Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి ముంచెత్తుతున్న వరద నీటితో కృష్ణ, గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రధాన జలాశయాలు జలకళను సంతరించుకుంటున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు. వర్ష తీవ్రత దృష్ట్యా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖాధికారి (DEO) తక్షణ సెలవు ప్రకటించారు. అలాగే జగిత్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో ఈరోజు విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది.విద్యార్థుల చదువు దెబ్బతినకుండా ఈ రోజు ప్రకటించిన సెలవును భర్తీ చేయడానికి రాబోయే రెండో శనివారాన్ని పాఠశాలలకు పని దినంగా నిర్వహిస్తామని విద్యాశాఖ వెల్లడించింది.

Also Read : 2034 వరకు సీఎంగా ఉంటా.. ఏం కావాల్నో చెప్పండి : సీఎం రేవంత్ రెడ్డి

కృష్ణానది పరివాహక ప్రాంతంలో కర్ణాటకలోని ఎగువ ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయడంతో జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్‌ నిండుకుండలా మారింది. జూరాలకు ఎగువ నుంచి దాదాపు 27,000 నుంచి 29,768 క్యూసెక్కుల మేర వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. జూరాల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 8.989 టీఎంసీలకు చేరుకుంది. దీంతో అధికారులు 10 గేట్లను ఎత్తి దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. నిరంతరాయంగా వస్తున్న వరదను వినియోగించుకుంటూ నెట్టెంపాడు (750 క్యూసెక్కులు), భీమా (650 క్యూసెక్కులు), కోయిలసాగర్ (315 క్యూసెక్కులు) ఎత్తిపోతల పథకాలు, కాలువల ద్వారా నీటిని తోడుతున్నారు.

ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణతో పాటు ఆయకట్టు రైతులకు సాగునీరు అందించేందుకు ప్రాధాన్యత ఇస్తోందని అధికారులు పేర్కొన్నారు. ప్రవాహాల ఆధారంగా స్పిల్‌వే ద్వారా దిగువకు ప్రవాహాలను క్రమబద్ధీకరిస్తూ, విద్యుత్ ఉత్పత్తి,కాలువల తాగు, సాగునీటి అవసరాలకు అనుగుణంగా ఔట్‌ఫ్లోను నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

గోదావరి పరివాహక ప్రాంతంలో నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులకు కూడా స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీరాంసాగర్ (ఎస్సారెస్పీ) ప్రాజెక్టుకు ప్రస్తుతం 6,250 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1065 అడుగుల వద్ద ఉంది; అలాగే పూర్తి నీటి సామర్థ్యం 80 టీఎంసీలకు గాను ప్రస్తుతం 16 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కామారెడ్డి-నిజామాబాద్ సరిహద్దుల్లోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు 4,000 క్యూసెక్కుల వరద వస్తోంది. నిజాంసాగర్ పూర్తి నీటిమట్టం 1405 అడుగులు (ప్రస్తుతం 1396 అడుగులు) కాగా, 17 టీఎంసీల సామర్థ్యానికి గాను 7 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది.

ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి ఎగువ జూరాల, ఇతర ప్రాంతాల నుంచి వరద నీటి తాకిడి పెరుగుతోంది. శ్రీశైలం ప్రాజెక్ట్‌కు ప్రస్తుతం 79,403 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదవుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 824.80 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నిల్వ 44.6 టీఎంసీలుగా ఉంది. నీటిమట్టం ఇంకా పెరుగుతున్న దృష్ట్యా కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని ఇంకా ప్రారంభించలేదని అధికారులు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాలకు క్రమంగా వరద నీరు పెరుగుతుండటంతో రైతాంగంలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో వర్షాలు ఇలాగే కొనసాగితే నీటి ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో నిండి, ఈ ఏడాది సాగునీరు, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. ప్రాజెక్టుల వద్ద పరిస్థితిని జలవనరుల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

Also Read : రేషన్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. రేపే లాస్డ్ డేట్.. ఇలా చేయకపోతే మీ కార్డ్ ఔట్!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.