
ఆఫ్రికా అనగానే గుర్తొచ్చేది అపారమైన సహజ వనరులు. వజ్రాలు, చమురు, కోబాల్ట్, యురేనియంతో పాటు గోల్డ్ కూడా ఈ ఖండానికి ప్రధాన సంపద. ప్రపంచ వ్యాప్తంగా లభించే బంగారంలో ఎక్కువ శాతం ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతుంది. అయితే ఇదే బంగారం కోసం జరుగుతున్న వేట.. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. తాజాగా సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో బంగారు గని కూలిపోవడంతో పెద్ద సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. గని లోపల పనులు జరుగుతుండగా ఒక్కసారిగా మట్టి, రాళ్లు కూలడంతో కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. దాదాపు 50 మంది మృతి చెందారు. మరికొందరి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరి ఆఫ్రికాలో గోల్డ్ మైనింగ్ వెనుక దాగున్న అసలు కథ ఏంటి..? ఆఫ్రికాలో ఎన్ని గోల్డ్ మైన్స్ ఉన్నాయి..? ఇక్కడి గనుల్లో తరచు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి..? ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సాధారణంగా ఈ ప్రాంతాల్లోని మైన్స్‌లో కనీస భద్రతా జాగ్రత్తలు లేకుండానే కార్మికులు పనిచేస్తుంటారు. దాంతో తరుచు ప్రమాదాలు జరుగుతుంటాయి. తాజాగా జరిగిన ప్రమాదం సమయంలో గని లోపల దాదాపు వంద మందికిపైగా వర్కర్లు ఉన్నారు. భారీగా మట్టి విరిగిపడటంతో బయటకు వచ్చే దారి పూర్తిగా మూసుకుపోయింది. లోపల చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు లోకల్ రెస్క్యూ టీమ్స్, ఎమర్జెన్సీ సర్వీసెస్ గంటల తరబడి శ్రమించాయి. కానీ మైన్ లోపల ఆక్సిజన్ అందకపోవడం, సహాయక చర్యలకు ప్రతికూల పరిస్థితులు ఎదురుకావడంతో చాలామంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పటివరకు 50 మృతదేహాలను బయటకు తీశారు.. ఇంకా కొందరు శిథిలాల కింద చిక్కుకుని ఉన్నారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు
అయితే ఆఫ్రికాలో ఇలాంటి గని ప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇక్కడ గోల్డ్ మైనింగ్ అనేది ఒకవైపు భారీ బిజినెస్ అయితే.. మరోవైపు లక్షలాది మంది స్థానికులకు ఏకైక జీవనాధారంగా మారింది. ముఖ్యంగా వెస్ట్, సెంట్రల్, ఈస్ట్ ఆఫ్రికా దేశాలైన మాలి, ఘనా, కాంగో, టాంజానియా, దక్షణాఫ్రికా వంటి ప్రాంతాల్లో అక్రమ గనులు వేల సంఖ్యలో ఉన్నాయి. వీటిని స్థానికంగా ఆర్టిసానల్ అండ్ స్మాల్-స్కేల్ మైనింగ్ అని పిలుస్తారు. అయితే ఇవి పెద్ద పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలు నిర్వహించే ఆధునిక మైన్స్లా ఉండవు. చాలా చోట్ల ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ, భారీ మైనింగ్ పరికరాలు లేకుండానే.. బేసిక్ టూల్స్‌తో భూమిని తవ్వుకుంటూ గోల్డ్ కోసం వెతుకుతుంటారు. కొన్నిసార్లు భూమిలోకి చాలా లోతుగా వెళ్లిపోతారు. కానీ భూగర్భ నిర్మాణం ఎలా ఉంది..? నేల ఎంత స్థిరంగా ఉంది..? ఎక్కడ కూలిపోయే ప్రమాదం ఉంది..? అనే విషయాలను అంచనా వేసే సాంకేతిక సదుపాయాలు ఉండవు. దీంతో భారీ వర్షాలు, నేలలో కదలికలు లేదా చిన్న నిర్మాణ వైఫల్యం వచ్చినా.. మొత్తం మైనింగ్ ప్రాంతం ఒక్కసారిగా కూలిపోయే ప్రమాదం ఉంటుంది.
ఈ ప్రమాదాలు ఎందుకు ఇంత తరచుగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవాలంటే.. ఆఫ్రికాలో గోల్డ్ మైనింగ్ ఎంత విస్తరించి ఉందో చూడాలి. అధికారిక డేటా ప్రకారం అక్కడ సుమారు 741 బంగారు నిక్షేపాలు ఉండగా.. వాటిలో 228 నిర్వహణలో ఉన్న బంగారు గనులు ఉన్నాయి. ఇవి అధికారికంగా నమోదైన పెద్ద గనుల తవ్వకం కార్యకలాపాలు మాత్రమే. వీటికి అదనంగా చిన్న-స్థాయి, అనధికారిక గనుల ప్రాంతాలు కూడా భారీ సంఖ్యలో ఉన్నాయి. ఘనా, మాలి, సూడాన్, దక్షిణాఫ్రికా, టాంజానియా వంటి దేశాలు ఆఫ్రికా బంగారు పరిశ్రమలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. పెద్ద కంపెనీలు నిర్వహించే మైన్స్‌లో యంత్రాలు, గాలి ప్రసరణ వ్యవస్థలు, పర్యవేక్షణ సాంకేతికత, రక్షణ పరికరాల వంటి భద్రతా చర్యలు ఉంటాయి. దీనికి పూర్తి భిన్నంగా అనధికారిక గనుల ప్రాంతాలలో మాత్రం బేసిక్ టూల్స్‌తోనే మైనింగ్ చేసే పరిస్థితులు కనిపిస్తాయి.
Also Read : బంగారు గనిలో తీవ్ర విషాదం.. కొండచరియలు పడి 13 మంది దుర్మరణం!
సౌత్ ఆఫ్రికాలోని మ్పోనెంగ్ బంగారు గని ఈ మైనింగ్ తీవ్రతకు ఒక ఉదాహరణ. భూమి ఉపరితలం నుంచి దాదాపు 4 కిలోమీటర్ల లోతు వరకు వెళ్లే ఈ మైన్.. ప్రపంచంలోనే అత్యంత లోతైన గోల్డ్ మైన్స్‌లో ఒకటి. ఇంత లోతులో మైనింగ్ చేయాలంటే భారీ ఇంజనీరింగ్, వెంటిలేషన్, కూలింగ్ సిస్టమ్స్, పర్యవేక్షణ సాంకేతికత అవసరం. కానీ ఇదే మౌలిక సదుపాయాలు చిన్న, అనధికారిక గనులలో ఉండదు. అందుకే ప్రమాదాల విషయంలో చట్టబద్ధమైన మైనింగ్ కార్యకలాపాలకు, అనధికారిక గనుల ప్రాంతాలకు మధ్య భారీ తేడా కనిపిస్తుంది. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, సరైన రక్షణ పరికరాలు లేకపోవడం, ప్రభుత్వ పర్యవేక్షణ తక్కువగా ఉండటం.. అనధికారిక గనులను మరింత ప్రమాదకరంగా మారుస్తున్నాయి.
ఇక్కడ అసలు సమస్య కేవలం మైనింగ్ టెక్నాలజీ లేకపోవడం మాత్రమే కాదు.. దాని వెనుక పేదరికం కూడా ఉంది. గోల్డ్ ధర పెరిగితే.. చిన్న గ్రామాల్లో కూడా గోల్డ్ కోసం మైనింగ్ చేయాలనే ఆసక్తి పెరుగుతుంది. ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో.. ఒకరోజు మైనింగ్ చేసి సంపాదించే డబ్బు, ఇతర పనుల్లో వచ్చే ఆదాయం కంటే ఎక్కువగా ఉండొచ్చు. దీంతో ప్రమాదం ఉందని తెలిసినా కార్మికులు గనుల్లోకి దిగుతారు. చేతిలో పెద్దగా పెట్టుబడి లేకపోయినా.. చిన్న టూల్స్‌తో గోల్డ్ కోసం తవ్వుకునే అవకాశం ఉండటం వల్ల చేతివృత్తి మైనింగ్ వేగంగా విస్తరిస్తుంది. కానీ గోల్డ్ దొరికితే వచ్చే లాభం వెనుక.. ప్రమాదం జరిగితే మొత్తం కుటుంబం ఆధారాన్ని కోల్పోయే పరిస్థితి ఉంటుంది.
ఇక గోల్డ్ నుంచి ప్రభుత్వాలకు, మైనింగ్ కంపెనీలకు భారీ ఆదాయం వస్తున్నా.. ఆ బంగారాన్ని వెలికితీసే కార్మికుల పరిస్థితి మాత్రం చాలా దయనీయంగానే ఉంటుంది. చాలా అనధికారిక గనులలో సరైన గ్లౌస్లు, హెల్మెట్స్, రక్షణ దుస్తులు, శ్వాసకోశ రక్షణ లేకుండానే కార్మికులు పనిచేస్తుంటారు. గనుల్లో పేరుకుపోయే డస్ట్, పేలవమైన వెంటిలేషన్, రసాయనాలతో కాంటాక్ట్ కారణంగా ఆరోగ్యపరమైన ప్రమాదాలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా చిన్న, అనధికారిక గనుల ప్రాంతాలలో వృత్తిపరమైన భద్రతపై అవగాహన, వైద్యపరమైన మద్దతు, అత్యవసర రెస్పాన్స్ వ్యవస్థలు బలహీనంగా ఉంటాయి. దీంతో ప్రమాదం జరిగినప్పుడు కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడమే పెద్ద సవాలుగా మారుతుంది. ఒకవేళ ఎవరైనా గాయపడితే.. సమీపంలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో వెంటనే చికిత్స అందడం కూడా కష్టమవుతుంది.
అంతేకాదు.. చట్టబద్ధత లేని గనుల్లోకి నేర ముఠాలు, స్థానిక మాఫియా చొరబడటంతో పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. గోల్డ్‌పై ఆధిపత్యం కోసం స్థానిక ముఠాల మధ్య ఘర్షణలు, కొన్ని ప్రాంతాల్లో గ్యాంగ్ వార్స్ కూడా జరుగుతున్నాయి. మరోవైపు పేదరికం, నిరుద్యోగం కారణంగా ఉపాధి అవకాశాలు లేక.. ప్రమాదాలు ఉన్నాయని తెలిసినా వేలాది మంది కార్మికులు ఈ గనుల్లోకి దిగుతున్నారు. బంగారం కోసం తవ్వే ఈ గనులే.. కొందరికి జీవనాధారంగా మారితే, మరికొందరికి ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదకర ప్రదేశాలుగా మారుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో తాజాగా జరిగిన ప్రమాదాలు మరోసారి ప్రభుత్వాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇల్లీగల్ మైనింగ్‌ను నియంత్రించడంతో పాటు.. ఇప్పటికే పనిచేస్తున్న చిన్న తరహా గనులలో కనీస భద్రతా ప్రమాణాలు అమలు చేయాలని నిపుణులు, కార్మిక సంఘాలు, హక్కుల సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. గనుల్లో పనిచేసే ప్రతి కార్మికుడికి రక్షణ పరికరాలు, సరైన వెంటిలేషన్, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్, గాలి ప్రసరణ, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, నిర్మాణపరమైన తనిఖీలు, రక్షణ వ్యవస్థలు అందుబాటులో ఉండాలని సూచిస్తున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం కంటే.. ముందుగానే ప్రమాదాలను గుర్తించి నివారించే నివారణాత్మక భద్రతా చర్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నాయి.
చివరికి.. ఈ ఘటన ఆఫ్రికా గోల్గ్ మైనింగ్‌లో భద్రతపై ఉన్న తీవ్రమైన లోపాలను మరోసారి బయటపెట్టింది. బంగారం కోసం తవ్వకాలు ఆగవు.. కానీ వాటి కోసం మనుషుల ప్రాణాలు పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఇప్పటికైనా అక్రమ మైనింగ్ పై కఠిన చర్యలు, చిన్న గనుల్లో కూడా తప్పనిసరి సేఫ్టీ రూల్స్, నిరంతర తనిఖీలు, అత్యవసర రక్షణ వ్యవస్థలు అమలు చేస్తేనే ఇలాంటి ప్రమాదాలకు అడ్డుకట్ట పడుతుంది. లేకపోతే.. నేల కింద దాగి ఉన్న బంగారం కోసం తవ్వే ప్రతి అడుగు.. మరో ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది.
Also Read : మరోసారి యుద్ధాన్ని మాపై రుద్ధితే… విధ్వంసం తప్పదు.. ఇరాన్ తీవ్ర హెచ్చరికలు









