
Balochistan Home Minister :పాకిస్థాన్ లోని ప్రావిన్స్ అయిన బలోచిస్థాన్‌లో ఆ రాష్ర్ట హోంమంత్రి మీర్ జియావుల్లా కాన్వాయ్‌పై ఈ రోజు దాడి జరిగింది. గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో మంత్రికి రక్షణగా ఉన్న ఇద్దరు భద్రతా సిబ్బంది మృతిచెందగా.. ఆరుగురు గాయపడ్డారు. కాగా ఈ దాడిలో హోం మంత్రి సురక్షితంగా బయటపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంత్రి మీర్ జియావుల్లా కలత్ ప్రాంతం నుంచి క్వెట్టాకు వెళ్తుండగా ఈ కాల్పులు జరిగాయి. మార్గమధ్యలో ఉన్న ఖడ్కోచా గోరు ప్రాంతంలో కొందరు సాయుధ దుండగులు ఆయన కాన్వాయ్ లక్ష్యంగా కాల్పులు జరిపారు. పాక్ స్వాతంత్ర్య దినోత్సవం రోజునే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఈ కాల్పుల్లో కాన్వాయ్‌లోని పలు వాహనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసులకు దుండగులకు మధ్య దాదాపు 20 నిమిషాల పాటు ఎదురుకాల్పులు కొనసాగినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఘటన అనంతరం దాడికి పాల్పడిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. వారిని పట్టుకోవడానికి భద్రతా దళాలు ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి.
కాగా, ఈ దాడులకు ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని స్థానిక పోలీసులు వివరించారు. నిందితుల కోసం గాలిస్తున్నామని.. వారు ఎవరైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడి వెనుక బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) హస్తం ఉండొచ్చని స్థానిక పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. బలోచిస్తాన్ లోని వేర్పాటు వాదులు ఇటీవల స్వాతంత్ర్యం ప్రకటించుకున్న విషయం తెలిసిందే. వారు కొంతకాలంగా తమకు స్వయంప్రతిపత్తి కల్పించాలని, తమ ప్రాంతంలోని సహజవనరులపై తమకే నియంత్రణ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. బలోచిస్థాన్ ప్రావిన్స్‌లోని వేర్పాటువాద గ్రూపు బీఎల్ఏ కొన్ని దశాబ్దాలుగా విముక్తి కోసం డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తరచూ సైనిక, పారామిలిటరీ, ఇతర ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగపడతోంది. బీఎల్ఏను పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.









