ఫ్రాన్స్‌లోని ప్రధాన నగరాలు రణరంగంగా మారాయి. పారిస్, లియోన్, మార్సెయిల్ వంటి నగరాల్లో వీధి నిరసనలు, దహనాలు, ప్రజాగ్రహం వెల్లువెత్తుతున్నాయి. కార్మిక సంఘాలు, ఉన్నత పాఠశాల, విశ్వవిద్యాలయ విద్యార్థులు, ప్రభుత్వ రంగ ఉద్యోగులు, సాధారణ పౌరులు అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి భారీ నిరసనలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో పోలీసులకు, నిరసనకారులకు మధ్య హింసాత్మక ఘర్షణలు జరుగుతుండటంతో పరిస్థితి అదుపు తప్పింది. దేశాన్ని ఇలాంటి తీవ్ర రాజకీయ, సామాజిక సంక్షోభంలోకి నెట్టినందుకు అధ్యక్షుడు మాక్రాన్ చేసిన ఐదు ప్రధాన వ్యూహాత్మక, విధానపరమైన తప్పిదాలే కారణమని నిపుణులు అంటున్నారు.

ఈ ఉద్యమానికి ప్రధాన బీజం ఫ్రాన్స్‌లోని ఉన్నత పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో పడింది. ద్రవ్య లోటును నియంత్రించే నెపంతో మాక్రాన్ ప్రభుత్వం విద్య, ప్రజా బడ్జెట్‌లలో గణనీయమైన కోతలు విధించింది. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల తీవ్ర కొరత ఏర్పడి, తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిపోవడమే కాకుండా, విద్యా మౌలిక సదుపాయాలు ఘోరంగా క్షీణించాయి. ప్రభుత్వం తమ ఉజ్వల భవిష్యత్తును దెబ్బతీస్తోందని గ్రహించిన యువత, విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు. మొదట విద్యార్థులు శాంతియుతంగా చేపట్టిన ఈ ఉద్యమం, ఆ తర్వాత ప్రభుత్వం వారి డిమాండ్లను పట్టించుకోకపోవడంతో దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులు, యూనియన్లతో చేతులు కలిపి ఉగ్రరూపం దాల్చింది.

మరోవైపు ఫ్రాన్స్‌లో ద్రవ్యోల్బణం, జీవన వ్యయం క్రమంగా పెరిగిపోతుండటం సాధారణ ప్రజల సహనాన్ని పరీక్షించింది. ఆహారం, విద్యుత్, గ్యాస్, ఇంధన ధరలు ఆకాశాన్నంటడంతో మధ్యతరగతి, పేద వర్గాలు తీవ్రంగా కుంగిపోయాయి. అద్దెలు చెల్లించడం, రోజువారీ అవసరాలు తీర్చుకోవడం సామాన్యులకు భారం అయిపోయింది. ప్రభుత్వ విధానాలు కేవలం కార్పొరేట్ సంస్థలకు, పెద్ద పెట్టుబడిదారులకు పన్ను రాయితీలు కల్పించడానికే ఉపయోగపడుతున్నాయి. ద్రవ్యోల్బణంతో అల్లాడుతున్న శ్రామిక వర్గానికి ప్రభుత్వం ఎటువంటి ఉపశమనం అందించలేదని ఫ్రెంచ్ కార్మిక సంఘాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ఈ ఆర్ధిక అసమానత ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తిని పెంచేసింది.

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రెండవ పదవీకాలంలో ప్రజాభిప్రాయాన్ని, ప్రజాస్వామ్య సంభాషణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పింఛను సంస్కరణలు లేదా ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే కొత్త బడ్జెట్ విషయంలో ప్రతిపక్షాలు, కార్మిక సంఘాలతో సంప్రదించకుండా పార్లమెంటు ప్రత్యేక అధికారాలను ఉపయోగించి ఏకపక్షంగా నిర్ణయాలను రుద్దడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. ప్రజలు, నిరసనకారుల తొలి హెచ్చరికలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించకపోవడం, కేవలం పరిపాలనా బలంతో విధానాలను అమలుపరచడానికి చూడటంతో, మాక్రాన్ ప్రభుత్వ ఏకపక్ష వైఖరిపై ప్రజలకు తీవ్ర ఆగ్రహం కలిగింది.

అంతేకాకుండా దేశంలో నిరసనలు ప్రారంభమైనప్పుడు వాటి వ్యాప్తిని, తీవ్రతను సరిగ్గా అంచనా వేయడంలో ప్రభుత్వం, నిఘా సంస్థలు పూర్తిగా విఫలమయ్యాయి. పోలీస్ యంత్రాంగం పరిస్థితి తీవ్రతను ముందే గ్రహించలేకపోవడంతో పారిస్‌తో సహా ప్రధాన నగరాల్లో తొలి ర్యాలీలలోకే అరాచకవాదులు చొరబడ్డారు. ప్రభుత్వ భవనాలు, చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలకు నిప్పు పెట్టడం, దుకాణాలను ధ్వంసం చేయడం, వాహనాలను కాల్చివేయడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. భద్రతా అంచనాలు లోపభూయిష్టంగా ఉన్నాయని చివరకు స్వయంగా ప్రభుత్వమే అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఫ్రాన్స్ సామాజిక వ్యవస్థకు ప్రధాన బలం దాని సంక్షేమ రాజ్యం నమూనా. ఆరోగ్యం, విద్య, పింఛను,సామాజిక భద్రతకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. అయితే మాక్రాన్ ప్రభుత్వం బడ్జెట్ కోతల పేరుతో ఈ సంక్షేమ పథకాలపై దాడి చేసిందని ప్రజలు భావించారు. అందుకే ఈసారి కేవలం విద్యార్థులు లేదా వామపక్షాలు మాత్రమే కాకుండా ఆరోగ్య కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, పదవీ విరమణ పొందిన వృద్ధులు కూడా ఈ ఉద్యమంలో భాగమయ్యారు. ప్రస్తుతం ఫ్రాన్స్ ఆర్థిక వ్యవస్థకు, పర్యాటక రంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. బలప్రయోగంతో నిరసనలను అణచివేయడం కాకుండా వెనక్కి తగ్గి ప్రజా సంఘాలతో చర్చలు జరిపితేనే ఫ్రాన్స్‌కు ఈ సంక్షోభం నుంచి ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు.