fact check

Fact Check :  2026 జూన్‌ 30 తర్వాత పాత రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు రద్దవుతున్నాయా అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సర్క్యులర్ ద్వారా రద్దు చేసిందని, ఇకపై అవి చెల్లవంటూ వైరల్ గా మారింది. దీంతో మరోసారి దేశంలో నోట్ల రద్దు జరగబోతుందా అనే ఆందోళన నెలకొంది. అయితే ఈ వార్తలకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర చెక్ పెట్టింది. ఇదంతా ఫేక్ వార్త అని కొట్టిపారేసింది. ఈ పుకార్లపై ఒక ప్రకటన విడుదల చేసింది.

“2005 కంటే ముందు ముద్రించిన పాత రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లను 2026 జూన్ 30 తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖలలో స్వీకరించరని సోషల్ మీడియాలో ఒక తప్పుడు సందేశం షేర్ అవుతోంది. ఈ సమాచారం పూర్తిగా అవాస్తవం, తప్పు అని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్పష్టం చేస్తోంది. వినియోగదారులు ఎవరూ ఇలాంటి అబద్ధపు వార్తలను నమ్మవద్దని, ఇతరులకు షేర్ చేయవద్దని కోరుతున్నాము” అని వెల్లడించింది. ఆయా నోట్లు రద్దవుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, ఈ వైరల్ క్లెయిమ్ పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉందని బ్యాంక్ స్పష్టం చేసింది.

ఆర్బీఐ ఏం చెబుతుంది అంటే?

గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2015లో ఇచ్చిన ఒక కమ్యూనికేషన్ ప్రకారం.. 2005 కంటే ముందు జారీ చేసిన మహాత్మా గాంధీ సిరీస్ నోట్ల చలామణి మార్కెట్లో చాలా వరకు తగ్గిపోయిందని పేర్కొంది. ఒకవేళ ఎవరి దగ్గరైనా అలాంటి పాత నోట్లు ఉంటే, వాటిని బ్యాంకుల ద్వారా మార్చుకునే సదుపాయాన్ని కల్పించింది. అయితే ఆ నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటవుతాయని ఆర్బీఐ స్పష్టంగా తేల్చి చెప్పింది. నకిలీ నోట్ల నియంత్రణకు, మరింత పటిష్టమైన భద్రతా ఫీచర్ల కోసమే కొత్త నోట్లను తీసుకొచ్చారు తప్ప, పాత నోట్లను రద్దు చేసే ఉద్దేశం లేదా ప్లాన్ కేంద్ర బ్యాంకుకు ఎప్పుడూ లేదు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.