వంటి వేర్వేరు ఆందోళనలు ఉన్నాయి.

అయినప్పటికీ ఈ కూటమిని చిన్న విషయంగా చూడలేం. ఎందుకంటే ఇది పశ్చిమ ఆసియాలో ఒక కొత్త వ్యూహాత్మక సందేశాన్ని ఇస్తోంది. “సెక్యూరిటీ కోసం బయట నుంచి ఎవరైనా వచ్చి కాపాడాలి” అనే పాత విధానానికి బదులుగా.. “ప్రాంతీయ శక్తులు కలిసి తమ భద్రతా నిర్మాణంను నిర్మించుకోవాలి” అనే ఆలోచన బలపడుతోంది. అమెరికా ఇప్పటికీ గల్ఫ్‌లో అత్యంత శక్తివంతమైన బాహ్య సైనిక శక్తిగానే ఉన్నా.. సౌదీ వంటి దేశాలు తమ భద్రతా ఎంపికలను భిన్నంగా (Diversify) చేసుకుంటున్నాయి. పాకిస్తాన్, తుర్కియే వంటి దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడం కూడా అదే మరింత సమగ్రమైన ప్రణాళికలో భాగంగా చూడవచ్చు.

మరి ఇరాన్ దీన్ని ఎలా చూస్తుంది?.. ఇరాన్ ఇప్పుడు ఈ మక్కా కూటమి తన భద్రతకు ఎలాంటి కొత్త ముప్పు కాదని, సౌదీ సెక్యురిటీకి కూడా ఇది పెద్ద పరిష్కారం కాదని విమర్శించింది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం. ఇరాన్‌తో అమెరికా యుద్ధం జరుగుతున్న సమయంలో.. గల్ఫ్‌లో సౌదీ, తుర్కియే, పాకిస్తాన్ కలిసి సమిష్టి రక్షణ యంత్రాంగం ప్రకటించడం ఇరాన్‌కు పూర్తిగా అసంబద్ధమైన విషయం కాదు. ముఖ్యంగా సౌదీలోని ఇంధన మౌలిక సదుపాయాలు, సైనిక స్థావరాలు, నౌకాయాన మార్గాలుభవిష్యత్తులో దాడులు జరిగితే ఈ కూటమి ఎలా పనిచేస్తుందన్నది ఇప్పుడు అందరి ఆసక్తి. ఇక ఈ కూటమి భవిష్యత్తు ఈజిప్ట్ చేరికపై కూడా చాలా వరకు ఆధారపడి ఉంటుంది. ఈజిప్ట్ అధికారికంగా చేరితే.. ఒప్పందంకు మరింత పెద్ద సైనిక ఉనికి వస్తుంది.

ఇక భారత్ విషయానికి వస్తే.. ఈ కూటమి మనకు వెంటనే సైనిక ముప్పు అని చెప్పలేం. కానీ పాకిస్తాన్, తుర్కియే రక్షణ సహకారం పెరగడం, సౌదీతో పాకిస్తాన్‌కు ఉన్న కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యం, ఈజిప్ట్ చేరే అవకాశాలు.. ఇవన్నీ ఇండియా తప్పకుండా మానిటర్ చేయాల్సిన పరిణామాలే. అదే సమయంలో సౌదీతో భారత్‌కు ఉన్న శక్తి, ట్రేడ్, ప్రవాస జాతి (Diaspora), డిఫెన్స్ సంబంధాలను మరింత బలపరచడం కూడా కీలకం. మరి రాబోయే రోజుల్లో ఈ కూటమిలోకి మరెన్ని దేశాలు వస్తాయి? ఈ కూటమి నిజంగా NATO తరహా బలంగా మారుతుందా? లేక రాజకీయ ప్రకటనగానే మిగిలిపోతుందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.