Indus waters : భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉన్న సింధు జలాల ఒప్పందంపై రగడ కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రపంచబ్యాంక్‌ ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు ఓ తీర్పునిచ్చింది. అయితే దాన్ని  భారత్‌ తోసిపుచ్చింది. ఈ న్యాయస్థానం చట్టవిరుద్ధంగా ఏర్పాటైన కోర్టుగా భారత్‌ ఆరోపించింది. సింధు జలాల ఒప్పందం తాత్కాలిక నిలుపుదల కొనసాగుతుందని తేల్చి చెప్పింది. పహల్గాంలో ఉగ్రదాడి  అనంతరం సింధు జలాల ఒప్పందాన్ని భారత్‌ తాత్కాలికంగా పక్కన పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై పాక్‌  ప్రపంచ బ్యాంక్‌ ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టును ఆశ్రయించింది. తాజాగా  ఆ కోర్టు తీర్పు వెలువరించింది.

ఈ సందర్భంగా కోర్టు తీర్పునిస్తూ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడానికి న్యూఢిల్లీ చెప్పిన కారణం సహేతుకంగా లేదంది. రద్దు చేయడం సమర్థనీయంగా లేదని పేర్కొంది. సింధు జలాల ఒప్పందం పూర్తిస్థాయిలో అమలు చేయాలని సూచన చేసింది. అలాగే, జమ్మూకశ్మీర్‌లో నిర్మిస్తున్న హైడ్రోఎలక్ట్రిక్‌ పనులపై పరిమితులు విధిస్తూ తీర్పు నిచ్చింది. అయితే  దీనిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించింది. ఈ మధ్యవర్తిత్వ న్యాయస్థానం చట్టవిరుద్ధంగా ఏర్పాటైందని ఆరోపించింది. భారత్ సార్వభౌమ నిర్ణయాలపై తీర్పు చెప్పే అర్హత గానీ, అధికార పరిధి గానీ దానికి లేవని తేల్చి చెప్పింది. ఈ కోర్టును మొదటి నుంచీ భారత్ గుర్తించలేదని, దాని విచారణలకు ఎప్పుడూ హాజరుకాలేదని స్పష్టం చేసింది. కాబట్టి ఆ న్యాయస్థానం ఇచ్చే తీర్పులు ఏవీ చెల్లవని, భారత్ చేపట్టే ప్రాజెక్టులపై వాటి ప్రభావం ఉండదని తేల్చిచెప్పింది.

ఏమిటీ ఒప్పందం?
కాగా సింధు, దాని ఉపనదుల జలాలను భరత్‌, పాక్‌లు పంచుకోవడానికి ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంతో రెండుదేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీనిపై 1960 సెప్టెంబరులో నాటి భారత ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ, పాకిస్థాన్‌ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌ సంతకాలు కూడా చేశారు.ఆ  ఒప్పందం ప్రకారం సింధు ఉప నదుల్లో తూర్పున ప్రవహించే రావి, బియాస్, సట్లెజ్‌ నదులపై భారతదేశానికి పూర్తి హక్కులు ఉన్నాయి. సింధు నదితోపాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్‌లపై పాకిస్థాన్‌కు హక్కులు ఉంటాయి. అయితే ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్‌ మద్దతు ఇస్తోందనే కారణంతో 2025 ఏప్రిల్‌లో భారతదేశం ఈ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఉగ్రవాదాన్ని పాక్‌ శాశ్వతంగా అణచివేసే వరకు ఈ ఒప్పందం పునరుద్ధరణ ఉండదని భారత్ తేల్చి చెప్పింది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.