Sravana Somavaram 2026
Sravana Somavaram 2026

పవిత్రమైన శ్రావణ మాసంలోని ప్రతి సోమవారం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అందులోనూ మొదటి సోమవారం మరింత పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. ఈ ఏడాది శ్రావణ మాసంలోని తొలి సోమవారం రేపు (ఆగస్టు 3న) వచ్చింది. ఈ ప్రత్యేకమైన రోజున శివుడిని సరైన ఆచారాలతో పూజించి, జలాభిషేకం చేయడం వల్ల జీవితంలో ఉన్న సమస్యలు, కష్టాలు తొలిగిపోయి.. మనశ్వాంతి, ఆనందం కలుగుతాయని భక్తుల నమ్మకం. మరి మీరు కూడా శ్రావణ మాసంలోని తొలి సోమవారం శివునికి భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలనుకుంటే.. మీ పూజ పల్లెంలో ఈ పవిత్ర వస్తువులు తప్పనిసరిగా ఉంచుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.

శివుని అనుగ్రహం కోసం పూజా పళ్ళెంలో ఉండాల్సిన 10 వస్తువులు!

స్వచ్ఛమైన నీరు: శ్రావణ మాసంలో శివుడిని పూజించడానికి అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన మార్గం జలాభిషేకం చేయడం. ఇది మనస్సుకు శాంతిని ఇస్తుంది.

గంగాజలం: మహాదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి గంగాజలంతో అభిషేకం చేయాలి. దీనికోసం సాధారణ నీటిలో కొద్దిగా పవిత్ర గంగాజలాన్ని కలిపి శివలింగంపై అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి.

పచ్చి పాలు: శ్రావణ సోమవారాల్లో శివలింగానికి పాలు సమర్పించడం ప్రాచీన సంప్రదాయం. దీనివల్ల కుటుంబంలో సంతోషం, శ్రేయస్సు, ఆరోగ్యం కలుగుతాయని నమ్ముతారు.

చందనం (గంధం): శివలింగానికి తెల్లటి లేదా పసుపు రంగు గంధాన్ని పూయడం వల్ల.. ఇది చల్లదనాన్ని, మానసిక ప్రశాంతతను అందిస్తుందని భావిస్తారు.

జమ్మి ఆకులు (శమీ): శని దోషాల నివారణకు, శివుని అనుగ్రహం పొందడానికి శమీ ఆకులు సమర్పించడం శుభప్రదం.

తెల్లని పువ్వులు: పరమేశ్వరునికి తెల్లని పూవ్వులంటే చాలా ఇష్టం. అందువల్ల జిల్లేడు (మదర్), మల్లెలు, గన్నేరు లేదా ఇతర తెల్లని పువ్వులతో పూజించడం మంచిది.

బిల్వ పత్రం (మారేడు దళాలు): శివుడికి బిల్వ ఆకులంటే చాలా ఇష్టం. అందువల్ల పూజ సమయంలో ఎప్పుడూ శుభ్రమైన, పాడవని, చిరగని బిల్వ పత్రాలనే ఉపయోగించాలి.

ఉమ్మెత్త పువ్వు (దతూర): ఉమ్మెత్త పువ్వులు లేదా కాయలు ముక్కంటికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. వీటిని శివునికి సమర్పించడం వల్ల పాపాలు, బాధలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు.

భాంగ్: పురాణాల ప్రకారం.. భాంగ్ శివునికి అత్యంత ఇష్టమైనదిగా భావిస్తారు. శ్రావణమాస పూజల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంటుంది.

నైవేథ్యం (పండ్లు, మిఠాయిలు): పూజ చివరలో దేవునికి పండ్లు, స్వచ్ఛమైన మిఠాయిలను నైవేద్యంగా సమర్పించి.. ఆ తర్వాత ఈ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు, ప్రజలకు పంచాలి.