
RTV Exclusive: మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అకస్మాత్తుగా కన్నుమూయడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన చనిపోవడానికి ముందు అసలేం జరిగింది, జూలై 22 నుండి ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జూలై 22న ఉదయం 6 గంటలకు లేచిన పెద్ది.. ఆరోగ్యం సహకరించకపోవడంతో హన్మకొండ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరి వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన ఆఖరిసారిగా ‘RTV’కి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ సమయంలో ఆయన తీవ్ర నీరసంగా కనిపించడంతో ప్రతినిధి ఆయనను కూర్చోబెట్టి ముఖాముఖి నిర్వహించారు. అదే ఆయన మీడియాకు ఇచ్చిన చివరి మాటలుగా మిగిలిపోయాయి.
RTV ఇంటర్వ్యూ ముగిసిన అనంతరం భోజనం చేసి, హెల్త్ చెకప్ కోసం సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. రక్తం మందంగా ఉందని, అది పలచబడటానికి మందులు రాసిచ్చి విశ్రాంతి తీసుకోమని సూచించారు. అయితే, ఆయన ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా తీవ్ర అలసటతోనే తిరిగి హన్మకొండకు బయలుదేరి వెళ్లారు. జూలై 22న హైదరాబాద్ నుంచి వెళ్లినప్పటి నుంచి ఆయన ఎవరినీ కలవకుండా ఇంట్లోనే ఉన్నారు.
Also Read : ఒరిగిన ఓరుగల్లు ఉద్యమ శిఖరం “పెద్ది”
ఇక జులై 26న ఉదయం 6 గంటలకు అలసటగానే నిద్రలేచిన సుదర్శన్ రెడ్డి, కొద్దిసేపు వాకింగ్ చేసి స్నానానికి వెళ్లారు. ఆ తర్వాత బయటకు వచ్చి కుర్చీలో కూర్చుని శ్వాస ఆడటం లేదని, వెంటనే ఫ్యాన్, లైట్ ఆన్ చేయాలని తన పీఏకు చెప్పారు. అలా చెప్తున్న కాసేపటికే ఊపిరి తీసుకోలేకపోతున్నానంటూ కన్నీరు పెట్టుకుని అక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను కారులో హన్మకొండలోని రోహిణి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్లే వరకు ఆయన స్పృహలోనే ఉండటం గమనార్హం.
రోహిణి ఆసుపత్రిలోని బెడ్‌పై పడుకున్న తర్వాత కూడా “నాకు ఊపిరాడట్లేదు… వెంటనే ఆక్సిజన్ మాస్క్ పెట్టండి” అని డాక్టర్లతో పెద్ది చివరిగా మాట్లాడారు. ఆ మాటలు చెప్తూనే ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. తీవ్రస్థాయికి చేరిన ఆయన పరిస్థితిని చక్కదిద్దేందుకు రోహిణి ఆస్పత్రి డాక్టర్ మమతారెడ్డి ఏకంగా 9 సార్లు సిపిఆర్ (CPR) చేశారు. అయినప్పటికీ పరిస్థితి మరింత విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను వెంటనే హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాన్మరణానికి గురికావడం వెనుక పాత గాయాలు, వ్యాధి లక్షణాలే కారణమని వైద్య వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన కాలికి తీవ్ర గాయమైంది. ఆ గాయం వల్ల నరాల్లో రక్తం గడ్డకట్టే ‘డీప్ వెయిన్ థ్రాంబోసిస్’ (DVT) ఏర్పడి, అది ఊపిరితిత్తులకు చేరి పల్మనరీ ఎంబాలిజానికి దారితీసిందని, తద్వారా గుండెపై తీవ్ర ఒత్తిడి పడి ప్రాణాంతకంగా మారిందని నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు గత నెల రోజులుగా ఆయన తన ఆరోగ్య సమస్యలను పెద్దగా పట్టించుకోలేదనే ప్రచారం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు వంటి ప్రాథమిక సంకేతాలు కనిపించినప్పటికీ, ఆయన వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల పరిస్థితి చేజారిపోయి ప్రాణాపాయానికి దారితీసిందని తెలుస్తోంది.
Also Read : రేషన్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. రేపే లాస్డ్ డేట్.. ఇలా చేయకపోతే మీ కార్డ్ ఔట్!









