
Elon Musk : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ చేపట్టిన టాప్ ప్రాజెక్ట్‌లో స్టార్ లింక్ చాలా ముఖ్యమైనది. ప్రస్తుతం మనం వాడుతున్న ఇంటర్నెట్ కేబుల్స్, టవర్లు లేదా ఫోన్ సిగ్నల్స్ ద్వారా అందుతుంది. కానీ స్టార్‌లింక్ అలా కాదు. ఇది నేరుగా అంతరిక్షం నుంచి ఎలాంటి వైర్లు, టవర్లు లేకుండా నేరుగా హైస్పీడ్ ఇంటర్నెట్ను అందించే అద్భుతమైన టెక్నాలజీ. మారుమూల అడవులు, ఎడారులు, సముద్ర మధ్యలో లేదా సిగ్నల్స్ అస్సలు కొండ ప్రాంతాల్లో కూడా సూపర్‌ఫాస్ట్ ఇంటర్నెట్ను అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం.
Also Read : ట్రంప్ సంచలన నిర్ణయం.. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా లేడీ లాయర్ కేటీ జకారియా!
స్టార్‌లింక్ ఎలా పనిచేస్తుంది?
మనం సాధారణంగా వాడే జియో, ఎయిర్టెల్ లేదా బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ కోసం భూమిపై భారీ టవర్లను, భూగర్భంలో ఫైబర్ కేబుల్స్‌ను ఏర్పాటు చేస్తారు. కానీ స్టార్‌లింక్ మాత్రం భూమికి చాలా దగ్గరగా అంటే కేవలం 550 కిలోమీటర్ల ఎత్తులో ఉండే తక్కువ భూకక్ష్యలో వేలాది సంఖ్యలో చిన్న శాటిలైట్లను ప్రయోగించింది. ఈ శాటిలైట్లు భూమి చుట్టూ వేగంగా తిరుగుతుంటాయి. మన ఇంటి దగ్గర స్టార్‌లింక్ అందించే ఒక చిన్న డిష్ యాంటెన్నాను, వైఫై రౌటర్‌ను ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. ఆ డిష్ నేరుగా ఆకాశంలో తిరుగుతున్న శాటిలైట్లతో సిగ్నల్స్ మార్పిడి చేసుకుంటుంది. శాటిలైట్లు అంతరిక్షం నుంచే సిగ్నల్స్‌ను నేరుగా మన రౌటర్‌కు పంపిస్తాయి. దీనివల్ల మధ్యలో ఎలాంటి టవర్ల అవసరం లేకుండానే అత్యంత వేగంగా హై-స్పీడ్ ఇంటర్నెట్, వైఫై సేవలు మనకు అందుతాయి. సాధారణ బ్రాడ్‌బ్యాండ్ కంటే ఇది చాలా వేగంగా పనిచేస్తుంది.
ఇండియాలో ఎప్పటి నుంచి వస్తుంది?
దేశంలో ఈ సేవలను అందించేందుకు ఎన్నో ఏళ్ల నుంచి ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్నారు. స్టార్‌లింక్ ఇప్పటికే టెలికాం శాఖ (DoT) నుంచి GMPCS లైసెన్స్‌ను, స్పేస్ రెగ్యులేటర్ IN-SPACe అనుమతులను పొందింది. అంతేకాకుండా భారత్‌లో సేవల కోసం దాదాపు 20 గేట్‌వే సైట్లను కూడా సిద్ధం చేసింది. అయితే భారత్‌లో వాణిజ్యపరంగా సేవలు ప్రారంభించడానికి ఇంకా తుది సెక్యూరిటీ క్లియరెన్స్, స్పెక్ట్రమ్ కేటాయింపులు పూర్తికావాల్సి ఉంది. డేటా భద్రత, చట్టపరమైన నిఘా వంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలను పరిశీలిస్తోంది. ఇవన్నీ పూర్తయిన వెంటనే ఇండియాలో అధికారికంగా స్టార్‌లింక్ సేవలు ప్రారంభమవుతాయి.
భారతీయులకు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది?
మన దేశంలో గ్రామీణ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల కొండ ప్రాంతాలు, అడవులు, సరిహద్దు గ్రామాలు, సముద్ర తీర ప్రాంతాల్లో సాధారణ టవర్లు వేయడం కష్టం. అక్కడ స్టార్‌లింక్ డిష్ ఉంటే చాలు, నగరాల్లో లభించేంత వేగవంతమైన ఇంటర్నెట్ అందుతుంది. అలాగే వరదలు, తుఫానులు, భూకంపాలు వచ్చినప్పుడు భూమిపై ఉన్న టవర్లు, కేబుల్స్ దెబ్బతిని కమ్యూనికేషన్ వ్యవస్థలు నిలిచిపోతాయి. కానీ శాటిలైట్ ఇంటర్నెట్ అంతరిక్షం నుంచి నేరుగా వస్తుంది కాబట్టి ఎలాంటి అత్యవసర పరిస్థితిలోనైనా నిరంతరాయంగా పనిచేస్తుంది. గ్రామాల్లో ఉండే పాఠశాలల్లో డిజిటల్ విద్యను అందించడానికి, గులకు టెలీమెడిసిన్ ద్వారా నగరాల నుంచి వైద్య సేవలు అందించడానికి ఉపయోగపడుతుంది. సుదీర్ఘ ప్రయాణాలు చేసే విమానాలు, షిప్‌లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణికులకు సీమ్‌లెస్ హైస్పీడ్ ఇంటర్నెట్ను అందించేందుకు ఇవి ఉపయోగపడతాయి.
Also Read : ఢిల్లీలో CJP నిరసనలో ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్ల దాడి!
ఈ నెట్‌వర్క్‌ను ఆపవచ్చా?
గొడవలు లేదా అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు స్పేస్ఎక్స్ తన సాఫ్ట్వేర్ ద్వారా నిర్దిష్ట ప్రాంతంలో సిగ్నల్స్ అందకుండా చేయవచ్చు. జియోఫెన్సింగ్ చేయడం, దేశంలోని గ్రౌండ్ స్టేషన్లకు విద్యుత్ లేదా నెట్ కనెక్షన్ నిలిపివేయడం, ప్రత్యేక జామర్ల సహాయంతో రేడియో సిగ్నల్స్‌ను అడ్డుకోవడం, ప్రభుత్వ ఆదేశాల మేరకు లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేయడం ద్వారా స్టార్‌లింక్ ఇంటర్నెట్ను పూర్తిగా ఆపవచ్చు.









