KCR : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) సోమవారం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, పార్టీ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డిని ఆయన స్వయంగా పరామర్శించారు. ఎర్రవెల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి ఆస్పత్రికి చేరుకున్న కేసీఆర్, అక్కడ వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను ఆరా తీశారు.

Also Read : హైడ్రా కమిషనర్‌ రంగానాథ్‌ ఔట్‌…. హైకోర్టు సంచలన ఆదేశాలు

రెండు రోజుల క్రితమే యశోద ఆస్పత్రిలో సాధారణ వైద్య పరీక్షలు చేయించుకున్న పెద్ది సుదర్శన్ రెడ్డికి ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో హనుమకొండలోని ఆయన నివాసంలో హఠాత్తుగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. ఆయన పరిస్థితిని గమనించిన భార్య స్వప్న, తక్షణమే స్పందించి సమీపంలోని రోహిణి ఆస్పత్రికి తరలించారు. అక్కడ కార్డియాలజిస్ట్ డాక్టర్ మమతారెడ్డి నేతృత్వంలోని వైద్యుల బృందం వేగంగా స్పందించి అత్యవసర సీపీఆర్ (CPR) అందించి ప్రాథమిక చికిత్స పూర్తి చేశారు.

రోహిణి ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, మెరుగైన, నిపుణుల వైద్యం కోసం సుదర్శన్ రెడ్డిని గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు ఐసీయూలో వెంటిలేటర్‌పై అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆదివారం నుంచే ఆయన ఆరోగ్య పరిస్థితిపై కేసీఆర్ నిరంతరం ఆరా తీస్తూ, వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

ఆస్పత్రికి చేరుకున్న కేసీఆర్, పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై వైద్యులతో ప్రత్యేకంగా సమీక్షించారు. ఆయనకు అందుతున్న వైద్య సేవలు, స్పందన గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐసీయూ వెలుపల ఉన్న సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారికి ధైర్యాన్ని అందించారు. అధైర్యపడవద్దని, పార్టీ, తాను అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Also Read : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి తీవ్ర ఆస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

కేసీఆర్ వెంట మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిలతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. నాయకులందరూ సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మరోవైపు నర్సంపేట నియోజకవర్గంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు, పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు ఆయన అనారోగ్య వార్త విని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా పూర్తి ఆరోగ్యంతో తిరిగిరావాలని ఆకాంక్షిస్తూ పలుచోట్ల ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.