HYDRAA :హైదరాబాద్ నగరంలో అక్రమ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా (HYDRAA) శనివారం మరో భారీ ఆపరేషన్ చేపట్టింది. మేడ్చల్ – మల్కాజగిరి జిల్లా బాలానగర్ మండలం హస్మత్‌పేటలో నిర్వహించిన ఈ మెగా డ్రైవ్‌లో ఏకంగా 10 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి విముక్తి చేసింది. బహిరంగ మార్కెట్‌లో ఈ భూమి విలువ సుమారు రూ. 750 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
హస్మత్‌పేటలోని సర్వే నంబరు 01 లో మొత్తం 108 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, అందులో ఇప్పటికే 98 ఎకరాలు భారీగా కబ్జాకు గురైంది. కబ్జాదారులు ఈ భూమిని వంద గజాల చొప్పున చిన్న చిన్న ప్లాట్లుగా చేసి ఇతరులకు తెగనమ్మడంతో, అక్కడ ఇప్పటికే చాలా మంది ఇళ్లు కట్టుకుని నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే, మానవీయ కోణంలో ఆలోచించిన హైడ్రా, ప్రస్తుతం నివాసాలు ఉంటున్న ఇళ్ల జోలికి వెళ్లకుండా కేవలం ఖాళీగా ఉన్న ఆక్రమిత భూములను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.
రెవెన్యూ అధికారుల నుంచి అందిన రాతపూర్వక లేఖ ఆధారంగా హైడ్రా ఈ రంగంలోకి దిగింది. శనివారం ఉదయం నుంచే రెవెన్యూ అధికారుల సమక్షంలో, భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు ప్రక్రియను ప్రారంభించింది. కబ్జాదారులు ఈ 10 ఎకరాల భూమి చుట్టూ ప్రీకాస్ట్ ఇటుకలతో తాత్కాలిక ప్రహరీ గోడలు (కాంపౌండ్ వాల్స్) నిర్మించడమే కాకుండా, కొన్ని చోట్ల చిన్న చిన్న గదులు, తాత్కాలిక షెడ్డులను కూడా వేశారు. అంతేకాకుండా, ఆ భూమి ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా చూసేందుకు తమ సొంత మనుషులను అక్కడ కాపలాగా కూడా ఉంచారు.
ఈ అక్రమ కట్టడాలన్నింటినీ హైడ్రా సిబ్బంది బుల్డోజర్ల సహాయంతో పూర్తిగా కూల్చివేశారు. భవిష్యత్తులో మళ్లీ ఎలాంటి కబ్జాలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు సదరు 10 ఎకరాల భూమి చుట్టూ పకడ్బందీగా ఫెన్సింగ్ (కంచె) వేశారు. అలాగే, ఆ ప్రాంతమంతా ప్రభుత్వ భూమి అని స్పష్టం చేస్తూ ప్రజలను హెచ్చరించేలా హైడ్రా ఆధ్వర్యంలో భారీ బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. ఈ భారీ ఆపరేషన్‌తో భూబకాసురుల కబ్జాలకు హైడ్రా గట్టి చెక్ పెట్టినట్లయింది.
MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.