
PoK : పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్) ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ మరోసారి భారత్కు వ్యతిరేకంగా కశ్మీర్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. కశ్మీర్ అనేది పాకిస్తాన్కు ‘జుగులర్ వీన్’ (అత్యంత ముఖ్యమైన జీవన నాడి) లాంటిదని ఆయన అభివర్ణించారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK/PoJK) లో అక్కడి ప్రజలు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యానాలు రావడం గమనార్హం.
రావల్పిండిలోని సైనిక ప్రధాన కార్యాలయం (GHQ) లో ఆసిమ్ మునీర్ అధ్యక్షతన జరిగిన 276వ కోర్ కమాండర్స్ కాన్ఫరెన్స్లో ఈ భారత్ వ్యతిరేక ప్రకటన వెలువడింది. జమ్మూ కశ్మీర్లో భారత్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని, అక్కడి జనాభా నిష్పత్తిని (డెమోగ్రాఫిక్ చేంజ్) మార్చేందుకు ప్రయత్నిస్తోందని పాక్ సైన్యం ఈ సమావేశంలో ఆరోపించింది.
పాక్ సైన్యానికి చెందిన మీడియా విభాగం ‘ISPR’ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. కశ్మీర్ అనేది పాకిస్తాన్కు ఎప్పటికీ అత్యంత కీలకమైన అంశంగానే ఉంటుందని పేర్కొంది. అయితే, పీవోకేలో ఉధృతంగా సాగుతున్న ప్రజా ఉద్యమాల నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించడానికే పాక్ సైన్యం ఈ పాత రాగాన్ని అందుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పీవోకేలో స్థానిక కమిటీ (జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ – JAAC) ముజఫరాబాద్ ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పాక్ ప్రభుత్వానికి గడువు విధించిన తరుణంలో ఈ సమావేశం జరిగింది.
ఈ కోర్ కమాండర్స్ కాన్ఫరెన్స్లో పాకిస్తాన్ సైన్యం దేశ భద్రతా స్థితిగతులు, సైనిక సన్నద్ధతపై సమీక్ష నిర్వహించింది. భారత్ మద్దతు ఉన్న ఉగ్రవాద శక్తులు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్ల ఆధీనంలో ఉన్న ప్రాంతాల నుండి పాకిస్తాన్లోకి చొరబడి దాడులు చేస్తున్నాయని ఐఎస్పీఆర్ (ISPR) ఆరోపించింది. వీటికి వ్యతిరేకంగా తాము ‘ఆపరేషన్ గజబ్-ఉల్-హక్’ (Operation Ghazab-il-Haq) పేరిట ఉగ్రవాద నిరోధక చర్యలను మరింత తీవ్రతరం చేస్తామని ప్రకటించింది.
దీనితో పాటు, భారత్ తమపై హైబ్రిడ్ వార్ఫేర్ (Hybrid Warfare) కు పాల్పడుతోందని, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని పాక్ సైన్యం ఆరోపించింది. అలాగే భారత్ ఇటీవల సింధు జలాల ఒప్పందాన్ని (Indus Water Treaty) తాత్కాలికంగా నిలిపివేయడంపై స్పందిస్తూ.. ఆ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్కు దక్కాల్సిన నీటి వాటాను సాధించుకోవడానికి తాము అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తమ పాత మొండి వైఖరిని పునరుద్ఘాటించింది. పీవోకేలో పెరుగుతున్న అంతర్గత తిరుగుబాటు, ఆర్థిక కష్టాల నుంచి దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకే పాక్ ఆర్మీ చీఫ్ ఈ కశ్మీర్ జపం చేస్తున్నారని అంతర్జాతీయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.









