
Balochistan : పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని బలూచిస్తాన్ తన దేశానికి స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుంది. ఆగస్టు 11న తన దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంది. అయితే బలూచిస్తాన్‌లో స్వాతంత్ర్య వేడుకలను చూసి కక్షగట్టిన పాకిస్తాన్ జనరల్ ఆసిమ్ మునీర్ అరాచకానికి తెరలేపాడు. ఆయన ఆదేశాలతో సైన్యం అర్ధరాత్రి సురాబ్ ప్రాంతంలోని గోఅన్‌ధన్ గ్రామంపై విరుచుకుపడింది. ఈ దాడిలో భాగంగా భీకర వైమానిక దాడి (ఎయిర్‌స్ట్రైక్) నిర్వహించింది. ఈ దాడిలో 9 మంది పిల్లలు, 7 గురు మహిళలతో సహా 28 మంది నిరాయుధాలైన బలోచ్ ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరో 17 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వనరుల దోపిడీ, పేదరికం, సైనిక దౌర్జన్యాలకు వ్యతిరేకంగా బలూచ్ ప్రజలు దశాబ్దాలుగా గళం ఎత్తుతూ పాకిస్తాన్ నుంచి విడిపోవాలని కోరుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన దేశానికి స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుంది.
ఈ క్రమంలో పాకిస్తాన్‌కు చెందిన ఆసిమ్ మునీర్ సైన్యం తన సొంత ప్రజలకే తీవ్రవాదిగా మారిందని మరోసారి నిరూపించుకున్నట్లయింది. బలూచిస్తాన్ సురాబ్ ప్రాంతం నుంచి వెలువడిన ఈ భయానక వార్త ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బలూచిస్తాన్ మొత్తం తమ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలోనే అదే రాత్రి, మునీర్ సైన్యం రాక్షసత్వానికి అంతం లేకుండా పోయింది. పాకిస్తాన్ సైన్యం తన సొంత దేశంలోని అమాయక పిల్లలు, మహిళలు, నిరాయుధులైన ప్రజలపై యుద్ధభూమిలో శత్రువులపై దాడిచేసిన విధంగా వైమానిక దాడికి పాల్పడటం గమనార్హం. సైన్యం చేసిన ఈ అనాగరిక చర్య మూలంగా 28 మంది అమాయక బలోచ్ పౌరులు ప్రాణాలు పోగొట్టుకున్నారు.
బలూచిస్తాన్ సురాబ్ జిల్లాలోని గోఅన్‌ధన్ గ్రామంలో రాత్రి దాదాపు 2 గంటల సమయాన గ్రామస్థులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో, ఆకాశంలో మృత్యువులా దూసుకొచ్చిన పాకిస్తాన్ సైనిక యుద్ధ విమానాలు అమాయక బలోచ్ పౌరుల ఇళ్లపై బాంబుల వర్షం కురిపించాయి. భారీ పేలుళ్ల శబ్దాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. గోఅన్‌ధన్ గ్రామంలో అర్ధరాత్రి జరిగిన ఈ వైమానిక దాడికి సంబంధించిన వివరాలు హృదయవిదారకంగా ఉన్నాయి. క్షణాల వ్యవధిలో గ్రామం మొత్తం నేలమట్టమైంది. చుట్టూ రోదనలు మిన్నంటాయి. మట్టి, కాంక్రీట్ శిథిలాల కింద అమాయకుల మృతదేహాలు కూరుకుపోయాయి. ఈ వైమానిక దాడిలో మునీర్ సైన్యం అమానుషత్వం ఏ స్థాయిలో ఉందో మరణించిన 28 మందిలో ఎక్కువ మంది చిన్న పిల్లలు, మహిళలు ఉండటమే నిదర్శనం.
పాక్‌దాడిలో 9 మంది అమాయక పిల్లలు తమ తప్పు ఏమిటో కూడా తెలియని చిన్నారులు నిద్రలోనే శాశ్వతంగా కన్నుమూశారు. 7 మంది నిస్సహాయ మహిళలు తమ కుటుంబాలను కాపాడుకునే ప్రయత్నంలో రాక్షసత్వానికి బలయ్యారు.12 మంది బలోచ్ పురుషులు అత్యంత క్రూరంగా లక్ష్యంగా చేసుకొని హతమార్చబడ్డారు. ఇది కాకుండా 17 మందికి పైగా తీవ్ర గాయాలతో శిథిలాల నుంచి బయటకు తీయబడి చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Also Read : రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడులు… మహిళ వ్యాపారవేత్త సామ్రాజ్యం ధ్వంసం
బలూచిస్తాన్ స్వాతంత్య్రంతో కంగుతిన్న మునీర్
మునీర్ సైన్యం అర్ధరాత్రి తన సొంత పౌరులపై ఎందుకు ఈ దాడికి పాల్పడింది అనేది అందరికీ తెలిసిన సత్యమే. స్వాతంత్ర్యం కోసం బలూచిస్తాన్ ప్రజల్లో పెరుగుతున్న ధైర్యమే దీనికి కారణం. వాస్తవానికి ఈ ఘటనకు సరిగ్గా ఒక్క రోజు ముందు బలూచిస్తాన్ అంతటా బలోచ్ ప్రజలు పాకిస్తాన్ నుంచి తమ ‘స్వాతంత్య్ర వేడుకలను’ అత్యంత వైభవంగా జరుపుకున్నారు. వీధుల్లో బలోచ్ జెండాలు ఎగురవేసి, పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.బలూచిస్తాన్ ఈ తిరుగుబాటు ధోరణి, స్వాతంత్ర్య వేడుకలు పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ ఆసిమ్ మునీర్‌కు పూర్తిగా కంటగింపుగా మారాయి. ఆగ్రహంతో ఊగిపోయిన ఆసిమ్ మునీర్.. బలోచ్ ప్రజల గొంతును అణచివేయడానికి, వారిలో భయాన్ని సృష్టించడానికి తన సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఈ విద్వేషం, ప్రతీకార కసితోనే మునీర్ సైన్యం అర్ధరాత్రి గోఅన్‌ధన్ గ్రామాన్ని టార్గెట్ చేసి నిరాయుధులైన పౌరులపై విరుచుకుపడింది.
విధ్వంసంగా మారుతున్న బలూచిస్తాన్
ఇది కేవలం వైమానిక దాడి మాత్రమే కాదని, దాడులకు ముందు, ఆ తర్వాత సైనికులు గ్రామాన్ని చుట్టుముట్టి ప్రజలను చిత్రహింసలకు గురిచేశారని స్థానిక ప్రజలు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పాకిస్తాన్ సైన్యం గత అనేక సంవత్సరాలుగా బలూచిస్తాన్‌లో ‘ఆపరేషన్’ పేరుతో సాధారణ ప్రజలను అపహరించడం, చిత్రహింసల శిబిరాలలో హింసించడం, బూటకపు ఎన్‌కౌంటర్లలో హత్య చేయడం వంటి చర్యలకు పాల్పడుతోంది. అయితే ఇప్పుడు తన సొంత ప్రజలపైనే యుద్ధ విమానాలతో బాంబులు కురిపించడమంటే మునీర్ సైన్యం ఏ స్థాయికి దిగజారిందో తెలియజేస్తోంది.
ఘటన తర్వాత గోఅన్‌ధన్ గ్రామంలో కనిపిస్తున్న దృశ్యాలు అన్నీ సర్వనాశనమైన విలయతాండవాన్నే తలపిస్తున్నాయి. ధ్వంసమైన ఇళ్ళు, చెల్లాచెదురైన సామాగ్రి, శిథిలాల నుంచి వెలికితీస్తున్న ఆప్తుల శవాలను చూసి ప్రతి ఒక్కరి కళ్లూ చెమర్చుతున్నాయి. గ్రామస్థులు స్వయంగా శిథిలాలను తొలగిస్తూ తమవారి కోసం గాలిస్తుండగా, పాకిస్తాన్ యంత్రాంగం, సైన్యం మాత్రం ఈ ఘటనపై పూర్తిగా మౌనం వహించాయి.
Also Read : సీక్రెట్ సర్వీస్ చెప్పినట్లే వింటా: విమానం మార్పుపై ట్రంప్ స్పష్టత
పాకిస్తాన్ నుంచి ఎందుకు విడిపోవాలనుకుంటోంది?
పాకిస్తాన్ పాలకుల హింసను భరించలేక బలూచిస్తాన్ విడిపోవాలని కోరుకుంటోంది. ఇక్కడ తిరుగుబాటుకు ప్రధాన కారణం పాకిస్తాన్ ప్రభుత్వం, వారి సైన్యం సంవత్సరాలుగా బలోచ్ హక్కులను కాలరాయడమే. బలూచిస్తాన్ సహజ వాయువు, బంగారం, రాగి, ఖనిజ సంపద వంటి విలువైన వనరులతో నిండి ఉన్నప్పటికీ, అక్కడి సాధారణ ప్రజలు తీవ్ర పేదరికం, నిరుద్యోగం, కనీస సౌకర్యాల కొరతను ఎదుర్కొంటున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం తమ వనరులను పూర్తిగా ఉపయోగించుకుంటోందని, కానీ బదులుగా తమకు కేవలం దుర్భర జీవితాన్ని, నిర్లక్ష్యాన్ని మాత్రమే ఇస్తోందని బలోచ్ ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇది కాకుండా, చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) వంటి పెద్ద ప్రాజెక్ట్‌ల నుంచి కూడా స్థానిక ప్రజలను దూరం పెడుతున్నారు. దీనికి తోడు అక్కడి సైన్యం అరాచకం మరింత తీవ్రమైంది. బలోచ్ యువకులను బలవంతంగా అపహరించడం, చిత్రహింసలకు గురిచేయడం, సైనిక చర్యలు చేపట్టడం నిత్యకృత్యంగా మారింది. ఈ దౌర్జన్యాలు, దోపిడీ, తమ గుర్తింపు-వనరుల పరిరక్షణ కోసం బలోచ్ ప్రజలు, పలు పోరాట సంస్థలు చాలా కాలంగా పాకిస్తాన్ నుంచి ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేస్తూ తిరుగుబాటు బావుటా ఎెగరేస్తున్నాయి.
బలూచిస్థాన్ స్వతంత్ర దేశంగా గుర్తింపు పొందాలని కోరుతూ బలూచ్ వేర్పాటువాద నేత మిర్ యార్ బలూచ్ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. ఆగస్టు 11న నిర్వహించిన ‘బలూచిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం’ సందర్భంగా ఆయన ‘ఎక్స్’ వేదికగా ఈ ప్రకటన చేశారు. బలూచిస్థాన్‌ను ఇకపై పాకిస్థాన్ ప్రావిన్స్‌గా కాకుండా, స్వతంత్ర దేశంగానే పరిగణించాలని ఆయన అంతర్జాతీయ సంస్థలను కోరారు. తమ ఉద్యమం ఇప్పుడు దౌత్యపరమైన, రాజకీయ గుర్తింపును పొందే లక్ష్యంతో కొత్త దశలోకి ప్రవేశించిందని మిర్ యార్ బలూచ్ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి, ఆసియాన్ , ఆఫ్రికన్ యూనియన్, ఇస్లామిక్ సహకార సంస్థ, ఐరోపా దేశాలు బలూచిస్థాన్ స్వేచ్ఛకు మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బలూచిస్థాన్ అంశాన్ని ప్రపంచ దృష్టికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన భారత మీడియాకు, పరిశోధకులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పాకిస్థాన్‌ను ‘క్యాన్సర్’తో పోల్చిన బలూచ్ నేత ఆ దేశం నుంచి తమ భూభాగాన్ని విముక్తి చేసేందుకు అంతర్జాతీయ నైతిక మద్దతు అవసరమని నొక్కి చెప్పారు. 1947 ఆగస్టు 11న బ్రిటీష్ ఇండియా విభజనకు కొద్ది రోజుల ముందే బలూచిస్థాన్ స్వాతంత్య్రాన్ని ప్రకటించుకుందని, ఆ చారిత్రక వాస్తవం ఆధారంగానే తాము స్వతంత్ర దేశం కోసం పోరాడుతున్నామని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తులో బలూచిస్థాన్ సొంత కరెన్సీ, పాస్‌పోర్టులు, దౌత్య కార్యాలయాలు, రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.









