
Tummidihatti Barrage : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో ముంబైలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తుమ్మిడిహట్టి బ్యారేజీపై కీలకంగా చర్చించారు. బ్యారేజీ ఎత్తును 148 మీటర్ల నుంచి 152 మీటర్లకు పెంచడం, నీటి లభ్యత, ముంపు ప్రాంతాలు, ప్రభావిత భూములు, రైతులకు పరిహారం వంటి అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తును 152 మీటర్లకు పెంచితే ఆదిలాబాద్ ప్రాంతానికి సాగునీటి అవసరాలు మెరుగ్గా తీరుతాయని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. విద్యుత్ ఖర్చులు, పర్యావరణ సమస్యలు, వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని నీటిని గ్రావిటీ ద్వారా తరలించేందుకు ఈ ఎత్తు ఉపయోగపడుతుందని వివరించింది.
Also Read : తెలుగు రాష్ట్రాలకు అర్నబ్ తుఫాను హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బ్యారేజీ నిర్మాణం వల్ల మహారాష్ట్రలోని వ్యవసాయ భూములు ముంపునకు గురైతే, అక్కడి నిబంధనల ప్రకారం రైతులకు పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రతిపాదనపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు. మహారాష్ట్రకు, అక్కడి ప్రజలకు నష్టం లేకపోతే తెలంగాణ నీటి అవసరాలను తీర్చేందుకు సహకరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అయితే తుది నిర్ణయానికి ముందు సాంకేతిక, పర్యావరణ, ప్రభుత్వ పరమైన అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
బ్యారేజీ ఎత్తు, నీటి లభ్యత, ముంపు, భూములు, పరిహారం వంటి అంశాలను పరిశీలించేందుకు ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఉన్నతాధికారులతో సంయుక్త కమిటీ ఏర్పాటు చేయాలని ఫడ్నవీస్ ప్రతిపాదించారు. అధికారులు, నిపుణులు కలిసి తదుపరి చర్యలకు టైమ్‌లైన్, రోడ్‌మ్యాప్ సిద్ధం చేయనున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజీపై ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు, సాంకేతిక పరిశీలనలు కొనసాగనున్నాయి.
ఇదిలా ఉండగా, డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు సీఎం రేవంత్ రెడ్డి ఫడ్నవీస్‌ను ఆహ్వానించారు. ఈ ఆహ్వానంపై ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించి, కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.









