
Cockroach Janata Party : దేశవ్యాప్తంగా యువత, విద్యార్థుల్లో సరికొత్త జెన్‌జీ (Gen Z) ఉద్యమ సెగలు రేపుతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) తన మొదటి భారీ బహిరంగ నిరసనకు సిద్ధమైంది. శనివారం (జూన్ 6) ఢిల్లీలోని చారిత్రాత్మక జంతర్‌మంతర్ వద్ద ఈ ప్రదర్శన నిర్వహించ తలపెట్టారు. పరీక్షల లీకేజీలు, విద్యా వ్యవస్థలోని లోపాలపై యువత గళమెత్తుతూ.. “బొద్దింకలారా! ఢిల్లీలో కలుద్దాం.. జోక్‌ను విప్లవంగా మార్చే సమయం వచ్చింది” అంటూ ఇచ్చిన పిలుపు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఢిల్లీ వీధులను శాంతియుత, ప్రేమపూర్వక నిరసనలతో నింపేయాలని పార్టీ శ్రేణులు పిలుపునిచ్చాయి.
ఈ నిరసన వెనుక ప్రధాన డిమాండ్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ఇటీవల జరిగిన నీట్ (NEET), సీబీఎస్ఈ (CBSE) వంటి ప్రతిష్టాత్మక పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు, ఫలితాల్లో దొర్లిన అవకతవకలు, మానసిక ఒత్తిడితో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం వంటి తీవ్ర అంశాలపై సీజేపీ గట్టిగా పోరాడుతోంది. దేశ భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్న విద్యాశాఖ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ మంత్రి తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలని వారు పట్టుబడుతున్నారు.
ఈ ప్రతిఘటనకు దేశవ్యాప్తంగా వివిధ రంగాల ప్రముఖుల నుంచి విశేష మద్దతు లభిస్తోంది. పర్యావరణ ఉద్యమకారుడు, ప్రముఖ విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ తానే స్వయంగా ఈ నిరసనలో పాల్గొంటానని ప్రకటించగా, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ షూటింగ్ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ హాజరయ్యేందుకు ప్రయత్నిస్తానని మద్దతు తెలిపారు. రాజకీయ వర్గాల నుంచి శివసేన (ఉద్ధవ్) నేత ఆదిత్య థాకరే ట్విట్టర్ వేదికగా సంఘీభావం ప్రకటించగా, హరియాణాకు చెందిన రైతు నాయకుడు గుర్నామ్‌సింగ్ చరుణి తమ సంఘం ప్రతినిధులను ఈ ఉద్యమానికి మద్దతుగా ఢిల్లీకి పంపుతున్నట్లు వెల్లడించారు.
పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఈ నిరసన కార్యక్రమాన్ని స్వయంగా నడిపించేందుకు అమెరికా నుండి శనివారం ఉదయాన్నే ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం నుండి నేరుగా పార్టీ ముఖ్య నేతలతో కలిసి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, నిరసన ప్రదర్శనకు అధికారిక అనుమతి కోరనున్నారు. నిరసనకు వచ్చే యువత ఒక చేతిలో జాతీయ జెండా, మరో చేతిలో విద్య ప్రాధాన్యతను చాటేలా ఒక పుస్తకం పట్టుకుని ఉదయం 9 గంటలకల్లా జంతర్‌మంతర్‌కు చేరుకోవాలని పార్టీ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చింది. శాంతియుతంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎలాంటి ట్రోల్స్ లేదా రెచ్చగొట్టే చర్యలకు లోనుకావద్దని హెచ్చరించింది.
మరోవైపు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ బ్రిటన్ పర్యటనలో ఉన్న తరుణంలో ఈ ‘బొద్దింకల’ అంశం అంతర్జాతీయంగా ప్రస్తావనకు రావడం గమనార్హం. లండన్ యూనివర్సిటీ బ్రిక్బెక్ కాలేజీలో ‘ఏఐ, అంతర్జాతీయ చట్టాలు’ అనే అంశంపై ఆయన ప్రసంగించిన అనంతరం, ఒక యువతి భారతదేశంలో అసమ్మతిపై జరుగుతున్న అణచివేత గురించి ప్రశ్నించేందుకు ప్రయత్నించింది. అయితే సభ నిర్వాహకులు ఆమెను అడ్డుకున్నారు. గతంలో నిరుద్యోగులను ఉద్దేశించి సీజేఐ చేసిన కొన్ని వ్యాఖ్యల నేపథ్యం నుండే ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పుట్టుకొచ్చిన సంగతిని గుర్తుచేస్తూ సీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఈ వీడియోలను ఎక్స్ (X) లో పంచుకున్నారు.
ఈ అపూర్వ యువ నిరసన నేపథ్యంలో దేశ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. జంతర్‌మంతర్ వద్ద నిరసనకు సీజేపీ నుండి తమకు ఎలాంటి ముందస్తు దరఖాస్తు అందలేదని ఢిల్లీ పోలీసులు తెలిపినప్పటికీ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ముందుజాగ్రత్త చర్యగా దాదాపు వెయ్యి మంది పోలీసు సిబ్బందిని ఘటనా స్థలంలో భారీగా మోహరించారు. సోషల్ మీడియా వేదికగా పుట్టిన ఒక చిన్న నిరసన స్వరం, ఇప్పుడు ఢిల్లీ పీఠాన్ని కదిలించే స్థాయి విప్లవంగా మారుతుండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.









