Mojtaba Khamenei
Mojtaba Khamenei

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్య తర్వాత ఆ దేశ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఆయనను లక్ష్యంగా చేసుకుని ఒకటి కాదు, ఏకంగా రెండుసార్లు భీకర దాడులు చేశాయని ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ సభ్యుడు మొహ్సెన్ హెయ్‌దరీ తాజాగా తెలిపారు. శిథిలాల కింద నుంచి కొన ఊపిరితో ఉన్న మొజ్తాబాను తమ సైన్యం ఎలా కాపాడుకుందో వెల్లడించారు.

ఫిబ్రవరిలో జరిగిన ప్రారంభ దాడుల్లో మాజీ సుప్రీం నేత అలీ ఖమేనీ సహా పలువురు అగ్రనేతలు సమావేశమైన భవనంపై అమెరికా విరుచుకుపడింది. ఈ దాడిలో అలీ ఖమేనీ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా.. తీవ్రంగా గాయపడిన ఆయన కుమారుడు మొజ్తాబాను అత్యవసర వైద్యం కోసం వెంటనే ఒక ఆస్పత్రికి తరలించారు. అయితే సమాచారంతో అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఆ ఆస్పత్రిపై కూడా రెండోసారి దాడి చేసి దాన్ని పూర్తిగా ధ్వంసం చేశాయి. ఆ తర్వాత ఇరాన్ బలగాలు ఆస్పత్రి శిథిలాల కింద చిక్కుకున్న మొజ్తాబాను సురక్షితంగా బయటకు తీసి.. మరొక సీక్రెట్ లొకేషన్‌కు తరలించి ప్రాణాలు కాపాడాయి.

కేవలం మొజ్తాబాపైనే కాకుండా ఇరాన్‌కు కొత్త నాయకుడిని ఎన్నుకోవడానికి ఏర్పాటు చేసిన కమిటీ నేతలను కూడా అమెరికా, ఇజ్రాయెల్ సైన్యం టార్గెట్ చేసింది. వారు తరచూ రహస్యంగా సమావేశమయ్యే ఖోమ్ సెక్రటేరియట్ భవనంపై క్షిపణులతో దాడి చేయడంతో కమిటీకి చెందిన ఎనిమిది మంది కీలక సభ్యులు దుర్మరణం పాలయ్యారు. ఈ దాడిలో మొజ్తాబాను సుప్రీం లీడర్‌గా ఎన్నుకోవడానికి సిద్ధం చేసిన అధికారిక నివేదికలు, సిఫార్సు పత్రాలన్నీ కాలి బూడిదయ్యాయి.

ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్‌గా మొజ్తాబాను ఎన్నుకోవద్దని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేశారు. కానీ అమెరికా బెదిరింపులకు లొంగకుండా దేశాన్ని ఈ క్లిష్ట సమయంలో నడిపించగల సమర్థుడు మొజ్తాబా మాత్రమేనని భావించి ఆయనను నూతన సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్నట్లు హెయ్‌దరీ తెలిపారు. అయితే అధికారికంగా ప్రకటించే వరకు తాను దేశానికి తదుపరి అధినేతగా ఎన్నికయ్యాననే విషయం మొజ్తాబాకు కూడా తెలియదని, ఆ తర్వాత పరిస్థితుల దృష్ట్యా ఆయన ఆ బాధ్యతలను అంగీకరించక తప్పలేదని తెలిపారు.