Telangana :  కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేలు వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్ ఫైట్ మరో కొత్త మలుపు తీసుకుంది. గత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉంటున్న ప్రముఖ కళాకారుడు ఏపూరి సోమన్న నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో భేటీ కావడం ఉమ్మడి నల్లగొండ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. సామేలుకు చెక్ పెట్టడం కోసమే వ్యూహాత్మకంగా కోమటిరెడ్డి బ్రదర్స్ సోమన్నను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. తద్వారా వచ్చే ఎన్నికల్లో తమ అండ ఏపూరికే ఉంటుందని వారు హింట్ ఇచ్చారన్న చర్చ జోరుగా సాగుతోంది. కాబోయే తుంగతుర్తి ఎమ్మెల్యే సోమన్న అంటూ ఆయన సన్నిహితులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి కోమటిరెడ్డి ఇచ్చిన హామీనే కారణం అన్న టాక్ వినిపిస్తోంది.

అవకాశం కోసం వేచి చూస్తున్న సోమన్న..

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తనకు తుంగతుర్తి ఎమ్మెల్యే అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని సోమన్న చాలా రోజుల నుంచి చెబుతున్నారు. 2014 తర్వాత కాంగ్రెస్ కు కాంగ్రెస్ లో ఉంటే తనకు ఆ ఛాన్స్ రాదని షర్మిల వైఎస్సార్టీపీ పార్టీలోనూ చేరారు. 2023 ఎన్నికల్లో తమ పార్టీ తుంగతుర్తి అభ్యర్థి సోమన్న అని షర్మిల కూడా ప్రకటించారు. దీంతో నియోజవర్గంలో విస్తృతంగా పర్యటించి పోటీకి ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో సోమన్న ఆశలు గల్లంతయ్యాయి. దీంతో బీఆర్ఎస్ లోకి ఆ తర్వాత తన పాత పార్టీ కాంగ్రెస్ లోకి చేరిపోయారు. చేరిన నాటి నుంచి తనకు ఏదైనా నామినేటెడ్ పోస్టు దక్కుతుందన్న ఆశతో సోమన్న ఉన్నారు. అయితే ఇంత వరకు ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. దీంతో గత కొన్నాళ్లుగా సైలెంట్ అయిపోయారు. ఇటీవల మందుల సామేలు, కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య తీవ్ర విభేదాలు రావడంతో వెంటనే సోమన్న యాక్టీవ్ అయ్యారు. గతంలో తనను పార్టీలోకి ఆహ్వానించిన రాజగోపాల్ రెడ్డిని వెళ్లి కలిశారు. తనకు తుంగతుర్తి టికెట్ విషయంపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సోమన్న నియోజకవర్గ పర్యటనను స్టార్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కోమటిరెడ్డి వ్యూహం ఇదే..

గతంలో అద్దంకి దయాకర్ రెండు సార్లు తుంగతుర్తి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ రెండు సార్లు కోమటిరెడ్డి బ్రదర్స్ ఆయనకు అన్ని విధాలుగా సహకరించారు. అయితే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన సమయంలో ఆయన సోదరుడు వెంకట్ రెడ్డిపై దయాకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ఆ కోపంతోనే కోమటిరెడ్డి బ్రదర్స్ దయాకర్ కు టికెట్ రాకుండా చేశారన్న చర్చ ఉంది. ఇటీవల రాజగోపాల్ రెడ్డి కూడా ఈ విషయాన్ని బహిరంగంగానే అంగీకరించారు. తానే సామేలుకు టికెట్ ఇప్పించానని చెప్పారు. ఇప్పుడు తమపై బహిరంగంగా విమర్శలు చేసిన సామేలుకు చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా సామేలును తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. దయాకర్ కు టికెట్ వద్దు అని చెప్పేందుకు.. మాల, మాదిగ ఈక్వేషన్ ప్రధానంగా తెరపైకి వచ్చింది. నియోజకవర్గంలో మాదిగల ఓట్లు అధికంగా ఉన్నాయని ఈ నేపథ్యంలో ఆ వర్గానికి చెందిన వారికే టికెట్ ఇవ్వాలని కోమటిరెడ్డి బ్రదర్స్ లాంటి జిల్లా టాప్ లీడర్లు వాదించారు.

2014, 18లో మాల అయిన దయాకర్ కు టికెట్ ఇవ్వడం కారణంగా నష్టపోయామని హైకమాండ్ ను కన్విన్స్ చేశారు. దయాకర్ లాగానే సామేలు కూడా తెలంగాణ ఉద్యమకారుడేనని, ఇంకా మాదిగ కావడం అదనపు అడ్వాంటేజ్ అంటూ వివరించారు. దీంతో సామేలుకు టికెట్ దక్కింది. ఇప్పుడు కూడా ఇలాంటి వ్యూహంతోనే సామేలుకు చెక్ పెట్టాలన్నది కోమటిరెడ్డి బ్రదర్స్ ఆలోచనగా తెలుస్తోంది. సామేలుపై ప్రజలతో పాటు సొంత కార్యకర్తల్లోనే అసంతృప్తి ఉందని.. ఈ నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన సోమన్నకు టికెట్ ఇవ్వాలని వారు హైకమాండ్ ముందు ప్రతిపాదన పెట్టనున్నట్లు చర్చ జరగుతోంది. ప్రజా కళాకారుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా అందరికీ సుపరిచితుడైన సోమన్నకు టికెట్ ఇస్తే కలిసి వస్తుందని వివరించనున్నట్లు తెలుస్తోంది. ఎంపీ చామల కిరణ్‌ కుమార్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తమ ప్రతిపాదనకే ఓకే చెబుతారని కోమటిరెడ్డి బ్రదర్స్ ధీమాగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యూహం ఫలిస్తుందా? సీఎం రేవంత్ రెడ్డి వీరికి సహకరిస్తాడా? ఈ వివాదాల నడుమ వచ్చే ఎన్నికల్లో తుంగతుర్తి కాంగ్రెస్ టికెట్ ఎవరు దక్కించుకుంటారు? అన్న అంశంపై జోరుగా చర్చ సాగుతోంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.