Pakistan :పాకిస్థాన్‌లో తయారైన రెండు ఫెయిర్‌నెస్ క్రీముల విషయంలో భారత్‌ దేశవ్యాప్తంగా హెచ్చరిక జారీ చేసింది. ఈ క్రీముల్లో అనుమతించిన పరిమితికి మించి భారీ లోహాలు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దీంతో కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ ఈ రెండు క్రీములను భారత్‌లో విక్రయించేందుకు అనుమతి లేని కాస్మెటిక్స్‌గా గుర్తించింది.

CDSCO సెప్టెంబర్‌ 8, 2026న జారీ చేసిన ప్రజారోగ్య హెచ్చరికలో గోరీ బ్యూటీ క్రీమ్, చాందినీ వైటెనింగ్ క్రీమ్ పేర్లను పేర్కొంది. ఈ రెండు ఉత్పత్తులను కొనుగోలు చేయొద్దని, ఇప్పటికే కొనుగోలు చేసి ఉంటే ఉపయోగించొద్దని వినియోగదారులకు సూచించింది. అంతేకాదు.. ఈ క్రీములు మార్కెట్లో అమ్మకుండా, పంపిణీ చేయకుండా, ప్రకటనలు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఔషధ నియంత్రణ అధికారులను CDSCO ఆదేశించింది.

గోరీ బ్యూటీ క్రీమ్: పాకిస్థాన్‌లో తయారైన ఈ ఫెయిర్‌నెస్ క్రీమ్‌ను భారత్‌లో విక్రయించేందుకు అవసరమైన అనుమతులు లేని కాస్మెటిక్‌గా CDSCO గుర్తించింది. పరీక్షల్లో భారీ లోహాలు నిర్ణయించిన పరిమితికి మించి ఉన్నట్లు తేలింది.
చాందినీ వైటెనింగ్ క్రీమ్: ఈ క్రీమ్‌లోనూ అనుమతించిన స్థాయికి మించి భారీ లోహాలు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు.. భారత్‌లో దిగుమతి చేసుకుని విక్రయించేందుకు అవసరమైన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కూడా ఈ ఉత్పత్తికి లేదని CDSCO తెలిపింది.

ఈ రెండు క్రీములు భారత్‌లోకి ఏ మార్గంలో వచ్చాయనే విషయం CDSCO నోటీసులో స్పష్టంగా లేదు. ఎవరు దిగుమతి చేశారు? ఎవరు పంపిణీ చేశారు అక్రమంగా తరలించారా అనే వివరాలను అధికారులు వెల్లడించలేదు. అయితే ఈ ఉత్పత్తులకు భారత్‌లో విక్రయించేందుకు అవసరమైన దిగుమతి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు లేవని CDSCO స్పష్టం చేసింది. అందువల్ల అనుమతి లేని కాస్మెటిక్స్ దేశంలోని మార్కెట్లకు ఎలా చేరుతున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

భారత్‌లో దిగుమతి చేసుకునే కాస్మెటిక్స్‌కు నిర్దేశించిన నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ ఉండాలి. అలాగే భారత్‌లో తయారు చేసే కాస్మెటిక్స్‌కు తయారీ, విక్రయాలకు సంబంధిత అధికారుల నుంచి అవసరమైన లైసెన్సులు తీసుకోవాలి. వినియోగదారులకు విక్రయించే కాస్మెటిక్స్‌ భద్రతా ప్రమాణాలు, లేబులింగ్‌ నిబంధనలు, ఇతర నియమాలను పాటించాల్సి ఉంటుంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.