CM Vijay : మహిళలపై అసభ్యకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తమిళనాడు సీఎం విజయ్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో మాట్లాడిన సీఎం.. మహిళలు, చిన్నారుల రక్షణే తమ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన అంశమని అన్నారు. అయితే రాజకీయాల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజమేనని విజయ్ చెప్పారు. రాజకీయ విమర్శలు ఎంత తీవ్రంగా ఉన్నా పర్వాలేదని, కానీ మహిళలను కించపరిచేలా లేదా అవమానించేలా మాట్లాడటం మాత్రం అంగీకరించబోమని స్పష్టం చేశారు.

నటుడు త్రిషకు సంబంధించిన ఓ వివాదంలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన డబుల్ మీనింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విజయ్ చేసిన వ్యాఖ్యలు ఉదయనిధి స్టాలిన్‌ను ఉద్దేశించినవిగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొద్ది వారాల క్రితం సీఎం విజయ్, నటి త్రిషకు సంబంధించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. అవి మహిళను అవమానించేలా ఉన్నాయంటూ విమర్శలు వచ్చాయి.

ఈ వ్యవహారంలో ఆగస్టు 4న తమిళనాడు పోలీసులు ఉదయనిధి స్టాలిన్‌ను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు మద్రాస్ హైకోర్టు ఆదేశాల తర్వాత ఆయనను విడుదల చేశారు. అసెంబ్లీలో విజయ్ మాట్లాడుతూ.. తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణం. మహిళలపై ఎలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలను నేను సహించను. రాజకీయంగా ఎంత తీవ్రంగా విమర్శించినా పర్వాలేదు. కానీ మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయకూడదని అన్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.