
Unemployed youth : హైదరాబాద్‌లోని ప్రముఖ చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వేదికగా నిరుద్యోగ యువత చేపట్టిన మెరుపు ధర్నాతో నగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది అభ్యర్థులు, విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు లైబ్రరీ ప్రధాన గేట్లకు తాళాలు వేసి విద్యార్థులను లోపలే నిర్బంధించేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆగ్రహించిన నిరుద్యోగులు గేట్లను బద్దలు కొట్టుకుని బయటకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.
చిక్కడపల్లి లైబ్రరీ వద్ద నిరుద్యోగుల మెరుపు ధర్నా..
ఎన్నికల హామీలను నెరవేర్చాలంటూ ప్రభుత్వంపై నిరుద్యోగుల ఆగ్రహం
2 లక్షల ఉద్యోగాల భర్తీ, మెగా డీఎస్సీ, కానిస్టేబుల్ వయోపరిమితి పెంపుపై డిమాండ్
గ్రూప్స్, JLM, ఇంజనీరింగ్ పోస్టుల నోటిఫికేషన్లు తక్షణమే విడుదల చేయాలని నిరసన… pic.twitter.com/8F7kID6jEL
— RTV (@RTVnewsnetwork) July 26, 2026
ఈ నిరసనలో నిరుద్యోగ జేఏసీ (JAC) నాయకులు ప్రధానంగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ, మెగా డీఎస్సీ ప్రకటన, కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు వంటి కీలక డిమాండ్లను లేవనెత్తారు. వీటితో పాటు నిలిచిపోయిన గ్రూప్స్, జూనియర్ లైన్‌మన్ (JLM), విభిన్న ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి తక్షణమే కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయాలని స్పష్టం చేశారు. ఉద్యోగ ప్రకటనలపై స్పష్టమైన క్యాలెండర్ ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదని నిరుద్యోగులు తేల్చిచెప్పారు.
ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో పోలీసులు రంగంలోకి దిగి శాంతియుతంగా ధర్నా చేస్తున్న అభ్యర్థులను చెదరగొట్టేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, నిరుద్యోగులకు మధ్య తీవ్ర నెట్టివేత జరిగి రణరంగంలా మారింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేసి, పలువురు నిరుద్యోగ జేఏసీ నాయకులను, విద్యార్థులను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. శాంతియుత నిరసనలపై లాఠీఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన జేఏసీ నాయకులు, “తెలంగాణలో నిరుద్యోగులపై జరుగుతున్న ఈ దమనకాండపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి” అని ఘాటుగా డిమాండ్ చేశారు.
మరోవైపు, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ నెరవేరిన సందర్భాన్ని పురస్కరించుకుని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు నెక్లెస్ రోడ్‌లో విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలోనే ఈ ఊహించని ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఒక వైపు ప్రభుత్వం సంబరాల్లో మునిగి తేలుతుంటే, మరోవైపు నగరంలో వేలాది మంది నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి బారికేడ్లను తోసిరాజని ఆందోళనలకు దిగడం రాజధానిలో తీవ్ర కలకలం రేపింది.









