Imran Khan :  పాకిస్థాన్ మాజీ ప్రధాని, జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ తన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జైలులో తనకు సరైన వైద్యం అందడం లేదని, ఇలాగే కొనసాగితే తాను ప్రాణాలతో బయటపడకపోవచ్చని హెచ్చరించారు. గుండెపోటు లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని, తన ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందని తెలిపారు. తన భార్య బుష్రా బీబీకి కూడా సరైన వైద్యం అందడం లేదని ఆరోపించారు.

ఈ విషయాలను పాకిస్థాన్‌లోని ఉన్నత న్యాయస్థానాల ప్రధాన న్యాయమూర్తులకు రాసిన లేఖలో ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. ఆయన తరఫు న్యాయవాది బారిస్టర్ సల్మాన్ సఫ్దర్ ఈ లేఖను సోమవారం సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పంచుకున్నారు. నవంబర్ 2, నవంబర్ 11 తేదీల్లో అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్‌ను కలిసినట్లు న్యాయవాది తెలిపారు. న్యాయమూర్తులకు తన మాటలు తెలియజేయాలని ఇమ్రాన్ ఖాన్ స్వయంగా కోరినట్లు చెప్పారు.

74 ఏళ్ల వయసులో జైలులో ఎదుర్కొంటున్న పరిస్థితులు తనను ప్రాణాలతో తిరిగి రాలేని స్థితికి తీసుకెళ్తున్నాయని ఇమ్రాన్ ఖాన్ లేఖలో పేర్కొన్నారు. తాను మాజీ ప్రధానిగా లేదా రాజకీయ పార్టీ నాయకుడిగా ఈ లేఖ రాయడం లేదని, క్రికెట్, సేవా కార్యక్రమాలు, ప్రజా సేవ ద్వారా తన జీవితాన్ని పాకిస్థాన్ కోసం అంకితం చేశానని తెలిపారు. తనకు, తన భార్యకు వెంటనే సరైన వైద్యం అందించాలని కోరారు.

జైలులో తనను ఒంటరి గదిలో ఉంచారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. రోజుకు 22 గంటల వరకు ఎవరితోనూ మాట్లాడనివ్వకుండా ఒంటరిగా ఉంచుతున్నారని చెప్పారు. కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలవడానికి అనుమతి ఇవ్వడం లేదని, పుస్తకాలు చదవడానికి, టీవీ చూడడానికి కూడా అవకాశం కల్పించడం లేదని తెలిపారు. తన కుమారులు ఖాసిమ్, సులేమాన్‌లతో ఫోన్‌లో మాట్లాడేందుకు కూడా అనుమతి లేదని లేఖలో పేర్కొన్నారు.

తన కుడి కంటికి 85 శాతం చూపు కోల్పోయినట్లు ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. న్యాయవాది సల్మాన్ సఫ్దర్‌ను కలిసేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత ఫిబ్రవరి 10న ఆయన తనను కలిసినప్పుడు ఈ సమస్య బయటపడిందని తెలిపారు. తన భార్య బుష్రా బీబీ ఆరోగ్యం కూడా దెబ్బతింటోందని ఇమ్రాన్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏప్రిల్‌లో ఆమె కంటిలోని రెటీనా సమస్యకు గురయ్యారని, రహస్యంగా క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారని చెప్పారు. ఆ తర్వాత ఆమెను తిరిగి ఒంటరి గదిలో ఉంచినట్లు ఆరోపించారు. ఈ నెలలో ఆమెను కలిసినప్పుడు వెలుతురు కూడా చూడలేకపోయారని, కళ్లు తెరవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మరోసారి శస్త్రచికిత్స చేయకపోతే ఆమెకు శాశ్వతంగా చూపు పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తాను పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఆసుపత్రులు నిర్మించానని, ఇప్పుడు తనకు, తన భార్యకు కూడా సరైన వైద్యం అందించాలని మాత్రమే కోరుతున్నానని ఇమ్రాన్ ఖాన్ లేఖలో పేర్కొన్నారు.

జైలులో ఒంటరిగా ఉండటం వల్ల తన మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటోందని ఆయన తెలిపారు. జైలు వైద్యుల బృందం కూడా తనలో ఆందోళన ఉందని గుర్తించిందని, భార్య, కుటుంబ సభ్యులతో తరచూ మాట్లాడే అవకాశం కల్పించాలని సూచించిందని చెప్పారు. పుస్తకాలు, టీవీ అందుబాటులో ఉంచాలని కూడా వైద్యులు చెప్పినప్పటికీ అధికారులు ఆ సూచనలను పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రతి వారం తన భార్య బుష్రా బీబీని కలిసే అవకాశాన్ని కూడా జైలు అధికారులు అడ్డుకుంటున్నారని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. తన సోదరీమణులను కూడా అదుపులోకి తీసుకున్నారని, వారిని కలవడానికి అనుమతి ఇవ్వడం లేదని లేఖలో పేర్కొన్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.