aadhar card, pan card

July 1st : సాధారణంగా ప్రతి నెల ప్రారంభంలో కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి వస్తుంటాయి. అలాగే 2026 జూలై 1వ తేదీ నుంచి కూడా దేశంలో పలు కీలక నిబంధనలు మారబోతున్నాయి. ఇందులో పాస్‌పోర్ట్ ఫీజుల పెంపు, రైల్వే జరిమానాలు, ఆధార్ కార్డ్ అప్‌డేట్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్ వంటి ఎన్నో అంశాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్ట్ నిబంధనలు 1980 కింద కొన్ని సవరణలు చేసింది. దీనివల్ల వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కొత్త పాస్‌పోర్ట్ తీసుకోవాలన్నా లేదా పాత దాన్ని రిఇష్యూ చేయించుకోవాలన్నా ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ ఫీజును రూ.1,500 నుంచి రూ.2,500కి పెంచారు. అలాగే తత్కాల్ పాస్‌పోర్ట్ ఫీజును రూ.3,500 నుంచి రూ.5,000కి పెంచారు. ఇకపోతే 60 పేజీల పెద్ద పాస్‌పోర్ట్ బుక్‌లెట్ కోసం సాధారణ ఫీజు రూ.2,000 నుంచి రూ.3,500కి, తత్కాల్ ఫీజు రూ.4,000 నుంచి ఏకంగా రూ.6,000కి పెరిగింది.

మీ ఆధార్ కార్డులో ఈమెయిల్ ఐడీని లింక్ లేదా అప్‌డేట్ చేసుకోవాలనుకుంటే జూలై 1వ తేదీ వరకు ఆగడం మంచిది. ప్రస్తుతం ఈ సేవ కోసం జీఎస్టీతో కలిపి రూ.75 వసూలు చేస్తున్నారు. కానీ, జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ ఈమెయిల్ అప్‌డేట్ సేవను ప్రభుత్వం పూర్తిగా ఉచితం చేసింది. అయితే, ఈ ఉచిత సేవ కేవలం అధికారిక మొబైల్ యాప్ ద్వారా చేసుకుంటేనే వర్తిస్తుందని గమనించాలి.

రైల్వే ప్రయాణికుల్లో క్రమశిక్షణ పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం జరిమానాలను భారీగా పెంచింది. జూలై 1 నుంచి రైల్వే నిబంధనలను ఉల్లంఘిస్తే పాత జరిమానా రూ.250 స్థానంలో రూ.500 కట్టాల్సి ఉంటుంది. రైళ్లలో అనుమతి లేని ప్రమాదకరమైన వస్తువులను తీసుకెళ్తే గరిష్టంగా రూ.10,000 వరకు జరిమానాతో పాటు తీవ్రతను బట్టి జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. అలాగే, రైల్వే స్టేషన్లలో లేదా రైళ్లలో లైసెన్స్ లేకుండా సామాన్లు, వస్తువులు అమ్మే వారికి రూ.2,000 జరిమానా విధిస్తారు. పురుషులు ఎవరైనా పొరపాటున లేదా కావాలని మహిళల కోచ్‌ లో ప్రయాణిస్తూ దొరికిపోతే రూ.2,500 వరకు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది.

కనీసం రూ.60,000 ఖర్చు

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రెగాలియా గోల్డ్ క్రెడిట్ కార్డ్ నియమాల్లో మార్పులు రాబోతున్నాయి. కొత్త రూల్ ప్రకారం.. కార్డుదారులు ఒక త్రైమాసికంలో కనీసం రూ.60,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ పరిమితిని దాటిన వారికి మాత్రమే తర్వాతి మూడు నెలల్లో ఎయిర్‌పోర్ట్ లాంజ్ సౌకర్యం ఉచితంగా లభిస్తుంది.

2025-26 కు గానూ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి జూలై 31 చివరి తేదీ. కాబట్టి పన్ను చెల్లింపుదారులు ఆఖరి నిమిషం వరకు ఆగకుండా ముందే ఐటీఆర్ ఫైల్ చేయడం మంచిది. మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల తగ్గుదల నేపథ్యంలో.. జూలై 1న దేశీయంగా CNG, PNG విమాన ఇంధనం ధరలలో మార్పులు లేదా సవరణలు జరిగే అవకాశం ఉంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.