
శ్రీలంక క్రికెట్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 2027లో తొలిసారిగా జరగనున్న ఐసీసీ మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని శ్రీలంక కోల్పోయింది. ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు జరగాల్సిన ఈ ఆరు జట్ల టోర్నీ ఇక శ్రీలంకలో జరగదు. ఈ టోర్నీని ఎక్కడ నిర్వహించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఐసీసీ బోర్డు తదుపరి సమావేశంలో కొత్త వేదికను ఖరారు చేసే అవకాశం ఉంది.
శ్రీలంక క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందన్న వివాదం కొనసాగుతున్న సమయంలోనే ఈ నిర్ణయం వచ్చింది. ప్రస్తుతం శ్రీలంక క్రికెట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫర్మేషన్ కమిటీ నడుపుతోంది. అయితే క్రికెట్ బోర్డులు ప్రభుత్వ జోక్యం లేకుండా స్వతంత్రంగా పనిచేయాలన్నది ఐసీసీ నిబంధన. దీంతో శ్రీలంక క్రికెట్ బోర్డు, ఐసీసీ మధ్య కొంతకాలంగా సమస్య కొనసాగుతోంది.
శ్రీలంక క్రికెట్ ట్రాన్స్ఫర్మేషన్ కమిటీ కార్యదర్శి ప్రకాశ్ షాఫ్టర్ ఈ విషయాన్ని సండే టైమ్స్‌కు వెల్లడించారు. అవును.. టోర్నీని శ్రీలంక నుంచి మార్చేశారు. మరో చోట నిర్వహిస్తారు. అయితే ప్రస్తుతం ఎక్కడ నిర్వహిస్తారో నాకు తెలియదని ఆయన చెప్పారు. శ్రీలంక క్రికెట్ పరిపాలనలో ఏర్పడిన సమస్యల కారణంగా గత కొంతకాలంగా ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. క్రికెట్ బోర్డు వ్యవస్థ, నిబంధనల్లో మార్పులు చేసేందుకు ట్రాన్స్ఫర్మేషన్ కమిటీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే బోర్డుకు ఎన్నికలు నిర్వహించి, ప్రజలు ఎన్నుకున్న సభ్యులతో క్రికెట్ బోర్డును ఏర్పాటు చేయాలని ఐసీసీ కోరుతోంది.
ట్రాన్స్ఫర్మేషన్ కమిటీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి శ్రీలంక క్రికెట్ ప్రతినిధులకు ఐసీసీ బోర్డు సమావేశాల్లో పాల్గొనే అవకాశం కూడా ఇవ్వలేదు. జూలైలో జరిగిన ఐసీసీ సమావేశాల్లోనూ వీలైనంత త్వరగా క్రికెట్ బోర్డుకు ఎన్నికలు నిర్వహించాలని మరోసారి స్పష్టం చేశారు. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు కోల్పోవడం శ్రీలంకకు కేవలం ప్రతిష్ట పరమైన నష్టమే కాదు. అంతర్జాతీయ టోర్నీ దేశంలో జరిగితే విదేశాల నుంచి క్రికెటర్లు, అధికారులు, టీవీ సిబ్బంది, అభిమానులు వస్తారు. దీంతో క్రికెట్ బోర్డుతో పాటు హోటళ్లు, రవాణా, పర్యాటక రంగాలకు కూడా ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఆ అవకాశం శ్రీలంకకు దూరమైంది.
అంతేకాదు.. టోర్నీ వేదిక మారడంతో శ్రీలంక ఈ టోర్నీలో ఆడుతుందా లేదా అనే విషయంలోనూ కొంత అనిశ్చితి ఏర్పడింది. తొలి మహిళల ఛాంపియన్స్ ట్రోఫీలో ఆరు జట్లు పాల్గొననున్నాయి. మొదట ర్యాంకింగ్స్‌లో ఉన్న జట్లతో పాటు ఆతిథ్య దేశానికి కూడా అవకాశం ఇవ్వాలనే ప్రణాళిక ఉంది.









