
HYDRA : ఆర్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పలు కీలక విషయాలు వెల్లడించారు. దేశంలోనే హైడ్రా అత్యంత శక్తివంతమైన సంస్థ అని, ఇలాంటి వ్యవస్థ దేశంలోనే మొదటిసారిగా ఏర్పాటయ్యిందని, దీనికి తాను తొలి కమిషనర్‌గా ఉండటం గర్వంగా ఉందని ఆయన తెలిపారు. హైడ్రా వల్ల తమ ఇళ్లు కోల్పోయి నష్టపోయిన పేదలకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందిస్తుందని స్పష్టం చేశారు. అయితే సోషల్ మీడియాలో హైడ్రాపై కొందరు కావాలనే విషప్రచారం చేస్తూ నెగెటివ్‌గా ప్రచారం చేస్తున్నారని, ఎక్కడైనా మార్పు జరుగుతున్నప్పుడు వ్యతిరేకత రావడం సహజమేనని అన్నారు.
సున్నం చెరువు, కూకట్‌పల్లి నల్ల చెరువులను చాలా అద్భుతంగా తీర్చిదిద్దామని, హైడ్రా చర్యల వల్ల భూగర్భ జలాలు పెరిగి వంద అడుగుల లోతుకే నీరు దొరుకుతున్నాయని రంగనాథ్ తెలిపారు. హైడ్రాకు మూసీ నది ప్రక్షాళనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. హైడ్రా మొదటి సంవత్సరంలో రూ. 30 వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కాపాడిందని, రెండో సంవత్సరంలో రూ. 90 వేల కోట్ల ఆస్తులను రక్షించామని, ఈ ఏడాది ఏకంగా లక్షన్నర కోట్ల విలువైన ఆస్తులను కాపాడే అవకాశం ఉందని చెప్పారు. అక్రమంగా కట్టిన భవనాలను కూల్చివేయడానికి ప్రత్యేకంగా ముందస్తు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని జీహెచ్ఎంసీ చట్టమే చెబుతోందని, కొందరు కేవలం వేరే సర్వే నంబర్ చూపించి ఇళ్లు కడుతున్నారని తెలిపారు.
ఫాతిమా కాలేజీని ఎందుకు కూల్చడం లేదనే ప్రశ్నకు అది ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉందని సమాధానమిచ్చారు. రాజకీయాలకు అతీతంగా తాము పనిచేస్తున్నామని, ఇందులో భాగంగానే దాదాపు 20 మంది ఎంఐఎం నేతల బిల్డింగ్‌లను కూడా కూల్చివేశామని తెలిపారు. అక్బరుద్దీన్ ఒవైసీ విసిరిన సవాల్‌కు తాను ఎలాంటి స్పందన తెలియజేయబోనని అన్నారు. హైడ్రా కూల్చివేతల ద్వారా బాధితులను ఇబ్బంది పెట్టే పద్ధతిని మార్చుకున్నామని, హైడ్రా కాపాడిన స్థలాల్లోనే ప్రభుత్వం పేదలకు షెల్టర్లు కల్పిస్తోందని చెప్పారు. తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని, హైడ్రాలో ఎలాంటి రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు.
హైడ్రా కార్యాలయం ఎఫ్‌టీఎల్ పరిధిలో లేదని రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రా వల్ల నగరంలో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ భూమిని 2014లో చట్టబద్ధంగా కొనుగోలు చేశారని తెలిపారు. అయితే ఆ భూమిలో సుమారు 6 నుంచి 7 ఎకరాల వరకు ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వస్తుండగా, మిగతా 3 నుంచి 4 ఎకరాలు మాత్రమే ఎఫ్‌టీఎల్ వెలుపల ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఆ భూమిలో ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని, చెరువు స్వరూపాన్ని మార్చడం గానీ, నీటి ప్రవాహానికి అడ్డంకులు సృష్టించడం గానీ చేయలేదని రంగనాథ్ స్పష్టం చేశారు. కాకపోతే, తాను కొనుగోలు చేసిన ఆ భూమి చుట్టూ చెరువు పరిధిలో ఫెన్సింగ్ వేయడం మాత్రం నిబంధనల ప్రకారం తప్పని ఆయన తెలిపారు. ఎంతటి వారైనా చెరువులను కబ్జా చేస్తే హైడ్రా అసలు వదిలిపెట్టదని హెచ్చరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో తమకు చెరువుల కబ్జాలకు సంబంధించి ఏకంగా 30 వేల ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన వెల్లడించారు.









