
ఇరాన్ పౌరులకు ఆ దేశ ప్రభుత్వం సంచలన హెచ్చరికను జారీ చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌కు చెందిన అత్యంత కీలకమైన భూగర్భ అణు కర్మాగారాలపై విరుచుకుపడే అవకాశం ఉందనే నేపథ్యంలో అణు విస్ఫోటనం సంభవిస్తే ఎలా ప్రాణాలు దక్కించుకోవచ్చో వివరిస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. ఇరాన్ ఎనిమిది నిమిషాల నిడివి గల ఒక విద్యాపరమైన వీడియోతో పాటు పూర్తి వివరాలను పౌరులకు అందించింది. ఈ మార్గదర్శకాల్లో ముఖ్యంగా ఎయిర్ కండిషనర్లను ఆపివేయాలని, కిటికీలకు దూరంగా నేలమాళిగల్లో దాక్కోవాలని కనీసం 24 గంటల పాటు సురక్షిత ప్రాంతాలకే పరిమితం కావాలని ఆదేశించింది.
ఇరాన్‌లోని ఇస్ఫహాన్ ప్రావిన్స్‌లో ఉన్న పిక్సాక్స్ పర్వతం క్రింద భూమి లోతుల్లో నతాంజ్ అణు కర్మాగారం నిర్మించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ భూగర్భ కేంద్రంపై అణుదాడి లేదా వైమానిక దాడి చేసేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్న తరుణంలో ఈ ప్రకటన రావడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలాన్ని రేపుతోంది. గతంలో అంటే 2025 జూన్‌లో ఇజ్రాయెల్-అమెరికా దాడులు జరిగినప్పుడు రేడియేషన్ బయటకు వ్యాపించదని ఇరాన్ పౌరులకు భరోసా ఇచ్చింది. కానీ ఈసారి మాత్రం పూర్తి భిన్నంగా అణు విస్ఫోటనం సంభవిస్తే ఎదురయ్యే తీవ్ర కాంతి, వేడి, పేలుడు తరంగాలు, రేడియోధార్మిక అవశేషాల నుంచి ఎలా రక్షించుకోవాలో స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.
Also Read : సూపర్‌మార్కెట్ ఫ్రిజ్‌లపై సైబర్ ఎటాక్: యూరప్‌ను వణికించిన హ్యాకింగ్!
🚨 BREAKING NEWS | IRAN
Iranian television warns citizens to protect themselves amid fears of a potential nuclear strike in central Iran.
The situation raises concerns about a nuclear catastrophe similar to Hiroshima and Nagasaki in Japan. https://t.co/SB0nFubfg6
— Japheth 🐂🀄️ (@japhethneo) November 3, 2026
అణుదాడి జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ భవనాల మధ్య భాగంలో ఉండే గదుల్లో లేదా భూగర్భ నేలమాళిగల్లో ఆశ్రయం పొందాలని ఇరాన్ అధికారులు సూచించారు. బయటి నుంచి వచ్చే ప్రమాదకరమైన గాలిని అరికట్టడానికి ఇంట్లోని తలుపులు, కిటికీలు పూర్తిగా మూసివేయాలని, ఎయిర్ కండిషనర్లు, ఇతర వెంటిలేషన్ వ్యవస్థలను వెంటనే నిలిపివేయాలని పేర్కొన్నారు. వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు వాటిని ఆశ్రయాలుగా భావించవద్దని, పేలుడును చూడటం లేదా ఫోటోలు తీయడం వంటివి చేయకూడదని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో చిక్కుకున్న వారు వెంటనే నేలపై పడుకుని ముఖాన్ని, తలను కప్పుకోవాలని తెలిపారు. ఆ తర్వాత కనీసం 24 గంటల పాటు సురక్షిత ప్రాంతాల నుంచి బయటకు రాకూడదని, కేవలం ప్యాక్ చేసిన ఆహారం, సీసాల్లోని నీటిని మాత్రమే ఉపయోగించాలని సూచించారు.
ఈ హెచ్చరికల్లో అత్యంత ఆందోళనకరమైన అంశం గాలి ద్వారా ప్రయాణించే రేడియోధార్మిక ధూళి. పేలుడు జరిగిన ప్రదేశానికే పరిమితం కాకుండా గాలుల ప్రభావం వల్ల రేడియోధార్మికత వందల కిలోమీటర్ల దూరం వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఈ రేడియోధార్మిక అవశేషాలు తూర్పు వైపు ప్రయాణిస్తే పాకిస్తాన్, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు కూడా ముప్పు పొంచి ఉండే ప్రమాదం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఒకవేళ ఎవరిపైనైనా రేడియోధార్మిక ధూళి పడితే వారు పై దుస్తులను జాగ్రత్తగా తొలగించి కవర్లలో మూసివేసి, చర్మాన్ని, జుట్టును కండిషనర్ లేని సాధారణ షాంపూ, సబ్బుతో శుభ్రం చేసుకోవాలని కోరారు.
దీనితో పాటు రేడియేషన్ అత్యవసర సమయాల్లో వైద్యుల సలహా లేకుండా సొంతంగా అయోడిన్ మాత్రలు లేదా ప్రష్యన్ బ్లూ వంటి మందులను వాడవద్దని ఇరాన్ ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇటువంటి అణు విస్ఫోటనాల వల్ల విద్యుదయస్కాంత స్పందనలు ఏర్పడి ఇంటర్నెట్, ఫోన్లు పనిచేయకపోవచ్చు కాబట్టి ప్రభుత్వం ఇచ్చే తాజా సమాచారం కోసం పౌరులు బ్యాటరీతో నడిచే రేడియోలను అందుబాటులో ఉంచుకోవాలని సలహా ఇచ్చింది. ఇరాన్ దీనిని తన పాసివ్ డిఫెన్స్ వీక్‌లో భాగంగా విడుదల చేసినప్పటికీ పెరిగిన యుద్ధ భయాల నేపథ్యంలో ఈ హెచ్చరికలు ప్రపంచదేశాల్లో తీవ్ర ఉత్కంఠను నింపుతున్నాయి.
Also Read : చైనా J-20 స్టెల్త్ ఫైటర్ల నయా అవతార్.. స్వదేశీ ఇంజిన్లు, లెటెస్ట్ సెన్సార్లు









