

_ Ravi Prakash
Pune Murder Case: కేతన్ అగర్వాల్ మరణం తర్వాత.. పుణె పోలీసులు బయటపెట్టిన విషయాలు వింటే ఏదో ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా కథ వింటున్నట్టుంది. ఈ మర్డర్ ప్లాన్ వెనక ఉన్న మిస్టరీని పోలీసులు ఎలా బయటపెట్టారో తెలుసా?.. కేతన్ హత్య తర్వాత సియా, చేతన్‌లు వెంటనే పెళ్లి చేసుకోకూడదని, ఎవరికీ అనుమానం రాకుండా మూడేళ్ల పాటు గ్యాప్ ఇవ్వాలని ప్లాన్ చేసుకున్నారు!. పెళ్లి ఖర్చుల పేరుతో కేతన్ దగ్గర నుంచి సియా అక్షరాలా కోటి రూపాయలు వసూలు చేసిందని పోలీసులు చెప్తున్నారు. అసలు లోపల ఇంత జరుగుతున్నా, బయటకు అంతా నార్మల్‌గా ఉందని నమ్మించడానికి.. రాజస్థాన్‌లో రూ.17 కోట్ల భారీ బడ్జెట్‌తో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నారు. మర్డర్ జరిగిన రోజు నిందితులు ఇద్దరూ ఒకరికొకరు హ్యాండ్ సిగ్నల్స్ చేసుకుంటూ ప్లాన్ అమలు చేశారని ఇన్వెస్టిగేషన్ టీమ్ చెబుతోంది.
అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటంటే.. జూన్ 18 కంటే ముందే కేతన్‌ను లేపేయడానికి చేతన్, సియా చాలాసార్లు ట్రై చేశారు. కానీ ఆ ప్రయత్నాలు ఫెయిల్ అయిపోయాయి!. పుణె పోలీసులు మోపిన ఈ ఆరోపణలన్నీ కోర్టులో నిజమని తేలితే.. నిజంగానే ఇది ఒక సంచలన క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ అవుతుంది. నిందితులకు జీవితఖైదు కానీ, మరణశిక్ష పడే అవకాశం ఉంటుంది. అసలు పోలీసులు ఏం చెప్తున్నారు?.. ఈ ప్లాన్ వెనక అసలు కథ ఏంటి?.. మొదటి నుంచి ఏం జరిగిందో ఓసారి చూద్దాం!.
కేతన్ అగర్వాల్ వయసు 26 ఏళ్లు. ఎంబీఏ చదివి రెండేళ్ల క్రితమే అమెరికా నుంచి తిరిగి వచ్చాడు. పుణెలో తన ఫ్యామిలీకి ఉన్న రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ బిజినెస్‌ను చూసుకుంటున్నాడు. ఇక సియా గోయల్ వయసు 20 ఏళ్లు. పుణెలోని కోత్రుడ్ ఏరియాలో ఉంటూ బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతోంది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ ప్రకారం.. కేతన్‌తో సియాకు ఎంగేజ్మెంట్ జరిగింది. పెళ్లి పనులు మొదలయ్యాయి. పుణెలోనే అత్యంత ఘనంగా ఈ పెళ్లి చేయడానికి రెండు కుటుంబాలు రెడీ అయ్యాయి. రాజస్థాన్‌లో ప్లాన్ చేసిన ఆ డెస్టినేషన్ వెడ్డింగ్ బడ్జెట్ దాదాపు 17 కోట్ల రూపాయలు!. కానీ, ఈ పెళ్లి ముసుగు వెనక అప్పటికే ఒక సీక్రెట్ లవ్ స్టోరీ నడుస్తోంది. కేతన్‌తో ఎంగేజ్మెంట్ అయిన సమయానికి.. సియా, 22 ఏళ్ల చేతన్ చౌదరి అనే కుర్రాడితో రిలేషన్లో ఉందని పోలీసులు చెప్తున్నారు.
Also Read : పాక్ స్కెచ్‌ను తిప్పికొట్టిన భారత్.. ఢిల్లీలో ఉగ్రకుట్ర భగ్నం.. నలుగురు అరెస్ట్!
కొండ్వా బుద్రుక్కు చెందిన చేతన్.. భవిష్యత్తులో రంజీ ట్రోఫీ ఆడాలనే కలతో ఉన్న ఒక క్రికెటర్. సియా, చేతన్‌లు అంతకుముందే పెళ్లి చేసుకుంటామని ఇంట్లో చెప్పారు. కానీ, ఇరు కుటుంబాల ఆర్థిక పరిస్థితుల్లో చాలా తేడా ఉండటంతో సియా ఇంట్లో వాళ్లు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. ఆ రిజెక్షనే ఈ కథను మలుపు తిప్పింది!. ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఈ జంట రూట్ మార్చింది. ఒక ప్రమాదకరమైన ప్లాన్ వేసింది. కేతన్‌తో ఎంగేజ్మెంట్ వద్దని చెప్పకుండా, తనే కేతన్‌ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నట్లు అందరినీ నమ్మించాలని సియా డిసైడ్ అయింది. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా పెళ్లి పనులు జరపాలి అని ప్లాన్ చేశారు. ఈ ప్లాన్‌లో చాలా స్టేజీలు ఉన్నాయి. ఎంగేజ్మెంట్ జరగాలి.. పెళ్లి పనులు నడవాలి.. కేతన్ తనను గుడ్డిగా నమ్మాలి. ఈ నమ్మకంతోనే నగలు, బట్టలు, పెళ్లి షాపింగ్ పేరు చెప్పి కేతన్ దగ్గర నుంచి కోటి రూపాయలు తీసుకుంది సియా.
ఆ డబ్బుతో పెళ్లి షాపింగ్ చేయలేదు. మొత్తం చేతన్‌కు ఇచ్చేసింది. కేతన్ చనిపోయిన తర్వాత కూడా వెంటనే పెళ్లి చేసుకోకూడదని, కనీసం మూడేళ్లు ఆగాలని సియా, చేతన్ రూల్ పెట్టుకున్నారు. అప్పుడే ఎవరికీ ఎలాంటి అనుమానం రాదు. అందుకే బయటకు అంతా నార్మల్‌గా కనిపించింది. ఒకవైపు పెళ్లి పనులు గ్రాండ్‌గా సాగుతున్నాయి. రాజస్థాన్ వెడ్డింగ్ ప్లాన్స్ నడుస్తున్నాయి. లోకానికి మాత్రం వాళ్లిద్దరూ చాలా హ్యాపీగా ఉన్న జంటలా కనిపిస్తున్నారు. కానీ, ఈ పెళ్లి ముసుగు వెనక ఒక ఘోరమైన కుట్ర జరుగుతోంది. ఆ కుట్ర వీళ్లందరినీ ఒకే చోటికి తీసుకెళ్లింది. అదే లోహగఢ్ కోట (Lohagad Fort). అయితే, జూన్ 18న హత్యకు ముందు ఈ కేసులో కొన్ని కీలకమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. అవే ఇప్పుడు ఈ కేసుకు టర్నింగ్ పాయింట్. ఒక బాలి ట్రిప్.. ఒక పాస్‌పోర్ట్ మిస్సింగ్.. పదే పదే లోహగఢ్ కోటకు వెళ్లడం.. జూన్ 18 కంటే ముందు కేతన్పై మర్డర్ అటెంప్ట్స్ ఎలా ఫెయిల్ అయ్యాయి. అసలు ఈ ఇన్వెస్టిగేషన్ ఎటు వైపు వెళ్లింది!.
పుణె పోలీసుల కథనం ప్రకారం.. ఈ మొత్తం కుట్రకు ఒకే ఒక్క సెంట్రల్ పాయింట్ ఉంది. అదే లోహగఢ్ కోట(Lohagad Fort). పుణెకు దాదాపు 75 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ కోట.. మహారాష్ట్రలోనే అత్యంత పాపులర్ ట్రెక్కింగ్ స్పాట్. దాదాపు 3,389 అడుగుల ఎత్తులో ఉండే ఈ కోట పైనుంచి చూస్తే.. కింద 400 అడుగుల లోతైన లోయ కనిపిస్తుంది. కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల ప్రకారం.. నిందితులు దీన్ని కేవలం ఒక టూరిస్ట్ స్పాట్‌లా చూడలేదు. పక్కాగా ప్లాన్ చేసి ఈ ప్లేస్‌ను సెలెక్ట్ చేసుకున్నారు. జూన్ 18 కంటే ముందే.. సియా ఇంటర్నెట్లో లోహగఢ్ కోట గురించి, అక్కడి దారుల గురించి, దాని చరిత్ర గురించి గంటల తరబడి సెర్చ్ చేసింది. సియా మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ టీమ్ చెక్ చేసినప్పుడు చాలా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఈ కోటలో ఉండే అత్యంత ప్రమాదకరమైన “వించూ కాటా” అంటే తేలు తోక ఆకారంలో ఉండే రాతి నిర్మాణం గురించి ఆమె గూగుల్‌లో వెతికినట్లు ఆధారాలు దొరికాయి. అంతే కాదు.. ఈ కోటలో ఎక్కడెక్కడ ప్రమాదకరమైన అంచులు ఉన్నాయి?.. ఎక్కడి నుంచి జారిపడితే మనుషులు చనిపోతారు?.. అనే విషయాలపై యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా రీల్స్ కూడా చూసింది.
ఈ డిజిటల్ ఆధారాలే ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలకంగా మారాయి. అయితే, కేవలం ఇంటర్నెట్ సెర్చ్ మాత్రమే కాదు.. అంతకంటే ముందే గ్రౌండ్ లెవెల్లో ఒక పక్కా స్కెచ్ నడిచింది. జూన్ 18 కంటే ముందే సియా చాలాసార్లు లోహగఢ్ కోటకు వెళ్లి వచ్చింది. మే 31న ఒకసారి, జూన్ 14న మరోసారి, ఆ తర్వాత జూన్ 18న చివరిసారిగా కేతన్‌ను తీసుకుని సియా అక్కడికి వెళ్లింది. కేతన్ చనిపోవడానికి కేవలం 12 రోజుల ముందు.. సియా ఏకంగా నాలుగు సార్లు ఈ కోట చుట్టూ తిరిగిందని పోలీసులు చెప్తున్నారు. ఇవన్నీ సరదాగా వెళ్లిన ట్రిప్స్ కావు!. అక్కడి దారులు ఎలా ఉన్నాయి?, ఎక్కడి నుంచి నెట్టేస్తే పని ఖతమవుతుంది? అని స్పాట్ సెలెక్ట్ చేసుకోవడానికే సియా అన్నిసార్లు తిరిగిందని ఇన్వెస్టిగేషన్ టీమ్ బలంగా నమ్ముతోంది. ఈ తవ్వకాల్లోనే పోలీసులకు ఒక ఖచ్చితమైన ప్లేస్ దొరికింది. లోకల్‌గా దాన్ని “డెడ్ పాయింట్” అని పిలుస్తారు. ఆ స్పాట్ నుంచి కింద ఉన్న 400 అడుగుల లోయలోకి పడితే.. మనిషి ప్రాణాలతో మిగిలే ఛాన్సే లేదు. జూన్ 18 కంటే ముందే ఈ ప్లేస్‌ను సియా, చేతన్ ఫిక్స్ చేసుకున్నారు.
కానీ, జూన్ 18 ఫైనల్ ట్రిప్ కంటే ముందే.. అక్కడ ఇంకో ఘోరం జరిగింది. అదొక విఫలమైన మర్డర్ అటెంప్ట్!. జూన్ 14న కూడా సియా, కేతన్ ఇద్దరూ లోహగఢ్ కోటలో ట్రెక్కింగ్ చేస్తున్నారు. అప్పుడు సియా హఠాత్తుగా అటు చూడు ‘పాము’ అంటూ కేతన్కు ఒక వైపు చూపించింది. కేతన్ అటు తిరగ్గానే.. ఆమె అతన్ని లోయలోకి నెట్టేయడానికి ట్రై చేసింది. కానీ కేతన్ అదృష్టం బాగుండి పక్కనే ఉన్న ఒక చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత జరిగిన విషయమే మరింతగా అందరినీ భయపెడుతోంది. తనను సియా చంపాలని చూసిందనే విషయాన్ని కేతన్ అస్సలు ఊహించలేకపోయాడు. పాము నుంచి తనను కాపాడటానికే సియా అలా చేసిందని గుడ్డిగా నమ్మాడు. ఆమెను అంతలా నమ్మాడు కాబట్టే.. ఆ ఫెయిలైన అటెంప్ట్ తర్వాత ఈ కుట్ర మరో మలుపు తిరిగింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత.. చేతన్ తానే స్వయంగా రంగంలోకి దిగుతానని పట్టుబట్టాడు. మొదట ఈ ప్లాన్‌ను సియా ఒక్కత్తే పూర్తి చేయాలనుకుంది. కానీ మొదటిసారి ఫెయిల్ అవ్వడంతో.. ఈసారి జూన్ 18న సియా, చేతన్ ఇద్దరూ కలిసే ఈ ప్లాన్‌ను ఎగ్జిక్యూట్ చేయాలని డిసైడ్ అయ్యారు.
Also Read : జమ్మూకశ్మీర్‌లో వరదల బీభత్సం: అనంతనాగ్‌లో ఆకస్మిక వరదలు, కశ్మీర్ లోయకు రెడ్ అలర్ట్
ఇక ఈ ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డ ఇంకో ఇంట్రెస్టింగ్ చాప్టర్ “బాలి ట్రిప్”. నిజానికి కేతన్, సియాలు ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం ఇండోనేషియాలోని బాలి వెళ్లాల్సి ఉంది. కానీ కేతన్‌తో ఆ ట్రిప్ వెళ్లడం సియాకు అస్సలు ఇష్టం లేదు. ఆ ట్రిప్ క్యాన్సిల్ చేయాలంటూ ఆమె పదే పదే ఒత్తిడి తెచ్చింది. కానీ ఆల్రెడీ ఫ్లైట్ టికెట్లు, హోటల్ బుకింగ్స్ అయిపోయాయి కాబట్టి వెళ్లాల్సిందేనని సియా బ్రదర్ పట్టుబట్టాడు. ఈ బాలి ట్రిప్ గనుక వెళ్తే.. తాము వేసిన మర్డర్ ప్లాన్‌కు బ్రేక్ పడుతుందని నిందితులు భయపడ్డారు. దీంతో కథలో ఇంకో డ్రామా నడిచింది. బాలి ట్రిప్ కోసం సియా, కేతన్ పుణె నుంచి కారులో ముంబై బయల్దేరారు. దారిలో ఖాలాపూర్ దగ్గర ఉన్న ఒక ఫుడ్ మాల్ దగ్గర కారు ఆగింది. ఏదైనా తిందామని ఆ మాల్‌లోకి ఎంట్రీ అయ్యారు. డ్రైవర్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం.. తన మొబైల్ ఫోన్ పోయిందని, వెతుక్కుంటానని చెప్పి సియా ఒకత్తే కారు దగ్గరకు మళ్లీ తిరిగి వచ్చింది. ఆ గ్యాప్‌లోనే.. కారులో ఉన్న కేతన్ బ్యాగ్ నుంచి అతని పాస్‌పోర్ట్‌ను సియా దొంగిలించింది.
దాన్ని ముక్కలు ముక్కలుగా చింపేసి లేడీస్ వాష్‌రూమ్‌లో పడేసి ఏమీ తెలియనట్లు కారు దగ్గరకు వచ్చేసింది. దీని వెనక ఉన్న ప్లాన్ చాలా సింపుల్.. కేతన్ దగ్గర పాస్‌పోర్ట్ లేకపోతే.. ట్రిప్ క్యాన్సిల్ అయిపోతుంది!. ఇప్పటికీ పోలీసులు ఆ ఖాలాపూర్ ఫుడ్ మాల్ పరిసరాల్లో ఆ పాస్‌పోర్ట్ ముక్కల కోసం వెతుకుతున్నారు. సాక్షుల మాటలు, డ్రైవర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సెర్చ్ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఇప్పుడు పోలీసులు వీటన్నిటినీ లింక్ చేస్తున్నారు. లోహగఢ్ కోట చుట్టూ పదే పదే తిరగడం, ఇంటర్నెట్ సెర్చులు, పాస్‌పోర్ట్ చింపేయడం, బాలి ట్రిప్ క్యాన్సిల్ చేయడం.. ఇవన్నీ ఒకే కుట్రలో భాగమని పోలీసులు గట్టిగా నమ్ముతున్నారు. కానీ, జూన్ 18న ఈ కథ ఊహించని మలుపు తిరిగింది. ఆ రోజు ఈ ప్రమాదకరమైన ప్లాన్ లాస్ట్ ఫేజ్‌లోకి ఎంటర్ అయింది. ఆ రోజు అసలు లోహగఢ్ కోట పైన ఏం జరిగింది?, పోలీసులు చెప్తున్న ఆ నిజాలు ఏంటి?, మహారాష్ట్రలోనే అత్యంత సంచలనం సృష్టించిన ఈ మర్డర్ మిస్టరీ క్లైమాక్స్ ఏంటో చూద్దాం!.
జూన్ 18.. పుణె పోలీసుల ప్రకారం.. సియా, చేతన్ వేసిన ప్రమాదకరమైన ప్లాన్ లాస్ట్ స్టేజీకి చేరిన రోజు ఇది. సియా మళ్లీ కావాలనే కేతన్‌ను లోహగఢ్ కోటకు ట్రెక్కింగ్‌కు వెళ్దామని ఒప్పించింది. అప్పటికే ఆమె చాలాసార్లు ఆ ప్లేస్‌ను చూసి వచ్చింది కాబట్టి.. దారులు ఎలా ఉన్నాయి?, ఎక్కడ నెట్టేస్తే పని ఈజీగా పూర్తవుతుంది? అనే విషయాలపై ఆమెకు పక్కా క్లారిటీ ఉంది. పోలీసులు చెప్తున్న దాని ప్రకారం.. ఈసారి ప్లాన్ ఎగ్జిక్యూషన్ ఫేజ్‌లోకి వచ్చేసింది. కానీ కథలో ఇంకో ముఖ్య పాత్ర ఉంది.. అతనే చేతన్ చౌదరి. జూన్ 18న చేతన్ ఒక నార్మల్ టూరిస్ట్లా వెళ్లలేదు. తన ఐడెంటిటీని దాచడానికి చేతన్ చాలా పెద్ద నాటకమే ఆడాడు. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండటానికి హుడీ, క్యాప్, మాస్క్, గాగుల్స్, హెడ్‌ఫోన్స్ పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా.. ఆ రోజే తన వైట్ టీ-షర్ట్ మార్చేసి బ్లాక్ టీ-షర్ట్ వేసుకున్నాడు. అలాగే కోటకు వెళ్లడానికి కారు కాకుండా చేతన్ స్కూటర్ వాడాడు. ఎందుకంటే కారులో వెళ్తే టోల్ ప్లాజా దగ్గర రికార్డు అవుతుంది. స్కూటర్ అయితే ఎలాంటి డిజిటల్ ఆధారాలు దొరకవని చేతన్ ప్లాన్.
పైగా తన మొబైల్ లొకేషన్ ట్రాక్ కాకుండా ఉండటం కోసం.. వెళ్లేటప్పుడు పుణెలోని ఒక షాపులో ఫోన్ వదిలేసి వెళ్లాడు. ఇన్వెస్టిగేషన్లో పోలీసులకు ఇంకో షాకింగ్ లూప్‌హోల్ దొరికింది. కొండ పైకి వెళ్లాక ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే వేరే వాళ్లకు అనుమానం వస్తుందని.. సియా, చేతన్‌లు ముందుగానే కొన్ని హ్యాండ్ సిగ్నల్స్ అనుకున్నారు. ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు చేతన్.. సియా, కేతన్ల వెనుకాలే నడుస్తూ వచ్చాడు. సియా నుంచి అనుకున్న సిగ్నల్ రాగానే అతను రంగంలోకి దిగాడు. ఆ తర్వాత.. కేతన్‌ను ఆ లోహగఢ్ కోట పైనుంచి కింద ఉన్న 400 అడుగుల లోతైన లోయలోకి నెట్టేశారు. తలకు తీవ్రమైన గాయాలు కావడంతో కేతన్ స్పాట్లోనే చనిపోయాడు. కానీ మొదట్లో ఈ కేసు ఇలా ఊహించలేదు. కేతన్ డెడ్‌బాడీ దొరికినప్పుడు.. కాలు జారి లోయలో పడి చనిపోయాడని అందరూ అనుకున్నారు. ప్రమాదవశాత్తు జరిగిన మరణంగానే కేసు ఫైల్ చేశారు. కానీ, పోలీసుల ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగుతున్న కొద్దీ ఆ కథ తలకిందులైంది. ఫోరెన్సిక్ రిపోర్టులు, సాక్షుల స్టేట్మెంట్లు, నిందితులను గట్టిగా నిలదీయడంతో.. అసలు నిజం బయటపడి ఇది పక్కా మర్డర్ అని తేలింది.
ఆ తర్వాతే పోలీసులు దేశంలోనే అత్యంత లోతైన ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. మర్డర్ జరిగిన వెంటనే నిందితులు ఇద్దరూ తమ మొబైల్ ఫోన్లలోని డేటాను డిలీట్ చేశారు. ఇప్పుడు సైబర్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఆ డేటాను రికవర్ చేసే పనిలో ఉన్నారు. ఆ డేటా దొరికితే జూన్ 18 కంటే ముందు, ఆ తర్వాత ఏం జరిగిందనే దానికి పక్కా లింక్స్ దొరుకుతాయి. అయితే, వీళ్లు వదిలేసిన డిజిటల్ ఆధారాలే ఈ కేసులో అతిపెద్ద సాక్ష్యాలుగా మారాయి. గత ఆరు నెలల్లో చేతన్, సియాలు ఏకంగా 2,400 సార్లు ఫోన్లో మాట్లాడుకున్నారు. అంటే దాదాపు 238 గంటలు. సుమారు పదిరోజుల సమయం. కొన్ని కాల్స్ అయితే ఏకంగా రెండు, మూడు గంటల పాటు నడిచాయి. ఈ కాల్‌డేటా మొత్తాన్ని పోలీసులు ఇప్పుడు విశ్లేషిస్తున్నారు. కానీ ఈ ఇన్వెస్టిగేషన్లో అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే.. సీసీటీవీ ఫుటేజ్!. చేతన్ ముఖానికి ముసుగు వేసుకోవడం వల్ల సీసీటీవీలో అతని ఫేస్ క్లియర్‌గా కనిపించలేదు.
దీంతో పోలీసులు ఒక సరికొత్త టెక్నాలజీని వాడారు.. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గేట్ అనాలసిస్. అసలు గేట్ అనాలసిస్ అంటే ఏంటో తెలుసా?. ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక విభిన్నమైన నడక శైలి ఉంటుంది. మన ఫింగర్‌ప్రింట్స్ ఎంత విభిన్నంగా ఉంటాయో.. మనం అడుగులు వేసే విధానం, నడిచేటప్పుడు మన బాడీ పోశ్చర్, స్పీడ్, చేతులు కదిపే తీరు కూడా అంతే విభిన్నంగా ఉంటాయి. ఇప్పుడు పోలీసులు ఈ AI సాఫ్ట్వేర్ సాయంతో.. సీసీటీవీలో ముసుగు వేసుకుని నడుస్తున్న వ్యక్తి నడకను, చేతన్ నార్మల్ నడకతో మ్యాచ్ చేసి చూస్తున్నారు. ముఖం కనపడకపోయినా.. నడిచే తీరును బట్టి ఆ వ్యక్తి చేతనే అని నిరూపించడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. దీంతో పాటు, కోటపై నుంచి కేతన్‌ను ఖచ్చితంగా ఏ స్పాట్ నుంచి నెట్టేశారో తెలుసుకోవడానికి సియా, చేతన్‌లను కస్టడీలోకి తీసుకుని మళ్లీ లోహగఢ్ కోటకు పోలీసులు తీసుకెళ్లారు. అక్కడ క్రైమ్ సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. ఆ రోజు వాళ్లు వేసిన ప్రతి అడుగు.. ఇచ్చిన ప్రతి సిగ్నల్.. ప్రతి నిమిషాన్ని మళ్లీ ప్రాక్టికల్‌గా చేసి చూశారు. ఎందుకంటే, నిందితులను అరెస్ట్ చేసినా కూడా.. కేతన్ ఎక్కడి నుంచి పడ్డాడనే దానికి పక్కా స్పాట్ దొరకలేదు. అందుకే పోలీసులు మళ్లీ ఆ కొండపైకి వెళ్లాల్సి వచ్చింది.
ప్రస్తుతం ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తూనే ఉంది. ఈ కేసును ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ప్రముఖ లాయర్ ఉజ్వల్ నికమ్ ఈ కేసును వాదించబోతున్నారు. పుణె పోలీసులు సేకరించిన ఈ ఆధారాలన్నిటినీ ఇప్పుడు కోర్టు పరిశీలించబోతుంది. చట్టం ప్రకారం కోర్టులో తప్పు రుజువయ్యే వరకు నిందితులను దోషులుగా డిసైడ్ చేయలేం. కానీ ఒక్కటి మాత్రం నిజం.. ఈ మర్డర్ మిస్టరీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసులు చెప్తున్నది నిజమేనా?, ఈ డిజిటల్ ఆధారాలు, సైబర్ ఫోరెన్సిక్స్, AI టెక్నాలజీ, సాక్షుల మాటలు నిందితులకు శిక్ష పడేలా చేస్తాయా?.. లేక, కోర్టు ట్రయల్స్‌లో ఇంకేదైనా కొత్త ట్విస్ట్ బయటకు వస్తుందా?. ఈ ప్రశ్నలన్నిటికీ కోర్టులోనే సమాధానం దొరుకుతుంది. అప్పటివరకు ఈ లోహగఢ్ కోట మర్డర్ కేసే దేశంలోనే అత్యంత ఆసక్తికరమైన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్!.









