
Congo Plane Crash : డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం 14 మంది చనిపోయారు. మృతుల్లో సైన్యానికి చెందిన ఇద్దరు అత్యున్నత స్థాయి అధికారులు కూడా ఉన్నారు. రాజధాని కిన్షాసాకు తిరిగి వస్తుండగా కేంగే ప్రాంతం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అధికారులు ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు.
కాంగో సైన్యం అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఎఫోమీ ఎకెంగే తెలిపిన వివరాల ప్రకారం.. ఈ విమానం నైరుతి కాంగోలోని కిక్విట్ నుంచి రాజధాని కిన్షాసాకు తిరిగి వస్తోంది. మార్గమధ్యంలో విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడటంతో కేంగే సమీపంలో కూలిపోయింది. విమానంలో ఉన్న వారంతా ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలంలో సహాయక చర్యలు, దర్యాప్తు పనులు ప్రారంభించారు. విమానం ఎందుకు కూలిపోయిందనే దానిపై అధికారులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు.
Also Read : ఉగ్రవాద దేశం నన్నే అడుగుతోంది .. పాక్ జర్నలిస్టుకు జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్!
ఈ ప్రమాదంలో లెఫ్టినెంట్ జనరల్ ముటోంబో కటాలాయి టియెండే, లెఫ్టినెంట్ జనరల్ బకుమి లికులియా కూడా మరణించారు. టియెండే కాంగో సైనిక కోర్టు అధిపతిగా పనిచేస్తున్నారు. లికులియా సాయుధ దళాల ఆడిటర్ జనరల్‌గా ఉన్నారు. ఈ విమానంలో ఉన్న ప్రతినిధి బృందానికి చెందిన 12 మంది, విమాన సిబ్బంది కూడా ప్రమాదంలో మరణించారు. మొత్తం 14 మంది చనిపోయినట్లు అధికారులు నిర్ధారించారు.
కాంగో సివిల్ ఏవియేషన్ అథారిటీ బోర్డు చైర్మన్ ట్రైఫోన్ కిన్-కి ములుంబా మాట్లాడుతూ.. ప్రమాదానికి కారణం వెంటనే గుర్తించలేకపోయామని చెప్పారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు దర్యాప్తు మొదలైందని కాంగో సైన్యం కూడా వెల్లడించింది. ప్రస్తుతం విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే దర్యాప్తు పూర్తయ్యే వరకు అసలు కారణం ఇదేనని చెప్పడం తొందరపాటు అవుతుందని అధికారులు తెలిపారు.
కాంగోలోని తూర్పు ప్రాంతంలో సైన్యం పలు తిరుగుబాటు గ్రూపులతో పోరాడుతున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. వీటిలో రువాండా మద్దతు ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న M23 కూడా ఉంది. ఇటీవలి నెలల్లో తిరుగుబాటు గ్రూపుల దాడులు పెరగడంతో పాటు, కొన్ని ముఖ్యమైన నగరాలు వారి ఆధీనంలోకి వెళ్లాయి. దీంతో తూర్పు కాంగోలో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఇలాంటి సమయంలో ఇద్దరు కీలక సైనిక అధికారులతో పాటు మరో 12 మంది ప్రాణాలు కోల్పోవడం కాంగో సైన్యానికి పెద్ద నష్టంగా మారింది.
Also Read : 10 ఏళ్ల తర్వాత అమెరికాలో షీ జిన్‌పింగ్.. రూల్స్ పక్కనపెట్టిన ట్రంప్.. టెక్ దిగ్గజాలతో గ్రాండ్ వెల్‌కమ్!









