
Iran : అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. హోర్ముజ్ జలసంధిని ఏడు రోజుల్లో తిరిగి తెరవడానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రతిపాదించింది. అయితే ఇందుకు ముందుగా అమెరికా సైనిక ఒత్తిడిని తగ్గించేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలని ఇరాన్ కోరినట్లు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ ప్రతిపాదనను మధ్యవర్తుల ద్వారా అమెరికాకు చేరవేసినట్లు తెలుస్తోంది.
హోర్ముజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన మార్గాల్లో ఒకటి. ఈ మార్గం ద్వారా భారీగా చమురు, గ్యాస్ రవాణా జరుగుతుంది. ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతల కారణంగా ఈ ప్రాంతంలో రాకపోకలు దెబ్బతినడంతో అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం పడింది. ఇప్పుడు ఇరాన్ జలసంధిని తిరిగి తెరవడానికి ముందుకు రావడం దౌత్యపరంగా కీలక పరిణామంగా మారింది.
అమెరికా తన సైనిక చర్యలను తగ్గించి, ఇరాన్ పోర్టులపై కొనసాగుతున్న ఆంక్షలు, ఒత్తిడిని తొలగించే దిశగా అడుగులు వేయాలని ఇరాన్ కోరినట్లు సమాచారం. అమెరికా చర్చలకు తిరిగి వస్తుందని హామీ ఇస్తే.. హోర్ముజ్ జలసంధిని ఏడు రోజుల్లో తెరిచి, మళ్లీ చర్చలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ తెలిపినట్లు తెలుస్తోంది.
ఈ వారం న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలను కూడా ఇరాన్ దౌత్య ప్రయత్నాలకు ఉపయోగించుకోవాలని భావిస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం చేస్తున్న దేశాలతో ఇరాన్ ప్రతినిధులు సమావేశం కానున్నట్లు సమాచారం. అయితే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య నేరుగా సమావేశం జరిగే అవకాశం లేదని ఇరాన్ అధికారి స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, ఈ ప్రతిపాదనకు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆమోదం తెలిపినట్లు ఆ దేశ అధికారి వెల్లడించారు. ఇటీవల ఇరాన్ అమెరికాకు ఏడు షరతులు పెట్టినట్లు సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ తెలిపారు. ఇందులో ఇరాన్ పోర్టులపై ఆంక్షలు ఎత్తివేయడం, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం వంటి డిమాండ్లు ఉన్నట్లు సమాచారం.
ఇరాన్-అమెరికా మధ్య తాజా ప్రతిపాదనకు నేపథ్యంగా ఈ ఏడాది ఫిబ్రవరి చివర్లో మొదలైన తీవ్ర ఉద్రిక్తతలు ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్‌తో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. జూన్‌లో ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన కూడా తర్వాత మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో ముందుకు సాగలేదు. ఇప్పుడు హోర్ముజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్ చేసిన ప్రతిపాదనతో ఇరు దేశాల మధ్య మళ్లీ చర్చలకు అవకాశం ఏర్పడుతుందా అనే ఆసక్తి నెలకొంది.









