Babar Azam :  ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్ ఓటమి తర్వాత స్టార్ బ్యాటర్ బాబర్ ఆజంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో జట్టుకు అండగా నిలవడంలో బాబర్ విఫలమవుతున్నాడంటూ పాకిస్థాన్ మాజీ బ్యాటర్ బాసిత్ అలీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 2026లో బాబర్ ఇప్పటివరకు 8 టెస్టుల్లో 322 పరుగులు చేశాడు. అయితే టెస్టు క్రికెట్‌లో అతను సెంచరీ చేసి దాదాపు నాలుగేళ్లు అవుతోంది. ఈ విషయాన్ని ప్రస్తావించిన బాసిత్ అలీ.. బాబర్‌ను అభిమానులు, అతని PR టీమ్ ప్రపంచ స్థాయి ఆటగాడిగా చూపిస్తున్నారని, కానీ పాకిస్థాన్ ఆల్‌టైమ్ గ్రేట్ ప్లేయర్ల జాబితాలో అతను కూడా లేడని వ్యాఖ్యానించాడు.

Also Read : మోదీ కీలక పిలుపు: విదేశాలకు వెళ్లొద్దు.. బంగారం కొనొద్దు!

వాళ్లు అంత గొప్ప ఆటగాళ్లుగా ఊరికే మారిపోలేదు. నేను సచిన్ టెండూల్కర్ గురించి కూడా మాట్లాడటం లేదు. నా దేశానికి చెందిన ఆటగాళ్ల గురించే చెబుతున్నాను. కష్టమైన సమయాల్లో మీరు ఏమీ చేయకపోతే.. దాని వల్ల ఏం ఉపయోగం? మీ అభిమానుల మధ్య మీరు గొప్ప ఆటగాడే. సోషల్ మీడియాలో మీరు గొప్ప ఆటగాడే అని బాసిత్ అలీ అన్నాడు. బాబర్ పదేపదే దేశాన్ని నిరాశపరుస్తున్నాడని కూడా బాసిత్ విమర్శించాడు. ముఖ్యంగా పాకిస్థాన్ బ్యాటింగ్ మొత్తం బాబర్‌పై ఆధారపడుతున్న సమయంలో అతను బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాడు.

ఎప్పుడు చేస్తావు? నేను బాబర్ ఆజం గురించే మాట్లాడుతున్నాను. అతని పేరే చెబుతున్నాను. నాలుగేళ్లుగా టెస్టులో సెంచరీ చేయలేదు. మరి ఎప్పుడు చేస్తావు? ఇది బాధ కలిగించే విషయం. దేశం మొత్తం బ్యాటింగ్ నీ మీద ఆధారపడి ఉన్నప్పుడు కనీసం అలాంటి షాట్ ఆడి ఔట్ కాకూడదు అని బాసిత్ తీవ్రంగా వ్యాఖ్యానించాడు. అయితే బాబర్ ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో పాకిస్థాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఆ సిరీస్‌లో 2 అర్ధసెంచరీలతో 193 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ సగటు 96.50గా ఉంది.

కానీ లార్డ్స్ టెస్టులో మాత్రం బాబర్ పూర్తిగా నిరాశపరిచాడు. గాయం కారణంగా లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టుకు దూరమైన అతను.. రెండో టెస్టులో తిరిగి జట్టులోకి వచ్చాడు. అయితే రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 8, 6 పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లండ్‌లో బాబర్‌కు గతంలో మాత్రం మంచి రికార్డు ఉంది. రెండో టెస్టుకు ముందు ఇంగ్లండ్‌లో ఆడిన ఆరు ఇన్నింగ్స్‌ల్లో అతని బ్యాటింగ్ సగటు 65.75గా ఉంది. ఆ సమయంలో మూడు అర్ధసెంచరీలు కూడా చేశాడు. ఇంగ్లండ్‌పై మొత్తంగా చూసుకున్నా బాబర్‌కు మంచి రికార్డే ఉంది. ఆ జట్టుపై 14 ఇన్నింగ్స్‌ల్లో అతని సగటు 53.83గా ఉంది. రెండో టెస్టుకు ముందు ఇంగ్లండ్‌తో ఆడిన 14 ఇన్నింగ్స్‌ల్లో ఏడు సార్లు కనీసం అర్ధసెంచరీ లేదా సెంచరీ సాధించాడు.

అయితే లార్డ్స్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తక్కువ స్కోర్లకే ఔట్ కావడంతో బాబర్‌పై విమర్శలు మరింత పెరిగాయి. ముఖ్యంగా పాకిస్థాన్ వరుసగా టెస్టుల్లో ఘోరంగా విఫలమవుతున్న సమయంలో జట్టులోని సీనియర్ బ్యాటర్‌గా బాబర్ నుంచి మరింత బాధ్యతాయుతమైన ఆటను అభిమానులు ఆశిస్తున్నారు.

Also Read : అన్నా హజారేకు అస్వస్థత.. ఐసీయూలో చికిత్స!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.