
ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా విధించిన కొత్త ఆంక్షలపై టెహ్రాన్ తీవ్రంగా స్పందించింది. అగ్రరాజ్యం ఆంక్షలను ధీటుగా ఎదుర్కొనేందుకు తమ వద్ద రెండేళ్ల ప్లాన్ రెడీగా ఉందని ప్రకటించింది. అంతర్జాతీయంగా ఇరాన్‌కు ఉన్న వాణిజ్య, ఆర్థిక సంబంధాలను పూర్తిగా తెంచివేసి ఆ దేశాన్ని ఒంటరిని చేయడమే ధ్యేయంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.
టెహ్రాన్‌తో ఆర్థిక లావాదేవీలు కొనసాగిస్తూ, నగదు చలామణిలో ఇరాన్‌కు సహకరించే ఇతర దేశాలు లేదా సంస్థలను అంతర్జాతీయ డాలరు వ్యవస్థ నుంచి దూరంగా పెడతామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు. ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్’ పేరుతో అమెరికా ప్రభుత్వం దాదాపు 60 సంస్థలు, వ్యక్తులు, నౌకలపై ఈ కొత్త ఆంక్షలను విధించింది. ఇరాన్ సైనిక కార్యకలాపాలకు, పెట్రోలియం, పెట్రోకెమికల్ వాణిజ్యానికి తోడ్పడుతున్నారనే ఆరోపణలతో అగ్రరాజ్యం ఈ చర్యలు చేపట్టింది. ఇరాన్‌కు ప్రపంచంతో ఉన్న ఆర్థిక జీవనాధారాన్ని పూర్తిగా కత్తిరించడమే తమ తాజా ఆంక్షల ముఖ్య ఉద్దేశమని బెసెంట్ తేల్చిచెప్పారు.
Also Read : భారతీయ ఐటీ, విద్యార్థులకు షాకింగ్ న్యూస్.. అమెరికా వీసాల నిబంధనల్లో ఊహించని మార్పులు!
అమెరికా ఒత్తిళ్లకు తాము లొంగేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. తమతో వాణిజ్యం సాగిస్తున్న మిత్రదేశాలు అమెరికా ఆంక్షలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబఫ్ వెల్లడించారు. ప్రపంచ దేశాలతో ఇరాన్‌కున్న సంబంధాలను తెంచే శక్తి అమెరికాకు లేదని, తమ వ్యాపార భాగస్వాములు అమెరికా ప్రకటనలను పట్టించుకోవడం లేదని ఆయన తెలిపారు. అలాగే ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదానీజాదేహ్ మాట్లాడుతూ… వాషింగ్టన్ విధించిన ఈ ఆంక్షలను తిప్పికొట్టడానికి మా వద్ద 2 సంవత్సరాల ప్రణాళిక సిద్ధంగా ఉంది. అమెరికాకు మరోసారి ఓటమి తప్పదు. ఇరాన్ ప్రజల సంకల్పాన్ని పరీక్షించేందుకు అమెరికా ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికా ఆంక్షల తీవ్రత కారణంగా ఇరాన్ కరెన్సీ విలువ విపరీతంగా పడిపోయి ఒక డాలరుకు 20.2 లక్షల రియాళ్లుగా నమోదైంది. మరోవైపు ఇరాన్‌పై అమెరికా తీసుకున్న ఈ కఠిన నిర్ణయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వాగతించారు. ఇరాన్‌తో పాటు దానికి మద్దతుగా నిలుస్తున్న శక్తిగ్రూపులను లక్ష్యంగా చేసుకుని విధిస్తున్న ఈ ఆర్థిక ఆంక్షలు కోలుకోలేని దెబ్బ తీస్తాయన్నారు.
Also Read : ప్రపంచాన్ని భయపెడుతున్న ఎల్ నినో.. అత్యంత ఎండలు మండే ఏడాదిగా 2027?









