Gold Prices
Gold Prices

అంతర్జాతీయంగా పరిణామాలు చోటుచేసుకోవడంతో బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. పశ్చిమాసియాలో చమురు మంటలతో నెలకొన్న ద్రవ్యోల్బణ భయాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో ఈ విలువైన లోహాలకు గిరాకీ తగ్గుతోంది. నేడు హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,300గా నమోదైంది. మరోవైపు వెండి ధర కూడా తగ్గింది. నేడు మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.2.31 లక్షల వద్ద కొనసాగుతోంది.

Also Read : వీక్ డేస్‌లోను తగ్గని ‘ది ప్యారడైజ్’ దూకుడు.. మూడో రోజు కూడా భారీగా బుకింగ్స్!

అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర సోమవారం ఒకే రోజు దాదాపు 2.1 శాతం మేర పతనమై ఔన్సు ధర 4,199 డాలర్లకు దిగొచ్చింది. బంగారం ధర ఒకే రోజులో ఈ స్థాయిలో తగ్గడం సెప్టెంబరు 1 తర్వాత మళ్లీ ఇప్పుడే కావడం విశేషం. ఇక వెండి ధర కూడా ఔన్సు 62 డాలర్లకు పడిపోయింది. కమొడిటీ ఎక్స్ఛేంజ్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల ధర రూ.1.48 లక్షలుగా ఉండగా.. సిల్వర్ ఫ్యూచర్స్ కేజీ ధర రూ.2.28 లక్షల వద్ద ట్రేడవుతోంది.

హర్మూజ్ జలసంధిని తెరిచే శాంతి ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరస్కరించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. దీంతో బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్‌కు 106 డాలర్లకు చేరుకుంది. క్రూడ్ ఆయిల్ ధరలు ఇలాగే కొనసాగితే ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు ఇటీవల వడ్డీ రేట్లను పెంచిన అమెరికా ఫెడరల్ రిజర్వ్, అక్టోబరు నెలలో కూడా మరోమారు వడ్డీ రేట్ల పెంపు చేపట్టే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి.

ప్రస్తుతం అమెరికా బాండ్ల ప్రతిఫలాలు 5 శాతానికి పైనే కొనసాగుతున్నాయి. అంతేకాకుండా అమెరికా డాలర్ సూచీ కూడా గత రెండు నెలల్లోనే గరిష్ఠ స్థాయి అయిన 101.39కి పెరిగింది. ఈ పరిణామాలన్నింటి వల్ల మదుపర్లు బంగారం, వెండిలో సురక్షిత పెట్టుబడులు పెట్టడానికి పెద్దగా మొగ్గు చూపడం లేదు. సురక్షితమైన బాండ్లు, డాలర్‌ వైపే ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతుండటంతో బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒత్తిడికి గురై తగ్గుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Also Read : జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో ఆర్టికల్ 370 వివాదం.. తీర్మానం ప్రతులు చించేసిన బీజేపీ.. సభలో గందరగోళం!