
Jeffrey Sachs : ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభం నెలకొంటున్న వేళ భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని అంతర్జాతీయ సంస్థలు అనేకసార్లు చెప్పాయి. అదే విషయాన్ని ఇప్పుడు అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన ఆర్థికవేత్త జేఫ్రీ సాక్సా్ మరోసారి ఉద్ఘాటించారు. త్వరలోనే భారత్ నెంబర్-1 ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ఆయన అంచనా వేశారు. సమీప భవిష్యత్తులో భారత్ అమెరికా, చైనాలను దాటి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.
రాబోయే 25 ఏళ్లలో అమెరికాను భారత్ అధిగమించడం ఖాయమన్నారు. భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని, ఆ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికశక్తిగా అవతరించవచ్చని జేఫ్రీ సాక్స్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కేంద్రం నిర్ణయాత్మకంగా ఆసియా వైపు మారుతోందని సాక్స్ స్పష్టం చేశారు. అదే సమయంలో భారత్ -చైనాలు ఒకరికి ఒకరు అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ రెండు ఆసియా దిగ్గజాలు ప్రపంచ ఆర్థిక శక్తులుగా మారనున్నాయన్నారు, అదే సమయంలో అమెరికా మూడో స్థానానికి పడిపోతుందని జోస్యం చెప్పారు. చైనాతో భారత్కు లోతైన ఆర్థిక, సాంకేతిక సంబంధాలు పెరిగితే భారత్ ఎదిగే వేగాన్ని మరింత పెంచొచ్చని జేఫ్రీ సాక్సా్ వెల్లడించారు.
భారత్కు చైనా ఎంత అవసరమో, చైనాకు భారత్ అంతే అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటే ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక దేశాలుగా ఎదుగుతాయని ఆయన చెప్పారు. ఈ రెండు దేశాలు అభివృద్ధి సాధిస్తే ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక కేంద్రంగా ఉన్న ఆసియా, తిరిగి మళ్లీ ఆ స్థానాన్ని చేజిక్కించుకుంటుందని జేఫ్రీ సాక్స్ స్పష్టం చేశారు. చైనా, ఆసియాన్, ఆఫ్రికా, గల్ఫ్ దేశాలతో భారతదేశ వ్యూహాత్మక,ఆర్థిక సంబంధాలు మరింత ముఖ్యమైనవిగా మారతాయని ఆయన అభిప్రాయపడ్డారు.









