
Israel : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దిమ్మతిరిగే షాకిచ్చారు. ట్రంప్ రూపొందించిన 15 అంశాల గాజా శాంతి ప్రణాళికను ఇజ్రాయెల్ తిరస్కరించింది. హమాస్ ఉగ్రవాద సంస్థ పూర్తిగా ఆయుధాలను విడిచిపెట్టేంత వరకు గాజా నుంచి తమ సైన్యాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని నెతన్యాహు స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశంలో మాట్లాడిన ఆయన, తమ దళాలు, పౌరులకు ఎదురయ్యే ముప్పును తిప్పికొట్టడానికి ఇజ్రాయెల్ రక్షణ దళాలు గాజాలోనే కార్యకలాపాలు కొనసాగిస్తాయని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు, అమెరికా మద్దతు ఇస్తున్న ఈ శాంతి ప్రణాళిక అమలుకు తాము సిద్ధంగా ఉన్నామని హమాస్ ప్రకటించింది. ఈ ప్రణాళికలో భాగంగా, గాజాలో ఏర్పాటు కాబోయే పాలక కమిటీకి తమ ఆయుధాలను అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ శాంతి మండలికి తెలిపింది. ప్రణాళికలోని తదుపరి దశకు వెళ్లేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఇజ్రాయెల్ కూడా దీనికి అంగీకరించి అమలు చేసేలా దానిపై ఒత్తిడి తీసుకురావాలని హమాస్ ప్రతినిధులు కోరారు.
కాగా, ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో సహా ఎనిమిది ముస్లిం మెజారిటీ దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేస్తూ ఇజ్రాయెల్ సైనిక చర్యలను తీవ్రంగా ఖండించాయి. గాజాలో ఇజ్రాయెల్ చేపడుతున్న దాడులు ట్రంప్ శాంతి ఒప్పందానికి విఘాతం కలిగిస్తున్నాయని ఆ దేశాలు ఆరోపించాయి. అయినప్పటికీ, హమాస్ పూర్తి స్థాయిలో నిరాయుధీకరణ జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని ఇజ్రాయెల్ తేల్చిచెప్పడంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.









