
PoK : పాకిస్థాన్ ఆజాదీ కశ్మీర్ అని పిలుచుకునే పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇపుడు పాక్ పాలనపై తిరుగుటాటు బావుటా ఎగురవేస్తోంది. పేరులోనేమో ‘ఆజాద్’ (స్వేచ్ఛ) ఉంది.. కానీ అనుభవంలో మాత్రం దశాబ్దాల పరతంత్రం, దోపిడీ, అణచివేత మాత్రమే మిగిలాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) ఇప్పుడు నిజమైన స్వేచ్ఛ కోసం నినదిస్తోంది. “పాకిస్థాన్ పాలన మాకొద్దు” అంటూ అక్కడి ప్రజలు సగర్వంగా, ఏకతాటిపైకి వచ్చి తిరుగుబాటు జెండా ఎగురవేశారు. నిత్యం ధర్నాలు, రాస్తారోకోలు, సైన్యంతో ఘర్షణలతో పీవోకే ప్రాంతం ప్రస్తుతం అగ్నిగుండంగా మారింది.
దాదాపు ఏడున్నర దశాబ్దాలుగా పాకిస్థాన్ కఠిన నియంతృత్వ నీడలో నలిగిపోతున్న స్థానిక కశ్మీరీల సహనం ఈరోజు పూర్తిగా నశించింది. పీవోకేలోని ముజఫరాబాద్, రావాలాకోట్, మీర్పూర్ వంటి ప్రధాన నగరాల వీధులు నిరసనకారులతో పోటెత్తుతున్నాయి. కేవలం పురుషులే కాకుండా, వేలాది మంది మహిళలు, చిన్నారులు సైతం తెల్లజెండాలు చేతబూని పాక్ ఆర్మీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం అక్కడి తీవ్ర పరిస్థితికి అద్దం పడుతోంది.
ఈ అపూర్వ ప్రజా ఉద్యమానికి పునాది ఈనాటిది కాదు. పీవోకే ప్రజల జీవన హక్కులను హరిస్తూ, వారి కడుపు కొడుతూ పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై మూడేళ్ల క్రితమే శాంతియుతంగా నిరసనల బీజం పడింది. తమ సొంత వనరులను దోచుకుంటూ, తమకే కనీస సదుపాయాలు కల్పించని ఇస్లామాబాద్ పాలకుల వివక్షపై స్థానికుల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి, ఇప్పుడు ఒక్కసారిగా పెను లావాగా బద్దలైంది.
ముఖ్యంగా, పీవోకే ప్రాంతంలో ప్రవహించే జీలం నదిపై నిర్మించిన మంగ్లా డ్యామ్‌తో పాటు ఇతర జలవిద్యుత్ కేంద్రాల ద్వారా పాకిస్థాన్ ఏటా దాదాపు 3,500 మెగావాట్ల చౌక విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది. చిత్రం ఏమిటంటే, ఈ విద్యుత్ కేంద్రాల నిర్మాణ సమయంలో 1960ల నాడే లక్షలాది మంది స్థానిక కశ్మీరీలు ఎలాంటి నష్టపరిహారం లేకుండానే తమ ఇళ్లు, విలువైన వ్యవసాయ భూములను కోల్పోయి రోడ్డున పడ్డారు.
ప్రస్తుతం పాకిస్థాన్‌కు ఇక్కడ యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి కేవలం 1.5 నుండి 2.5 రూపాయల (పాకిస్థానీ కరెన్సీలో) ఖర్చు మాత్రమే అవుతోంది. కానీ, అదే విద్యుత్తును పీవోకే ప్రజలకు సరఫరా చేసేటప్పుడు మాత్రం పాక్ సర్కారు రకరకాల పన్నులు, సర్‌చార్జీలు అదనంగా జోడిస్తోంది. ఫలితంగా అక్కడి సామాన్యుడిపై యూనిట్‌కు ఏకంగా 35 నుండి 45 రూపాయల వరకు భారం పడుతోంది.
“మా గడ్డపై, మా త్యాగాలతో ఉత్పత్తి అవుతున్న కరెంటును మాకే ఇంత దారుణమైన ధరలకు అమ్ముతారా?” అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తీవ్ర నిరసనల నేపథ్యంలో వంద యూనిట్ల లోపు వాడేవారికి యూనిట్‌కు రూ.3 లకే ఇస్తామని పాక్ నాటకమాడింది. కానీ, ఆ తర్వాత దొడ్డిదోవన మళ్లీ పాత పన్నుల బాదుడును కొనసాగించడంతో ప్రజల సహనం పూర్తిగా గట్టు తెంచుకుంది.
విద్యుత్ సంక్షోభం ఒకవైపు ఉంటే, పీవోకే ప్రజల ప్రధాన ఆహారమైన గోధుమపిండికి గత మూడేళ్లుగా అక్కడ తీవ్ర కొరత ఏర్పడింది. పీవోకే భౌగోళికంగా కొండలు, గుట్టలతో కూడిన ప్రాంతం కావడం వల్ల అక్కడ సొంతంగా గోధుమలు పండించుకునే వీలు లేదు. 1970ల నుండి భూములు కోల్పోయిన ప్రజల కోపాన్ని చల్లార్చడానికి పాక్ ప్రభుత్వం రాయితీపై (సబ్సిడీ) గోధుమపిండిని సరఫరా చేస్తూ వచ్చింది.
Also Read : ఇరాన్‌తో డీల్ కుదరాల్సిందే.. లేదంటే మిషన్ పూర్తవుతుంది: డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
కానీ, ఇటీవలి కాలంలో పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక దివాలా స్థితికి చేరుకోవడం గమనార్హం. ఐఎంఎఫ్ (IMF) వంటి అంతర్జాతీయ సంస్థల నుండి బెయిల్ అవుట్ ప్యాకేజీలు, అప్పులు పొందడం కోసం పాక్ ప్రభుత్వం దేశంలో అన్ని రకాల సబ్సిడీలను రద్దు చేసింది. దీని ప్రభావం పీవోకేపై పడటంతో 40 కిలోల గోధుమపిండి బస్తా ధర ఏకంగా 3,200 రూపాయలకు చేరి సామాన్యుడికి అందనంత దూరమైంది.
ఆర్థిక దోపిడీతో పాటు రాజకీయంగా జరుగుతున్న అన్యాయం కూడా పీవోకే ప్రజల ఆగ్రహాన్ని రెట్టింపు చేసింది. పీవోకే అసెంబ్లీలో మొత్తం 53 సీట్లుండగా, అందులో 12 సీట్లను భారత కశ్మీర్ నుండి వలస వెళ్లిన శరణార్థుల పేరిట కేటాయించారు. అయితే, ఈ స్థానాలకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ పీవోకేలో కాకుండా పాకిస్థాన్ భూభాగంలోనే జరుగుతుంది. ఈ లొసుగును వాడుకుని పాక్ పాలకులు తమ తొత్తులను అక్కడ కూర్చోబెడుతున్నారు.
ఈ దొడ్డిదోవ రాజకీయ ప్రజాప్రతినిధుల విలాసాలకు, జీతభత్యాలకు మాత్రం పీవోకే ప్రజలు కట్టే పన్నుల సొమ్మునే వాడుతుండటం గమనార్హం. ఈ అన్యాయాలపై పోరాడేందుకు 2023 సెప్టెంబరులో వ్యాపారులు, న్యాయవాదులు, పౌరులు కలిసి ‘జమ్ముకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC)’గా ఏర్పడ్డారు. విద్యుత్, గోధుమపిండి ధరల తగ్గింపు, 12 శరణార్థుల సీట్ల రద్దు వంటి 38 డిమాండ్లతో వీరు ఉద్యమాన్ని ఉధృతం చేశారు.
అయితే, సీట్ల రద్దు అంశంపై పీవోకే సుప్రీంకోర్టు కూడా చేతులెత్తేస్తూ జూన్ మొదటివారంలో తీర్పునివ్వడంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. స్థానిక పోలీసులు నిరసనలను అదుపు చేయలేకపోవడంతో, పాక్ ప్రభుత్వం ‘పాకిస్థాన్ రేంజర్స్’ అనే అపార సైనిక బలగాలను రంగంలోకి దించింది. నిరసనకారులపై విచక్షణారహితంగా లాఠీచార్జీలు, కాల్పులు జరపడంతో ఇప్పటివరకు 25 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
ఉద్యమాన్ని అణచివేయడానికి జేఏఏసీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన పాక్ సర్కారు, జూన్ 30న ఆ కమిటీ ప్రధాన నేత షౌకత్ నవాజ్ మీర్‌తో పాటు 600 మందికి పైగా ఉద్యమకారులను జైల్లో పెట్టింది. దీనికి ప్రతిచర్యగా జేఏఏసీ బలిష్టమైన అల్టిమేటమ్ జారీ చేసింది. బంధించిన నేతలందరినీ విడుదల చేసి, తమ 38 డిమాండ్లను తక్షణమే నెరవేర్చకపోతే జూలై 9న అంతిమ, అత్యంత నిర్ణయాత్మక చర్యకు దిగుతామని హెచ్చరించింది.
ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో, గత మూడు వారాలుగా పాక్ సైన్యం పీవోకే ప్రాంతానికి కనీస ఆహార ధాన్యాలు, అత్యవసర ఔషధాల సరఫరాను పూర్తిగా నిలిపివేసి మానవతా సంక్షోభాన్ని సృష్టించింది. దీంతో విసిగిపోయిన పీవోకే ప్రజలు ఇప్పుడు తమ పొరుగునే ఉన్న భారతదేశం వైపు ఆశగా చూస్తున్నారు. తమను ఆదుకోవాలంటూ భారత ప్రభుత్వానికి బహిరంగంగానే విజ్ఞప్తులు పంపుతున్నారు.
ఇటీవల రావాలాకోట్లోని ఈద్గా మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో జేఏఏసీ నేత సర్దార్ అమన్ ఖాన్ మాట్లాడుతూ.. పీవోకే పాకిస్థాన్‌లో భాగం కాదని, తమకు భారత్ సాయం కావాలని పిలుపునిచ్చారు. “మనం ఇప్పుడే లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) దాటి భారత్ వైపు మార్చ్ చేద్దామా?” అని ఆయన ప్రశ్నించగా, వేలాది మంది ప్రజలు ఏకగ్రీవంగా ‘అటే వెళ్దాం’ అంటూ మద్దతు తెలపడం పాక్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. జూలై 9న జరగబోయే ఈ ‘నిర్ణయాత్మక పోరు’ పీవోకే భవిష్యత్తును ఏ తీరాలకు చేరుస్తుందో చూడాలి.
Also Read : ఆర్థిక పురోగతిలో సంచలనం… సుసంపన్న రాష్ట్రంగా తెలంగాణ









