Earthquake Hits Nepal
Earthquake Hits Nepal

ప్రకృతి మరోసారి నేపాల్‌పై తన ప్రతాపం చూపించింది. ఇప్పటికే భారీ వర్షాలు, కొండచరియలు, భీకర వరదలతో అల్లాడిపోతున్న ఆ దేశాన్ని తాజాగా భూకంపం కుదిపేసింది. వరదల విషాదం నుంచి కోలుకోకముందే వచ్చిన ఈ భూకంపం ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తోంది. అసలు నేపాల్‌లో 5.3 తీవ్రత కలిగిన భూకంపం ఎందుకు వచ్చింది..? భూకంపం 143 కిలోమీటర్ల లోతులో వస్తే.. దాని ప్రకంపనలు పైకి ఎలా కనిపించాయి..? ఒకవైపు వరదలు.. మరోవైపు కొండచరియలు.. ఇప్పుడు నదికి అడ్డంగా ఏర్పడిన సహజమైన అడ్డంకులు.. ఈ పరిస్థితి మరో భారీ విపత్తుకు దారితీస్తుందా..? ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉన్న నేపాల్‌.. మరో ప్రకృతి విపత్తును తట్టుకోగలదా..? ఈ స్టోరీలో క్లియర్‌గా తెలుసుకుందాం.

నేపాల్‌ ముస్తాంగ్ జిల్లాలోని లోమంథాంగ్ ప్రాంతం వద్ద ఈ భూకంపం నమోదైంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైంది. మంగళవారం రాత్రి 9:53 గంటల సమయంలో వచ్చిన ఈ ప్రకంపనలు.. భూమి ఉపరితలానికి సుమారు 143 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమయ్యాయి. మనాంగ్, డోల్పా, మ్యాగ్దీ జిల్లాల్లోనూ ప్రకంపనలు కనిపించాయి. అయితే భూకంప కేంద్రం చాలా లోతులో ఉండటంతో.. దాని ఇంపాక్ట్ ఉపరితలంపై పరిమితంగానే కనిపించింది. ప్రాణ నష్టం గానీ, పెద్దగా ఆస్తి నష్టం గానీ సంభవించలేదని అధికారులు తెలిపారు.

కానీ నేపాల్‌లో అసలు ఆందోళన ఇక్కడే మొదలవుతోంది. ఎందుకంటే ఈ భూకంపం కంటే ముందే ఆ దేశం భారీ ప్రకృతి విపత్తుతో పోరాడుతోంది. గత నెలలో భోటే కోషి నదికి వచ్చిన ఆకస్మిక వరదలు నేపాల్‌ను అతలాకుతలం చేశాయి. ఒక్కసారిగా ఉప్పొంగిన వరద నీరు అనేక ప్రాంతాలను ముంచెత్తడంతో.. ఇళ్లు, రోడ్లు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పోలీసుల ప్రకారం ఈ విపత్తులో ఇప్పటివరకు 1,366 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ఆచూకీ కోసం కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఈ వరదల వల్ల సుమారు 256 కోట్ల డాలర్ల ప్రత్యక్ష నష్టం సంభవించిందని రాయిటర్స్ తెలిపింది. అంటే నేపాల్‌ ఇంకా వరదల నష్టం నుంచి పూర్తిగా బయటపడకముందే మరో ప్రకృతి విపత్తును ఎదుర్కొంటోంది.

ఇదే సమయంలో గండకీ ప్రావిన్స్‌లోని పర్వత్ జిల్లాలో మరో ప్రమాదం బయటపడింది. కిమ్రుంగ్ నది ప్రవాహానికి భారీ కొండచరియలు అడ్డుగా పడ్డాయి. కిమ్రుంగ్.. మోడీ నదికి ఉపనది. కొండచరియలు నదీ ప్రవాహాన్ని అడ్డుకోవడంతో అక్కడ నీరు నిలిచే పరిస్థితి ఏర్పడింది. ఈ సహజసిద్ధమైన అడ్డంకులు బలహీనపడి ఒక్కసారిగా తెగిపోతే.. నిలిచిపోయిన నీరు భారీ ప్రవాహంగా దిగువకు దూసుకెళ్లే ప్రమాదం ఉంది. ఆ నీటితో పాటు మట్టి, రాళ్లు, చెట్లు కూడా కొట్టుకురావచ్చు. దీంతో దిగువ ప్రాంతాల్లో అకస్మాత్తుగా వచ్చే వరద ముప్పు మరింత పెరుగుతుంది.

Also Read : సౌదీ అరేబియాపై హూతీల దాడి.. మక్కా ఒప్పందం ఫెయిల్..!

అందుకే నయాపుల్, బిరేతాంతి సహా కిమ్రుంగ్ నది దిగువ ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అవసరమైతే వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు. ప్రస్తుతం నదిలో నీటి మట్టం, అడ్డంకులు పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఒకవేళ నీటి ఒత్తిడి పెరిగి ఈ అడ్డంకి బద్దలైతే.. దిగువ ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వరద వచ్చే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

అయితే కిమ్రుంగ్ నదికి కొండచరియలు అడ్డుగా పడటానికి తాజా భూకంపమే కారణమని చెప్పడానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవు. భారీ వర్షాలు, వరదల ప్రభావంతో ఇప్పటికే బలహీనపడిన కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో ఈ అడ్డంకులు ఏర్పడినట్లు తెలుస్తోంది. అంటే నేపాల్‌లో ఒక విపత్తు ప్రభావం పూర్తయ్యేలోపే.. మరో ప్రమాదం ముందుకొస్తోంది. వరదలు, కొండచరియలతో దెబ్బతిన్న ప్రాంతాలకు ఇప్పుడు భూకంప ప్రకంపనలు అదనపు ఆందోళనగా మారాయి.

కిమ్రుంగ్ నదికి ఏర్పడిన ఈ అడ్డంకులు వెనుక నేపాల్‌ భౌగోళిక పరిస్థితులు కూడా ప్రధాన కారణం. హిమాలయ ప్రాంతంలో ఉన్న ఈ దేశంలో ఎత్తైన కొండలు, నిటారుగా ఉండే వాలులు, లోతైన నదీ లోయలు ఎక్కువగా ఉంటాయి. భారీ వర్షాలు కురిసినప్పుడు కొండల్లోని మట్టి, రాళ్లు బలహీనపడతాయి. కొండచరియలు విరిగిపడితే రోడ్లు మూసుకుపోవడమే కాకుండా.. నదుల ప్రవాహానికి కూడా అడ్డంకులు ఏర్పడతాయి. అక్కడ నీరు పేరుకుపోయి.. అడ్డంకి తెగిపోతే ఒక్కసారిగా దిగువ ప్రాంతాల వైపు దూసుకెళ్లే ప్రమాదం ఉంటుంది. అందుకే నేపాల్‌లో కొండచరియలు విరిగిపడే ప్రభావం కొండలకే పరిమితం కాకుండా.. నదీ పరివాహక ప్రాంతాలకూ విస్తరిస్తోంది.

ఈ భౌగోళిక పరిస్థితులే సహాయక చర్యలకు కూడా పెద్ద సవాలుగా మారుతున్నాయి. కొండ ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతినడం, కొన్నిచోట్ల వరద నీరు మార్గాలను ముంచెత్తడం, మరికొన్నిచోట్ల కొండచరియలు రహదారులను మూసేయడంతో.. బాధిత ప్రాంతాలకు చేరుకోవడం రెస్క్యూ టీమ్స్‌‌కు కష్టంగా మారింది. ఒకవైపు దెబ్బతిన్న మార్గాలను పునరుద్ధరించాలి.. మరోవైపు ప్రమాదంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. దీంతో రెస్క్యూ ఆపరేషన్స్‌తో పాటు మౌలిక సదుపాయాల పునరుద్ధరణ కూడా కీలకంగా మారింది.

Also Read : బంగ్లాదేశ్లో పేలిన యుద్ధ ట్యాంక్.. మేడ్ ఇన్ చైనా పీస్ అంటూ నెటిజన్ల ట్రోల్స్!

ఇలాంటి పరిస్థితుల్లో సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు భారత్ కూడా నేపాల్‌కు అండగా నిలుస్తోంది. ముఖ్యంగా చిలిమే సొరంగం ప్రాంతంలో నేపాల్‌ బృందాలతో కలిసి భారత బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. వరదలు, కొండచరియల కారణంగా సొరంగంలో పేరుకుపోయిన మట్టి, శిథిలాలను తొలగించడంతో పాటు.. సొరంగం లోపల పనులు కొనసాగించేందుకు అధిక సాంద్రత కలిగిన పాలీఇథిలీన్ పైపుల‌ను ఉపయోగిస్తున్నారు. అలాగే స్యాఫ్రుబేసి నుంచి టన్నెల్ ఎంట్రీ వరకు టెంపరరీ యాక్సెస్ రోడ్‌‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన చోట నియంత్రిత పేలుడు విధానం కూడా చేపడుతున్నారు. దీంతో దెబ్బతిన్న రోడ్లు, సొరంగాలు, రవాణా మార్గాలను తిరిగి అందుబాటులోకి తీసుకురావడంపై కూడా సహాయక చర్యలు సాగుతున్నాయి.

మరోవైపు భూకంపం తర్వాత పరిస్థితులపై అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఈసారి భూకంపం లోతులో సంభవించడంతో పెద్దగా నష్టం జరగకపోయినా.. ఇప్పటికే వర్షాలు, వరదలు, కొండచరియలతో బలహీనంగా మారిన ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. ముఖ్యంగా నదుల్లో నీటి మట్టం, కొండచరియలు, సహజమైన అడ్డంకులు, వాలులలో వచ్చే మార్పులను పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం, అవసరమైన చోట ప్రజలను తరలించడం.. ప్రస్తుతం అధికారుల ప్రధాన ప్రాధాన్యతగా మారింది.

నేపాల్‌లో ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు ఒకదాని ప్రభావాన్ని మరోటి పెంచుతున్నాయి. భారీ వర్షాలు కొండచరియలకు దారితీస్తే.. అవి నదుల ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. నదులు అడ్డుపడితే నీరు పేరుకుపోతోంది. ఆ అడ్డంకి తెగిపోతే అదే నీరు అకస్మాత్తుగా వచ్చే వరదగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి మళ్లీ తలెత్తితే.. ప్రజల తరలింపు నుంచి సహాయక చర్యల వరకు ప్రతిదీ మరింత కష్టంగా మారుతుంది.

ప్రస్తుతం కిమ్రుంగ్ నది పరివాహక ప్రాంతంలో పరిస్థితిని అధికారులు నిశితంగా గమనిస్తున్నారు. నదీ ప్రవాహం అదుపులో ఉండేలా చర్యలు తీసుకుంటూ.. ప్రమాదం పెరిగేలోపే దిగువ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు చిలిమే సొరంగం సహా దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణ కొనసాగుతోంది. వరుస విపత్తులతో తీవ్రంగా దెబ్బతిన్న నేపాల్‌కు.. ఇప్పుడు ప్రతి ముందస్తు చర్య, ప్రతి సహాయక చర్య కీలకంగా మారింది.

ఇప్పటికే ఈ విపత్తుల కారణంగా వేలాది కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. కొందరు తమ వారిని కోల్పోతే.. మరెంతో మంది ఇళ్లు, జీవనోపాధిని కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో కిమ్రుంగ్ నది అడ్డంకులు ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. అక్కడి నీటి ప్రవాహం, కొండచరియల కదలికలను నిశితంగా గమనిస్తూ.. ప్రమాదం పెరిగేలోపే దిగువ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ఇప్పటికే దెబ్బతిన్న ప్రాంతాల్లో మరో విపత్తుకు కారణం కాకుండా.. అధికారులు ముందస్తు చర్యలపై ఫోకస్ పెట్టారు.

మొత్తంగా చూస్తే.. నేపాల్‌ ప్రస్తుతం వరుస ప్రకృతి విపత్తులతో తీవ్ర సంక్షోభంలో ఉంది. వరదలు, కొండచరియల మధ్య వచ్చిన భూకంపం మరోసారి ఆందోళన పెంచగా.. కిమ్రుంగ్ నది అడ్డంకులు కొత్త ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. భూకంపం పెద్ద నష్టం చేయకపోయినా.. నదీ ప్రవాహం విషయంలో మాత్రం అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి. ప్రస్తుతం కిమ్రుంగ్ నది పరిస్థితిపైనే ఫోకస్‌ కొనసాగుతోంది.