
Danam Nagendar : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేసిన నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని, ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ప్రజాక్షేత్రంలో, ఎన్నికల్లోనే పోరాడతానని తెలిపారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా. సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదు. ఉప ఎన్నికలు వస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నా. యుద్ధం నాకేం కొత్త కాదు. మళ్లీ పోరాడతా.. మళ్లీ గెలుస్తా అని దానం నాగేందర్ అన్నారు.
అంతకుముందు దానం నాగేందర్ తరఫు న్యాయవాదులు హైకోర్టు తీర్పును కొంతకాలం నిలిపివేయాలని, సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే హైకోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయినట్లుగా ప్రకటిస్తూ.. ఈ విషయాన్ని అసెంబ్లీ స్పీకర్, ఎన్నికల సంఘానికి తెలియజేయాలని కోర్టు ఆదేశించింది. పార్టీ ఫిరాయింపుల కేసులో ఈ తీర్పు వెలువడింది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని పార్టీ ఫిరాయింపుగా పేర్కొంటూ ఆయనపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ పిటిషన్లపై స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం తెలంగాణ హైకోర్టు స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టి దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసింది. 2024 ఏప్రిల్ 23 నుంచి ఆయన అనర్హుడిగా ఉంటారని తీర్పులో పేర్కొంది. హైకోర్టు తీర్పుతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా మారింది. దీంతో అక్కడ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఏర్పడింది.









