
Medical College Fees : రాష్ట్రంలో త్వరలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఫీజుల ఖరారు అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందే ఫీజుల వివరాలను స్పష్టంగా ప్రకటించాల్సి ఉండగా, ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవడం విద్యార్థులు, వారి తల్లిదండ్రులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఫీజుల నిర్ణయంలో జరుగుతున్న జాప్యం వారి మెడపై కత్తిలా వేలాడుతోంది.
గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆధారం చేసుకుని ‘ఏ’, ‘బీ’ క్యాటగిరీ సీట్లకు ఒకే విధమైన ఫీజు విధానాన్ని వర్తింపజేయాలని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. మొత్తం సీట్లలో ఎన్‌ఆర్‌ఐ (సీ క్యాటగిరీ) మినహా మిగిలిన 85 శాతం సీట్లకు సమాన ఫీజు వసూలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రైవేటు యాజమాన్యాలు ఇప్పటికే హైకోర్టును సైతం ఆశ్రయించాయి.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో 36, ప్రైవేటులో 30 కాలేజీలతో పాటు 3 డీమ్డ్ యూనివర్సిటీలు, 4 మైనారిటీ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. డీమ్డ్ మినహా మొత్తం 9,550 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, ఒక్క ప్రైవేటు కళాశాలల్లోనే 5,020 సీట్లు ఉన్నాయి. వీటిలో కన్వీనర్ (ఏ క్యాటగిరీ) కింద 2,510 సీట్లు, యాజమాన్య (బీ క్యాటగిరీ) కింద 1,757 సీట్లు, ఎన్‌ఆర్‌ఐ (సీ క్యాటగిరీ) కింద 753 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఏ-క్యాటగిరీ ఫీజు ఏడాదికి కేవలం రూ.60 వేలు కాగా, బీ-క్యాటగిరీకి రూ.11.25 లక్షల నుండి రూ.13 లక్షల వరకు, సీ-క్యాటగిరీకి రూ.22 లక్షల నుండి రూ.24 లక్షల వరకు వసూలు చేస్తున్నారు.
ప్రైవేటు కాలేజీల డిమాండ్ ప్రకారం కన్వీనర్ కోటాలోని 2,510 సీట్లకు కూడా బీ-క్యాటగిరీకి సమానంగా ఫీజులు పెంచితే, ఇప్పటివరకు కేవలం రూ.60 వేలు మాత్రమే చెల్లిస్తున్న సామాన్య, మెరిట్ విద్యార్థులు ఒక్కసారిగా రూ.11 లక్షలకు పైగా చెల్లించాల్సి వస్తుంది. వేలల్లో ఉన్న ఫీజు ఏకంగా లక్షల్లోకి చేరితే పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు వైద్య విద్యకు పూర్తిగా దూరం అయ్యే ప్రమాదం ముంచుకొస్తోంది.
Also Read : తెలంగాణ ఉద్యమంలో కన్ను పోగొట్టుకున్న నేత.. రాష్టం వచ్చిన తర్వాతే పెళ్లి.. పెద్ది పోరాట ప్రస్థానం ఇదే!
ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఫీజుల నియంత్రణకు ప్రతి మూడేళ్లకు ఒకసారి ఫీజుల నియంత్రణ కమిటీ (ఎఫ్‌ఆర్‌సీ) సమీక్ష నిర్వహిస్తుంది. 2023లో ఎఫ్‌ఆర్‌సీ నిర్ణయించిన ఫీజుల గడువు 2025-26 విద్యా సంవత్సరంతో ముగిసింది. ప్రస్తుత 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎఫ్‌ఆర్‌సీ కొత్తగా సమర్పించే నివేదిక ప్రాతిపదికన ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎఫ్‌ఆర్‌సీ ఎలాంటి మార్గదర్శకాలు ఇస్తుందనేది ఉత్కంఠగా మారింది.
ఇదే విధమైన ఫీజుల వివాదం పొరుగునున్న ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎదురవ్వగా, అక్కడ కన్వీనర్ కోటా సీట్లకు కేవలం 10 శాతం మేర మాత్రమే ఫీజు పెంపునకు వెసులుబాటు కల్పించి విద్యార్థుల ప్రయోజనాలను కాపాడారు. అయితే తెలంగాణలో మాత్రం ప్రైవేటు యాజమాన్యాలు పట్టుబడుతుండటంతో, ఒకవేళ కోర్టు తీర్పు కాలేజీలకు అనుకూలంగా వస్తే ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలనే దానిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
నిజానికి సుప్రీంకోర్టు తీర్పు దేశమంతటికీ వర్తించినప్పటికీ, వేరే ఏ రాష్ట్రంలోనూ ఏ, బీ క్యాటగిరీలకు ఒకే ఫీజు విధానాన్ని అమలు చేయడం లేదు. కేవలం తెలంగాణలోని ప్రైవేటు మెడికల్ కాలేజీలు మాత్రమే ఈ తరహా డిమాండ్‌ను తెరపైకి తెచ్చాయి. ఒకవేళ ప్రభుత్వం కాలేజీల ఒత్తిడికి లొంగి ఫీజులు పెంచితే విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల నుంచి తీవ్రస్థాయిలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు వ్యక్తమయ్యే అవకాశం ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఈ పరిణామాల మధ్య ప్రభుత్వం ఫీజుల భారీ పెంపునకు అసలు సుముఖంగా లేదని సచివాలయ వర్గాల సమాచారం. విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా, మెరిట్ విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా తగిన నిర్ణయం తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. కోర్టు వ్యవహారాలను సమర్థవంతంగా ఎదుర్కొంటూనే, సామాన్యులకు వైద్య విద్యను అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Also Read : రేషన్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. రేపే లాస్డ్ డేట్.. ఇలా చేయకపోతే మీ కార్డ్ ఔట్!









