
Indian Origin Couple : అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌కు భారత సంతతికి చెందిన దంపతులు అనురాధ, వికాస్ సిన్హా భారీ విరాళం ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్‌లో విద్య, పరిశోధనను మరింత అభివృద్ధి చేసేందుకు 20 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు రూ.170 కోట్లకు పైగా విరాళంగా అందించారు. దీంతో ఆ యూనివర్సిటీ కొత్తగా ఏర్పాటు చేయనున్న కాలేజీకి వారి పేర్లను పెట్టనుంది. ఈ విరాళంతో అనురాధ అండ్ వికాస్ సిన్హా కాలేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్ ఏర్పాటు కానుంది. ఈ కాలేజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, హెల్త్ ఇన్ఫర్మాటిక్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్, లెర్నింగ్ టెక్నాలజీస్ వంటి అంశాలపై విద్య, పరిశోధన కొనసాగుతాయి.
ఈ విరాళంలో భాగంగా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ప్రొఫెసర్‌షిప్‌లు, కాలేజీ నిర్వహణ, స్టార్టప్‌లు, కొత్త ఆలోచనలకు ప్రోత్సాహం, అధునాతన పరిశోధనలు, కొత్త టెక్నాలజీల కోసం ఆరు ప్రత్యేక నిధులను కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఈ కాలేజీ అమెరికాలో ఏఐ విద్య, పరిశోధనకు ముఖ్యమైన కేంద్రంగా మారనుంది. తమ విరాళం గురించి వికాస్ సిన్హా మాట్లాడుతూ.. భవిష్యత్తును ఏఐ టెక్నాలజీ ఎంతో ప్రభావితం చేయబోతోందని అన్నారు. ఏఐ రంగంలో ముందుకు వెళ్లే విద్యార్థులను సిద్ధం చేయడంలో యూనివర్సిటీల పాత్ర చాలా ముఖ్యమని చెప్పారు. తాము కూడా అమెరికాకు వలస వెళ్లి చదువుకున్నామని, తమకు లభించిన అవకాశాలను ఇప్పుడు ఇతరులకు అందించాలని భావిస్తున్నామని తెలిపారు. “విద్య మా జీవితంలో ఎన్నో అవకాశాలకు తలుపులు తెరిచింది. ఆ తలుపులు ఇతరుల కోసం కూడా తెరిచి ఉంచాలని మేము కోరుకుంటున్నాం” అని ఆయన అన్నారు.
అనురాధ, వికాస్ సిన్హాలకు విద్యారంగానికి విరాళాలు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. 2024లో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో డేటా సైన్స్ విభాగం ఏర్పాటుకు వారు సహకరించారు. 2025లో డేటా సైన్స్ కోసం సిన్హా ఇన్నోవేషన్ ల్యాబ్ ఏర్పాటుకు కూడా భారీగా విరాళం ఇచ్చారు. తాజాగా మరో రూ.170 కోట్లకు పైగా ఇచ్చి ఏఐ కాలేజీని ఏర్పాటు చేయడంతో వారికి యూనివర్సిటీ అరుదైన గౌరవం కల్పించింది.
వికాస్ సిన్హా ప్రస్తుతం బ్రాడ్‌కామ్ సంస్థలో మెయిన్‌ఫ్రేమ్ సాఫ్ట్‌వేర్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. 2023లో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ నుంచి ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో డాక్టరేట్ పూర్తి చేశారు. కొత్త కాలేజీలో రెండు ప్రధాన విభాగాలు ఉండనున్నాయి. ఒకటి తెలివైన సిస్టమ్‌ల అభివృద్ధి, వినియోగంపై దృష్టి పెడుతుంది. మరో విభాగం మనుషులు, సంస్థలపై ఇన్ఫర్మేషన్, ఏఐ సిస్టమ్‌ల ప్రభావాన్ని అధ్యయనం చేయనుంది.
Also Read : ఐఫుల్ టవర్ దగ్గర మహిళలకు ఘోర అవమానం ?









