BRICS 2026 : 18వ బ్రిక్స్‌ దేశాల శిఖరాగ్ర సమావేశం న్యూఢిల్లీ వేదికగా జరుగుతుంది.ఈ సమావేశానికి కూటమికి చెందిన అగ్ర నాయకులు హాజరవుతున్నారు. సమావేశాలు జరుగుతున్న వేళ ఆసక్తికర అంశం తెరమీదకు వచ్చింది. ఈ కూటమిలో చేరడానికి పాకిస్తాన్ గత కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు. నిజానికి ఇస్లామాబాద్ 2023లోనే బ్రిక్స్‌లో సభ్యత్వం కోసం అధికారికంగా దరఖాస్తు చేసుకున్నప్పటికీ, భారత తీవ్ర వ్యతిరేకత కారణంగా ఆ దేశం ఈ కూటమికి దూరంగానే ఉండి పోయింది.

కాగా, బ్రిక్స్‌ ప్రారంభంలో కూటమిలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలు మాత్రమే ఉండేవి. అయితే 2024లో ఈ కూటమిని విస్తరిస్తూ ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్ ,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తదితర దేశాలను చేర్చుకోవడంతో ఇది ‘బ్రిక్స్+’ గా మారిన విషయం తెలిసిందే. ఈ విస్తరణ ప్రక్రియలో భాగంగా సౌదీ అరేబియా,అర్జెంటీనాలను కూడా ఆహ్వానించారు. అయితే, అర్జెంటీనా ఆ తరువాత ఇందులో చేరేందుకు నిరాకరించింది.

Also Read : రష్యాపై ఆంక్షల బిల్లు.. భారత్‌కు టారిఫ్‌లు తప్పవా..?

2023లోనే ఇస్లామాబాద్ అప్లికేషన్‌

కాగా 2023లో రష్యా అధ్యక్షతన బ్రిక్స్ కూటమి ఒక ప్రధాన విస్తరణకు సిద్ధమవుతున్న సమయం లోనే, పాకిస్తాన్ తాము సభ్యత్వానికి దరఖాస్తు చేసుకున్న విషయాన్ని బహిరంగంగా ధృవీకరించింది. విదేశాంగ శాఖ ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ ఈవిషయాన్ని విలేకరుల సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. “అభివృద్ధి చెందుతున్న దేశాల ముఖ్యమైన కూటమిగా మేం భావిస్తున్న బ్రిక్స్‌లో చేరడానికి పాకిస్తాన్ అధికారిక అభ్యర్థన చేసింది,” అని బలోచ్ తెలిపారు. ఈ సందర్భంగా బ్రిక్స్‌లోని మెజారిటీ సభ్య దేశాలతో పాటు చేరడానికి ఆహ్వానం పొందిన దేశాలతో కూడా పాకిస్తాన్‌కు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. అంతర్జాతీయంగా శాంతి, అభివృద్ధి కోసం పనిచేస్తున్న బహుపాక్షిక సంస్థలలో పాకిస్తాన్ భాగస్వామ్యాన్ని, మద్దతును ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు.

“బ్రిక్స్‌లో చేరడం ద్వారా అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడంలో,సమగ్ర బహుపాక్షికతను పునరుద్ధరించడంలో పాకిస్తాన్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించగలదని మేం నమ్ముతున్నాం” అని ఆమె అన్నారు. అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, UAE లను చేర్చుకోవడానికి బ్రిక్స్ కూటమి సిద్ధమవుతున్న తరుణంలో బలోచ్ ఈ ప్రకటన చేశారు. ఈ కొత్త దేశాలు 2024లో రష్యాలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో అధికారికంగా కూటమిలో చేరాయి.

బ్రిక్స్ ద్వారా ఆర్థిక సహాయం కోరుతున్న పాకిస్తాన్

కాగా బ్రిక్స్‌లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న 29 దేశాలలో పాకిస్తాన్ ఒకటి. పాక్ ఈ ప్రయత్నాలు చేయడానికి ప్రధాన కారణం దాని ఆర్థిక సంక్షోభం,కొత్త నిధుల వనరులను కనుగొనాల్సిన అవసరం ఏర్పడటమే. పాకిస్తాన్ ఎకనామిక్ సర్వే ప్రకారం, ఆ దేశ GDP వృద్ధి రేటు 3.70 శాతంగా నమోదైంది. నిక్కీ ఆసియా నివేదిక ప్రకారం, పాకిస్తాన్ బ్రిక్స్ మద్దతు ఉన్న ‘న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్’లో $580 మిలియన్ల వాటాను కొనుగోలు చేసింది. ప్రపంచ బ్యాంక్ , అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) లపై పాక్‌ ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి, ఆర్థిక సహాయ మార్గాలను విస్తరించుకోవడమే లక్ష్యంగా ఇస్లామాబాద్ ఈ నిర్ణయం తీసుకుంది.

Also Read : కాంగో పాఠశాలలో ఘోర అగ్నిప్రమాదం.. సజీవదహనమైన 29 మంది చిన్నారులు.. ఏమైందంటే?

పాకిస్తాన్‌ను అడ్డుకుంటున్న భారత్ వ్యతిరేకత

అయితే 2023లోనే పాక్‌ దరఖాస్తు చేసుకున్నప్పటికీ, కూటమి విస్తరించినప్పటికీ పాకిస్తాన్‌కు బ్రిక్స్ సభ్యత్వం లభించలేదు. బ్రిక్స్ నిర్ణయాధికారాల్లో భారత్‌కు ఉన్న ‘వీటో’ (Veto) అధికారం, ఇస్లామాబాద్ ఎంట్రీని సమర్థవంతంగా అడ్డుకుంది. ప్రాంతీయ ఉద్రిక్తతలు, భారత్‌తో క్షీణించిన సంబంధాల నేపథ్యంలో పాకిస్తాన్ ఈ ప్రయత్నాలు చేస్తోంది. ఇస్లామాబాద్ ఈ సభ్యత్వాన్ని తన ఆర్థిక,దౌత్య వ్యూహంలో భాగంగా చూపిస్తున్నప్పటికీ, భారతదేశపు బలమైన వ్యతిరేకతే దానికి ప్రధాన అడ్డంకిగా మారింది.

2023 నాటి మీడియా సమావేశంలో బలోచ్ మాట్లాడుతూ.. అఫ్గానిస్తాన్ నేల నుండి కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద సంస్థలపై అఫ్గాన్ అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పాలస్తీనా అంశంపై అంతర్జాతీయ శాంతి సదస్సు నిర్వహించాలని, రెండు దేశాల సమస్యల పరిష్కారానికి మద్దతుగా ఐక్యరాజ్యసమితి తీర్మానాలను అమలు చేయాలని పాకిస్తాన్ డిమాండ్ చేస్తోంది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.