
Supreme Court : నాలుగు తరాలుగా, దాదాపు ఏడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒక సుదీర్ఘ ఆస్తి వివాదానికి సుప్రీం కోర్టు తాజాగా చారిత్రాత్మక తీర్పుతో ఫుల్ స్టాప్ పెట్టింది. భూమి కొనుగోలుకు సంబంధించి 1957 నాటి సేల్ డీడ్ చట్టబద్ధమేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేయడంతో ఈ సుదీర్ఘ న్యాయపోరాటానికి ముగింపు పడింది. ఈ కేసులో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఈ వివాదంపై తీర్పు వెలువరించిన న్యాయమూర్తుల వయసు కంటే ఈ చట్టపరమైన భూ పోరాటం వయసే చాలా ఎక్కువ. జస్టిస్ ప్రశాంత్ కుమార్… జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించి, సదరు జడ్జీలు జన్మించక ముందు నాటి వివాదాన్ని పరిష్కరించింది.
వివాదానికి కారణమైన ఈ భూమి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లా నర్సీపుర్ కలాన్ గ్రామంలో ఉంది. అక్కడ ఉన్న 15.5 బిఘాల భూమిని సరాఫత్ అలీ అనే వ్యక్తి పూర్వీకులు 1957 జూన్ 4వ తేదీన రిజిస్టర్డ్ సేల్‌డీడ్ ద్వారా కొనుగోలు చేశారు. నాటి నుంచీ ఆ భూమి సరాఫత్ అలీ కుటుంబం ఆధీనంలోనే ఉంది. ఆస్తి కొనుగోలు జరిగిన సమయంలో సరాఫత్ అలీ మైనర్ కావడం గమనార్హం. భూమిని అమ్మిన కొందరు తొలుత అభ్యంతరం చెప్పడంతో సేల్ డీడ్ జరిగినా భూమి మ్యుటేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే 1984లో వారు తమ అభ్యంతరాలను వెనక్కు తీసుకోవడంతో రెవెన్యూ అధికారులు సరాఫత్ అలీ కుటుంబం పేరిట మ్యుటేషన్‌ను పూర్తి చేశారు.
అంతా సవ్యంగా సాగుతోందనుకున్న సమయంలో, 1991లో ప్రభుత్వం భూముల పునర్వ్యవస్థీకరణ (కన్సాలిడేషన్) ప్రక్రియను చేపట్టింది. ఈ భూ సమీకరణ ప్రక్రియ రికార్డుల్లో యజమానులుగా మళ్లీ పూర్వపు అమ్మకందారుల పేర్లే కనిపించాయి. దీంతో తనను భూమిదారుగా గుర్తించాలని కోరుతూ సరాఫత్ అలీ ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తును పరిశీలించిన కన్సాలిడేషన్ అధికారి 1993లో ప్రాథమికంగా సరాఫత్ అలీ హక్కులను గుర్తించారు. అయితే, ఆ భూమిపై కో-టెన్యూర్ (సహ యజమానుల) హక్కులు ఉన్న మరికొందరు ఈ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం లేవనెత్తడంతో ఈ వ్యవహారం మళ్లీ వివాదాస్పదమై కేసు విచారణకు వచ్చింది.
దీనిపై మళ్లీ విచారణ జరిపిన కన్సాలిడేషన్ అధికారి 1999లో సరాఫత్ కుటుంబానికి వ్యతిరేకంగా తీర్పు వెలువరించారు. ఉత్తరప్రదేశ్ జమీందారీ నిర్మూలన, భూ సంస్కరణల చట్టంలోని సెక్షన్ 154ను ఉల్లంఘించారనే కారణంతో 1957 నాటి సేల్ డీడ్ చెల్లదని పేర్కొన్నారు. అంతేకాకుండా, నాటి సేల్ డీడ్‌పై సంతకం చేసిన సాక్షి చిరునామా, వివరాల్లో స్పష్టత లేదంటూ మ్యుటేషన్‌ను తిరస్కరించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా బాధితులు అప్పీల్ , రివిజన్ అధికారులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. చివరికి ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు కూడా దిగువ అధికారుల నిర్ణయాన్నే సమర్థిస్తూ సరాఫత్ కుటుంబ అభ్యర్థనను కొట్టివేయడంతో బాధితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
దశాబ్దాల పాటు సాగిన ఈ సుదీర్ఘ న్యాయపోరాటం మధ్యలోనే అసలు అప్పీలుదారుడైన సరాఫత్ అలీ మరణించారు. అయినప్పటికీ ఆయన చట్టబద్ధ వారసులు పట్టువదలకుండా అత్యున్నత న్యాయస్థానంలో ఈ కేసుపై పోరాటాన్ని కొనసాగించారు. దీనివల్ల నాలుగు తరాల పాటు ఈ కుటుంబం కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది.
తుది విచారణ అనంతరం సుప్రీం కోర్టు దిగువ కోర్టులు, హైకోర్టు ఇచ్చిన తీర్పులను రద్దు చేస్తూ కొనుగోలుదారులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. సాక్షి వివరాల్లో ఉన్న చిన్నపాటి సాంకేతిక లోపాలు లేదా వ్యత్యాసాల ఆధారంగా చట్టబద్ధంగా రిజిస్టరైన సేల్‌డీడ్‌ను రద్దు చేయడం తీవ్ర న్యాయపరమైన పొరపాటని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ సేల్ డీడ్ నకిలీదని గానీ, ఫోర్జరీ లేదా బలవంతంగా జరిగిందని ప్రతివాదులు ఎక్కడా ఆరోపించలేదని, అలాగే 1981 నాటి జమీందారీ చట్ట సవరణలు 1957 నాటి ఒప్పందానికి వర్తించవని పేర్కొంటూ 1957 నాటి సేల్ డీడ్ చెల్లుబాటు అవుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.









