
PoK : పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా మారాయి. స్థానిక శాసనసభ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన ప్రజా సంఘాలు, నిరసనకారులపై పాకిస్థాన్ సైన్యం తీవ్రస్థాయిలో ఉక్కుపాదం మోపింది. రావల్‌కోట్ పరిధిలోని డ్రైక్ ప్రాంతంలో నిరసనకారులపై భద్రతా బలగాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. గత 24 గంటల వ్యవధిలోనే కనీసం 20 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
దాదాపు రెండు నెలలుగా పీఓకేలో ప్రజా ఆందోళనలు అట్టుడుకుతున్నాయి. ఈ క్రమంలో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) చేపట్టిన లాంగ్ మార్చ్‌కు ముందు భద్రతా బలగాలకు, ఆందోళనకారులకు మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నిరసనకారులను చెదరగొట్టడానికి పాక్ బలగాలు లాంగ్ రేంజ్ టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు గాల్లోకి కాల్పులు జరిపాయి. భయానక వాతావరణం నెలకొన్నప్పటికీ స్థానిక ప్రజలు వెనక్కి తగ్గకుండా నిరసనలను కొనసాగించారు.
ఎన్నికల బహిష్కరణ పిలుపునిచ్చిన జేఏఏసీని లక్ష్యంగా చేసుకుని పాక్ సైన్యం ఈ దాడులకు తెగబడింది. జేఏఏసీ కోర్ కమిటీ సభ్యుడు, అధికార ప్రతినిధి ఉమర్ నజీర్, ఆయన సోదరుడు ఉస్మాన్ నజీర్‌తో సహా 20 మందిని భద్రతా దళాలు హతమార్చినట్లు వర్గాలు తెలిపాయి. జూన్ 5న ఆందోళనలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన కశ్మీరీల సంఖ్య ఏకంగా 80కి చేరుకోవడం అక్కడి క్రూరత్వానికి అద్దం పడుతోంది.
Also Read : మూడేళ్ల వరకు హెచ్-1బీ వీసాలు బంద్.. ఆయిల్ పై 100% ట్యాక్స్.. భారత్ కు ట్రంప్ బిగ్ షాక్?
సైన్యం జరిపిన కాల్పుల తీవ్రతకు రావల్‌కోట్ వీధులు మృతదేహాలు, గాయపడిన వారితో నిండిపోయాయి. పీఓకేకి చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ అఖీల్ భాయ్ ఒక వీడియో సందేశంలో తమ పరిస్థితిని వివరిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. “మేము ప్రశాంతమైన ప్రజలం, మృతదేహాలను మోసి మోసి అలసిపోయాం. అంతర్జాతీయ సమాజం, మీడియా తక్షణమే స్పందించి మాకు మద్దతుగా నిలబడాలి” అని కన్నీటిపర్యంతమవుతూ వేడుకున్నాడు.
ఈ ప్రజా ఉద్యమాన్ని అణచివేసేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం రావల్‌కోట్, ముజఫరాబాద్ సహా పలు సున్నిత ప్రాంతాల్లో ఏకంగా 14 వేల మందికి పైగా సైనికులను, స్నైపర్లను మోహరించింది. నిరసనకారులను అడ్డుకునేందుకు అసలైన తూటాలు (లైవ్ అమునిషన్) వాడాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, బాహ్య ప్రపంచానికి సమాచారం అందకుండా ఇంటర్నెట్, మొబైల్ సేవలను నిలిపివేసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్, మంచినీటి సరఫరాను కూడా నిలిపివేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.
పీఓకే స్థానిక అసెంబ్లీలోని మొత్తం 53 స్థానాలకు గానూ 45 సీట్లకు ఆగస్టు 10 వరకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు పాక్ నిర్ణయించింది. మిగిలిన 8 స్థానాలకు ప్రతినిధులను నామినేట్ చేస్తారు. జులై 27న తొలి విడతగా మిర్పూర్ డివిజన్‌లోని 13 సీట్లకు పోలింగ్ ముగియగా, ముజఫరాబాద్‌లోని 9, శరణార్థుల 12 సీట్లకు ఆగస్టు 2న, పూంచ్ డివిజన్‌లోని 11 స్థానాలకు ఆగస్టు 10న పోలింగ్ జరగనుంది. అయితే స్థానిక అసెంబ్లీలో శరణార్థులకు కేటాయించిన 12 సీట్లను రద్దు చేయాలని జేఏఏసీ డిమాండ్ చేస్తోంది.
తొలి విడతగా జులై 27న జరిగిన 13 సీట్ల ఫలితాలను అక్కడి ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో నవాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) తొమ్మిది స్థానాల్లో విజయం సాధించగా, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) నాలుగు స్థానాలను గెలుచుకుంది. అయితే ఈ పోలింగ్ ప్రక్రియ అంతటా భద్రతా బలగాల అణచివేత, ఘర్షణలు కొనసాగాయి.
జేఏఏసీ చేపట్టిన ముజఫరాబాద్ లాంగ్ మార్చ్‌ను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రధాన రహదారులను మూసివేసి భారీగా బలగాలను మోహరించింది. రావల్‌కోట్, చాంద్‌నీ చౌక్, ఖస్సాయి గలి, బల్దియా అడ్డా ప్రాంతాల్లో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ముందుకు సాగేందుకు ప్రయత్నించగా, భద్రతా బలగాలు విచక్షణారహితంగా విరుచుకుపడ్డాయి. తమ నిరసనలను బలవంతంగా అణచివేస్తున్నారని ఆవామీ యాక్షన్ కమిటీ తీవ్రంగా మండిపడింది.
మరోవైపు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఈ హింసాకాండను సమర్థిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పీఓకేలో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్న ప్రజలంతా భారత్ వంటి శత్రువులతో సమానమని వ్యాఖ్యానించారు. నిరసనకారులతో ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తి లేదని, వారంతా పాకిస్థాన్ శత్రువులని స్థానిక టెలివిజన్ ఛానెల్ ద్వారా పేల్చారు.
పీఓకేలో జరుగుతున్న ఈ పరిణామాలపై భారత్ ఇప్పటికే తీవ్రస్థాయిలో స్పందించింది. అక్కడ జరుగుతున్న తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలను, దారుణాలను కప్పిపుచ్చుకోవడానికే పాకిస్థాన్ ఈ కపట ఎన్నికల నాటకాన్నిాడుతోందని దుయ్యబట్టింది. పాక్ అక్రమ ఆక్రమణలో ఉన్న ఆ ప్రాంతాలన్నీ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని, ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోవాలని భారత్ తేల్చిచెప్పింది.
Also Read : పశ్చిమాసియాలో ముదిరిన ఉద్రిక్తతలు… ఇరాన్, అమెరికా పరస్పర దాడులు









