ఉత్తర కొరియాలో మరోసారి వంశపారంపర్య అధికార మార్పిడికి రంగం సిద్ధమవుతోందా? సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ తన 13 ఏళ్ల కూతురు కిమ్ జు ఏను తదుపరి పాలకురాలిగా ప్రమోట్ చేస్తున్నారా? అంటే అవుననే సంకేతాలు గట్టిగా కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన నిరంకుశ దేశంలో 4వ జనరేషన్ నియంతృత్వానికి పునాదులు పడుతున్న తీరుపై అంతర్జాతీయంగా తీవ్ర చర్చ నడుస్తోంది.

Also Read : అగ్రరాజ్యంలో వణుకు పుట్టిస్తున్న ఇరాన్.. బంకర్లోకి అమెరికా ఆర్థిక మంత్రి.. అసలు ఏం జరుగుతోంది?

పబ్లిక్ ఈవెంట్స్‌లో స్పెషల్ ప్రొటోకాల్

2022 చివర్లో మొదటిసారి తండ్రితో కలిసి కనిపించిన కిమ్ జు ఏ, అప్పటి నుంచి క్షిపణి ప్రయోగాలు, మిలిటరీ పరేడ్స్ వంటి కీలక ఈవెంట్లలో రెగ్యులర్‌గా కనిపిస్తోంది. ప్రభుత్వ మీడియా ఆమెను “అత్యంత ప్రియమైన”, “గౌరవనీయమైన బిడ్డ” అంటూ ఆకాశానికెత్తుతోంది. సీనియర్ మిలిటరీ జనరల్స్ ఆమె ముందు మోకరిల్లడం, తండ్రి కంటే ముందే నడవడం వంటి దృశ్యాలు ఆమెకు దక్కుతున్న ప్రాధాన్యతను స్పష్టం చేస్తున్నాయి. ఒకప్పుడు కిమ్ జోంగ్ ఇల్ వద్ద కిమ్ జోంగ్ ఉన్‌కు ఎలాంటి వీఐపీ ప్రొటోకాల్ ఇచ్చారో, ఇప్పుడు జు ఏకు కూడా అవే మర్యాదలు దక్కుతున్నాయని మాజీ దౌత్యవేత్తలు చెబుతున్నారు.

ప్రజల్లో నిశ్శబ్ద ఆమోదం.. తిరుగుబాటుకు ఆస్కారమే లేదు!

అసోసియేటెడ్ ప్రెస్ (AP) సంస్థ పలువురు డిఫెక్టర్లు (దేశం విడిచి పారిపోయినవారు), నిపుణులతో మాట్లాడినప్పుడు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి:

  • ప్రజాస్వామ్యం శూన్యం: సాధారణ ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికలు ఎలాగో, ఉత్తర కొరియాలో రాజవంశ వారసత్వం అలా ఇన్‌స్టిట్యూషనలైజ్ అయిపోయింది.

  • బ్రెయిన్‌వాషింగ్ & నిఘా: 1948 నుండి కిమ్ ఇల్ సంగ్, కిమ్ జోంగ్ ఇల్, కిమ్ జోంగ్ ఉన్ వరకు మూడు తరాలుగా సాగుతున్న పాలనను ప్రజలు అలవాటుగా స్వీకరిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేసే కఠిన నిఘా కారణంగా ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం చేసే స్కోప్ లేదు.

  • మహిళా నాయకత్వంపై భిన్నాభిప్రాయాలు: ఉత్తర కొరియా సమాజం సంప్రదాయ పితృస్వామ్య భావజాలం కలది. అధికార వర్కర్స్ పార్టీలో కిమ్ చెల్లెలు కిమ్ యో జోంగ్ మినహా కీలక పదవుల్లో మహిళలు లేరు. అయితే, అక్కడి వ్యవస్థలో కిమ్ కుటుంబాన్ని ‘దేవుళ్లుగా’ భావిస్తారు కాబట్టి జెండర్ అడ్డంకి కాకపోవచ్చని కొందరి వాదన.

Also Read : వందేళ్ల తర్వాత స్వదేశానికి చేరిన నాగా పూర్వీకుల అవశేషాలు

స్వేచ్ఛ కోసం పలాయనం

“మా పిల్లలు నాలుగో తరం డిక్టేటర్‌షిప్ కింద బానిసలుగా బతకడం ఇష్టం లేకే పడవలో దక్షిణ కొరియాకు పారిపోయాం” అని సియోల్‌లో ఆశ్రయం పొందుతున్న 32 ఏళ్ల కిమ్ యూమి ఆవేదన వ్యక్తం చేశారు. కిమ్ కుటుంబ అంతర్గత విషయాల గురించి తెలుసుకోవడమే అక్కడ ప్రాణసంకటం.

42 ఏళ్ల కిమ్ జోంగ్ ఉన్ ఊబకాయం, గుండె సంబంధిత హెల్త్ రిస్క్‌లతో బాధపడుతున్నారనే నిఘా నివేదికల నేపథ్యంలో, తన వారసత్వాన్ని స్థిరపరచడం కిమ్‌కు తప్పనిసరిగా మారింది. ఒకవేళ కిమ్ జు ఏ అధికార పగ్గాలు చేపడితే, 26 మిలియన్ల మంది అణచివేతకు గురవుతున్న ప్రజలను, అణ్వాయుధాలు కలిగిన ఒక పేద దేశాన్ని నడిపించే ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా పాలకురాలిగా ఆమె చరిత్రకెక్కుతుంది.