H-1B Visa Renewals : అమెరికాలో రెండవసారి అధికారం చేపట్టిన ట్రంప్‌ సర్కార్‌ దేశంలో వలసలను నిరోదించడం కోసం అవసరమైన అన్ని రకాల కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఇప్పటికే పలు వీసాలు, ఉద్యోగాలపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్‌ మరోసారి వీసా ఫీజును తెరపైకి తెచ్చారు. హెచ్-1బీ వీసా రెన్యువల్‌పైనా అదనపు ఫీజులు వసూలు చేయాలనే మరో ప్రతిపాదనను సర్కార్‌ తెర మీదకు తెచ్చింది.ఈ ప్రతిపాదన ప్రకారం బడా కార్పొరేషన్ల హెచ్-1బీ, ఎల్-1 పిటిషన్ల రెన్యువల్స్‌పై అదనపు ఫీజు విధించేందుకు ట్రంప్‌ సర్కార్‌ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా 9-11 రెస్పాన్స్ అండ్ బయోమెట్రిక్ ఎంట్రీ-ఎగ్జిట్ ఫీజును వీసా రెన్యూవల్స్‌కు వర్తించేలా రూపొందించిన కొత్త నిబంధనలు తుది రూల్ మేకింగ్ దశకు చేరుకున్నట్టు అక్కడి జాతీయ మీడియా వెల్లడించింది. ఇది అమల్లోకి వస్తే ఆయా కంపెనీలకు హెచ్-1బీ వీసాదారులను కొనసాగించడం మరింత భారంగా మారుతుందని తెలుస్తోంది.

ఈ ప్రతిపాదన ప్రకారం సగానికి పైగా హెచ్-1బీ వీసాదారులు, ఎల్-1వీ వీసాదారులు ఉన్న అమెరికన్ కంపెనీలపై ఈ అదనపు ఫీజును విధించేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, కార్మిక శాఖ, విదేశాంగ శాఖ కసరత్తు ముమ్మరం చేశాయి.ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఇలాంటి బడా సంస్థలు కొత్త విదేశీ వర్కర్లను స్పాన్సర్ చేసే సమయంలో హెచ్-1బీ, ఎల్-1 పిటిషన్లపై అదనంగా 4 వేల డాలర్ల ఫీజును చెల్లిస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఇకపై విదేశీ ఉద్యోగిని కొనసాగించేందుకు చేసే రెన్యూవల్స్‌ విషయంలోనూ ట్రంప్ సర్కారు అదనపు ఫీజు విధించే అవకాశం ఉందని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

Also Read : ఇంగ్లిష్ ఛానెల్‌లో బోటుకు నిప్పు…స్పాట్‌ లో 157 మంది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

అమెరికా పౌరసత్వ, వలస సేవల శాఖ చెబుతున్న లెక్కల ప్రకారం, ప్రభుత్వం జారీ చేసే హెచ్-1బీ అనుమలలో అధిక శాతం రెన్యువల్స్‌కు సంబంధించినవేనని తెలుస్తోంది. దీనికి సంబంధించి 2025 సెప్టెంబర్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 4.06 లక్షల హెచ్-1బీ అప్లికేషన్లకు ఆమోదం తెలపగా వాటిల్లో 71 శాతం రెన్యూవల్స్‌కు సంబంధించినవే ఉన్నాయి. దీంతో ఈ ఫీజు కూడా అమల్లోకి వస్తే భారతీయులపై భారం పెరిగే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.

మీడియా కథనాల ప్రకారం.. ఈ వీసా పొడిగింపులు పొందిన వారిలో అత్యధికులు భారతీయులే కావడం గమనార్హం. 2025 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 2.26 లక్షల మంది భారతీయ పౌరులు హెచ్‌-1బీ వీసా పొడిగింపులు చేసుకున్నారు. ఇది మొత్తం పొడిగింపులలో 77.6 శాతం కావడం గమనార్హం. ఇక పొడిగింపుల జాబితాలో చైనా (31,581) రెండో స్థానంలో ఉండగా, ఆ తర్వాత ఫిలిప్పీన్స్, కెనడా, దక్షిణ కొరియా, మెక్సికో ఉన్నాయి. ఈ గణాంకాలు ప్రకారం ఫీజుల పెంపు భారతీయులపైనే ఎక్కువగా పడుతుందని తెలుస్తోంది.

నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (ఎన్ఎఫ్ఏపీ) నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలు హెచ్‌-1బీ వీసా పొడిగింపులపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ పొడిగింపులలో2025 ఆర్థిక సంవత్సరంలో, అత్యధికంగా అమెజాన్ (14,532), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (5,293), మైక్రోసాఫ్ట్ (4,863), మెటా ప్లాట్‌ఫామ్స్ (4,740), యాపిల్ (4,610), గూగుల్ (4,509) సంస్థలు పిటిషన్లకు ఆమోదం పొందిన వాటిలో ఉన్నాయి. ఈ కొత్త ఫీజుల విధానం అమలైతే, ఈ కంపెనీలపై మరింత ఆర్థిక భారం పెరగనుంది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం తుది దశలో ఉన్నప్పటికీ, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే తేదీని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.

Also Read : పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. ఆగస్టు 11న స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రకటించిన బలూచిస్థాన్!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.