
Iran Wants Control Another chokepoint: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతుండటంతో, ఇరాన్ తన ప్రాక్సీ (అనుబంధ) బలగాలను రంగంలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే సముద్ర వాణిజ్యానికి అత్యంత కీలకమైన మరొక చొక్పాయింట్ (ఇరుకైన సముద్ర మార్గం) మూతపడే ప్రమాదం ఉంది. ఇది కేవలం రెండు దేశాల మధ్య పోరుగానే కాకుండా, ప్రపంచవ్యాప్త ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఒకవైపు హోర్ముజ్ జలసంధి ద్వారా సాగే చమురు రవాణా, యుద్దానికి ముందు నాటి స్థాయికి దాదాపు మూడింట రెండు వంతుల (two-thirds) వరకు పుంజుకుందని డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల అమెరికా జరిపిన వైమానిక దాడులు, ఇరాన్ ప్రతీకార చర్యల వల్ల హోర్ముజ్ జలసంధిలో చమురు రవాణా నిలిచిపోయిందన్న వార్తలను అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ ఖండించారు. గడిచిన వారంలో ప్రతిరోజూ దాదాపు 70 లక్షల బారెళ్ల చమురు రవాణా జరిగిందని, అరబ్ గల్ఫ్ ప్రాంతం నుండి ప్రతిరోజూ 1.4 కోట్ల బారెళ్ల చమురు సరఫరా అవుతోందని ఆయన వెల్లడించారు.
మరోవైపు, ఈ యుద్ధ పరిధి కేవలం హోర్ముజ్ జలసంధికే పరిమితం కాకుండా ఎర్రసముద్రం (Red Sea) ,సూయజ్ కాలువ (Suez Canal) వరకు విస్తరిస్తుందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. నాటో (NATO) మాజీ సుప్రీమ్ అలైడ్ కమాండర్, రిటైర్డ్ అడ్మిరల్ జేమ్స్ స్టావ్రిడిస్ ఈ అంశంపై హెచ్చరించారు. యుద్ధ ఒత్తిడి పెరిగితే ఇరాన్ తన ప్రాక్సీ బలగమైన హూతీ తిరుగుబాటుదారులను ఉపయోగించి సూయజ్ కాలువను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని, తద్వారా పోరాట పరిధిని పెంచాలని చూస్తోందని ఆయన ఒక మీడియా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య యెమెన్, జిబౌటి, ఎరిట్రియా దేశాల మధ్య ఉన్న బాబ్-ఎల్-మందేబ్ (Bab-al-Mandeb) జలసంధిపై తీవ్ర ఆందోళన మొదలైంది. ఇది ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాల మధ్య వాణిజ్యానికి, చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గం. అమెరికా తన చర్యలను ఉపసంహరించుకోకపోతే, దానికి మద్దతు ఇచ్చే దేశాల ప్రధాన ఎగుమతి మార్గాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) హెచ్చరించింది. దీనికి తోడు యెమెన్‌లోని హూతీలు కూడా బాబ్-ఎల్-మందేబ్‌ను మూసివేస్తామని బెదిరిస్తున్నారు.
నాలుగేళ్ల నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సౌదీ అరేబియా తమ సనా విమానాశ్రయంపై దాడి చేసిందని హూతీలు ఆరోపిస్తున్నారు. దీనికి నిరసనగా వారు సౌదీ అరేబియాపై క్షిపణి దాడులు చేశారు. పరిస్థితులు మరింత దిగజారితే బాబ్-ఎల్-మందేబ్, హోర్ముజ్ జలసంధి రెండూ తీవ్రంగా ప్రభావితమవుతాయని, అదే జరిగితే అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధర బారెల్‌కు 200 డాలర్లకు చేరుకుంటుందని హూతీలు హెచ్చరించారు.
పర్షియన్ గల్ఫ్‌ను అరేబియా సముద్రంతో కలిపే హోర్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచంలోనే అత్యధిక భాగం ముడిచమురు, సహజ వాయువు ఎగుమతి అవుతాయి. ఇక బాబ్-ఎల్-మందేబ్ జలసంధి ఎర్రసముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ అడెన్ , హిందూ మహాసముద్రంతో కలుపుతూ ఐరోపా వాణిజ్యానికి వెన్నుముకగా నిలుస్తోంది. ఈ రెండు మార్గాలలో నౌకాయానానికి ఆటంకం కలిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా దెబ్బతిని, షిప్పింగ్ ఛార్జీలు పెరిగిపోయి తీవ్రస్థాయి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది.









