
అమెరికాలో గత కొన్ని రోజులుగా వరుసగా తలెత్తుతున్న సాంకేతిక అంతరాయాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నాడు దిగ్గజ టెక్ కంపెనీ ఆపిల్ సేవలకు భారీ అంతరాయం కలిగింది. ఐక్లౌడ్, యాప్ స్టోర్, ఆపిల్ పే, ఆపిల్ మ్యూజిక్ వంటి కీలక సేవలు నిలిచిపోవడంతో వేలాది మంది వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమ ఖాతాల్లోకి లాగిన్ కాలేక, కొత్త డివైజ్‌లను యాక్టివేట్ చేసుకోలేక వినియోగదారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. అమెరికాతో పాటు బ్రెజిల్, గ్రీస్ వంటి దేశాల్లోనూ ఈ సమస్య కనిపించింది. అయితే ఇది సైబర్ దాడి కాదని, ఒక అంతర్గత సాఫ్ట్వేర్ అప్డేట్ వల్లే ఈ లోపం తలెత్తిందని ఆపిల్ స్పష్టం చేసింది.
Also Read : గొడ్డలితో రూ.560 కోట్ల మిలిటరీ విమానం ధ్వంసం
మరోవైపు అమెరికా జాతీయ భద్రతా సంస్థ అత్యంత రహస్య కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎన్ఎస్ఏ నెట్లో కూడా సాంకేతిక లోపం తలెత్తడం సంచలనంగా మారింది. సాధారణ నిర్వహణ పనుల సమయంలో ఈ అంతరాయం ఏర్పడినప్పటికీ దేశ భద్రతా కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగలేదని అధికారులు తెలిపారు. దీనికి తోడు ప్రముఖ మారియట్ హోటల్ వ్యవస్థలోనూ సాంకేతిక సమస్యలు రావడంతో కస్టమర్లు చెక్-ఇన్, రిజర్వేషన్ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతకుముందు రోజుల్లో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానాల ఆలస్యం, ప్రధాన బ్యాంకుల ఆన్లైన్ సేవల నిలిపివేత, మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో అంతరాయాలు అమెరికాను కుదిపేశాయి.
ఇదిలా ఉండగా సైబర్ సెక్యూరిటీ రంగంలో మరో ప్రమాదకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. జూమ్, హెచ్ఎస్బిసి, సీఎన్ఎన్, ఐకియా వంటి 178 దిగ్గజ కంపెనీల వెబ్సైట్లలో హానికరమైన జావాస్క్రిప్ట్ కోడ్ చొరబడినట్లు సైబర్ నిపుణులు గుర్తించారు. వినియోగదారుల క్రిప్టో కరెన్సీ వివరాలు, బ్యాంకింగ్ సమాచారం, వ్యక్తిగత డేటాను దొంగిలించేందుకే హ్యాకర్లు ఈ కోడ్‌ను ఉపయోగించినట్లు తేలింది.
వరుసగా జరుగుతున్న ఈ సాంకేతిక వైఫల్యాల వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా లేక సైబర్ దాడి జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇవన్నీ వేర్వేరు సాంకేతిక కారణాల వల్ల జరిగాయే తప్ప, వీటి మధ్య ఎలాంటి సంబంధం లేదని కంపెనీలు చెబుతున్నాయి. కానీ ఈ వివరణలతో సంతృప్తి చెందని అమెరికా ప్రజలు, ప్రతిపక్షాలతో పాటు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత మద్దతుదారులు కూడా వైట్ హౌస్‌ను నిలదీస్తున్నారు. వరుసగా ఇన్ని వ్యవస్థలు కుప్పకూలడం కేవలం యాదృచ్ఛికం కాదని, దీనిపై ప్రభుత్వం తక్షణమే ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని ట్రంప్ మాజీ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ సహా పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Also Read : డేటింగ్ కోసం వేల మంది బాయ్స్ రిక్వెస్ట్‌లు.. వరల్డ్ మోస్ట్ వాంటెడ్ గర్ల్‌ఫ్రెండ్ అరెస్టు.. ఎందుకో తెలుసా?









