
హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమాను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో చూశారు. పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కలిసి సామాన్య అభిమానుల మధ్య కూర్చొని ఆయన సినిమా చూశారు. సినిమా చూసిన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు.
అస్థిత్వం కోసం ఆరాటం, అణిచివేత పై పోరాటం.
సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి అనే సందేశాన్ని అందించిన తమ్ముడు శ్రీకాంత్ ఓదెల కి హృదయపూర్వక అభినందనలు
కథానాయకుడి పాత్రలో జీవించిన మిత్రుడు నానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. తమ్ముడు ప్రియదర్శి కి ప్రత్యేక అభినందనలు…
— KTR (@KTRBRS) September 26, 2026
‘ది ప్యారడైజ్’ చిత్రం తెలంగాణ నేల, స్థానిక యాస, సంస్కృతిని ఎంతో సహజంగా, అద్భుతంగా తెరపై ఆవిష్కరించిందని కేటీఆర్ కొనియాడారు. సమాజంలో అణచివేతకు గురైన ప్రజలు తమ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం ఎలా పోరాడతారో ఈ సినిమాలో చాలా ప్రభావవంతంగా చూపించారని పేర్కొన్నారు. అన్యాయం జరిగినా, అణచివేత పెరిగినా ప్రజల పక్షాన ఒక నాయకుడు నిలబడి వారిని ఎలా ముందుండి నడిపిస్తాడో చూపించారని తెలిపారు.
అణచివేతపై ప్రజలు చేసే తిరుగుబాటును, వారి ఆరాటాన్ని తెరపైకి తీసుకొచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. “సందర్భం వస్తే చిన్న గడ్డిపోచలు కూడా బలమైన గడ్డపారలుగా మారి పోరాడతాయి” అనే గొప్ప సందేశాన్ని ఈ చిత్రం ద్వారా శ్రీకాంత్ ఓదెల అందించారని కొనియాడారు. నా తమ్ముడు శ్రీకాంత్ ఓదెలకు నా హృదయపూర్వక అభినందనలు అని కేటీఆర్ తెలిపారు. కథానాయకుడి పాత్రలో నాని కేవలం నటించడమే కాకుండా ఆ పాత్రలో జీవించారని కేటీఆర్ మెచ్చుకున్నారు. అలాగే చిత్రంలో కీలక పాత్ర పోషించిన తమ్ముడు ప్రియదర్శికి ప్రత్యేక అభినందనలు అందజేశారు.
“చావు నోట్లో తలపెట్టయినా సరే.. మీకు సమాజంలో ఒక గుర్తింపు తెస్తాను!” అనే డైలాగ్ ఎవరిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, అది సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ పోరాట పటిమను ప్రతిబింబించిన ‘ది ప్యారడైజ్’ బృందానికి కేటీఆర్ తన పూర్తి మద్దతును, శుభాకాంక్షలను తెలియజేశారు.









